Benefits Surya Dev Worship On Sunday : సమస్త జీవరాశికి ఆహారాన్ని అందించేది సూర్య భగవానుడే అని శాస్త్రం చెబుతోంది. అందుకే సూర్య ఆరాధనకు వారాల్లో తొలి వారమైన ఆదివారాన్ని కేటాయించారు పెద్దలు. ఆహార ప్రదాత అయిన సూర్యునికి నమస్కరించి కృతజ్ఞతలు తెలపడం అనాదిగా వస్తున్న ఆచారం. సూర్యునికి నమస్కరించకుండా చేసే పూజలు కూడా ఎలాంటి ఫలితాలు ఇవ్వవని శాస్త్రం చెబుతోంది. ఆదిత్యునికి నమస్కరించకుండా రోజును ప్రారంభించకూడదని కూడా పెద్దలు అంటారు.
తొలిపూజ ఆదిత్యునికి
సాధారణంగా అందరూ ఇంట్లో నిత్య పూజలు చేస్తుంటారు. తమ యోగ క్షేమాలను ఓ కంట కనిపెట్టే తమ ఇష్ట దేవతలను, కుల దేవతలను ఆరాధిస్తూ ఉంటారు. దైవానుగ్రహంతోనే తమకి మంచి జరుగుతుందని తమ ఇష్టదేవతను అంకితభావంతో పూజిస్తూ, నైవేద్యాలు సమర్పిస్తుంటారు. కానీ ముందుగా సూర్యునికి అర్ఘ్యం ఇచ్చి పూజ ఆరంభించాలని శాస్త్రం చెబుతోంది.
ప్రత్యక్ష నారాయణుడు
సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుని ప్రత్యక్ష స్వరూపమైన సూర్య భగవానుడికి భక్తితో అర్ఘ్యం ఇచ్చిన తర్వాతనే ఇష్ట దేవతారాధనకి కావలసిన అర్హత లభిస్తుందని మహర్షులు అంటారు.
సూర్య ఆరాధన ఎలా చేయాలి
ప్రతిరోజూ స్నానాదికాలు ముగించుకున్న తర్వాత ముందుగా ఓ రాగి పాత్రలో జలాన్ని తీసుకొని సూర్యునికి ఎదురుగా నిలబడి మూడు సార్లు దోసిట్లో నీళ్లు పోసుకుని అర్ఘ్యం ఇవ్వాలి. తరువాత నిత్య పూజలు మాములుగా చేసుకోవచ్చు.
ఆదివారం ఆదిత్యునికి అంకితం
ఆదివారం సూర్య ఆరాధనకు శ్రేష్టమని శాస్త్రం చెబుతోంది. ఆదివారం రోజు చేసే సూర్య ఆరాధన కోటి రెట్లు ఫలితాన్ని ఇస్తుంది. ఆదివారం సూర్యోదయం సమయంలో సూర్యునికి అర్ఘ్యం ఇచ్చి, సూర్యునికి ఎదురుగా నిలబడి 12 సార్లు సూర్య నమస్కారాలు చేయడం వలన దారిద్య్ర బాధలు తొలగిపోతాయని శాస్త్ర వచనం.
ఆరోగ్య ప్రదాత
ఆదివారం 12 సార్లు ఆదిత్య హృదయం పారాయణం చేస్తే దీర్ఘకాలంగా పీడిస్తున్న అనారోగ్య సమస్యలు దూరమవుతాయని శాస్త్రం చెబుతోంది.