Bali Chakravarthi Story : హిందూ ధర్మశాస్త్రం కలియుగంలో నామ స్మరణకు ఎంత ప్రాముఖ్యం ఉందో అంతకు పదిరెట్లు దానం వల్ల కలుగుతుందని చెబుతోంది. 'పంచుకో పెంచుకో' సిద్ధాంతాన్ని పాటించడం వల్ల ఆధ్యాత్మిక శాంతి దొరుకుతుంది. అంటే మన దగ్గర ఉన్నదాన్ని నలుగురితో పంచుకుంటే సంపద మరింత పెరుగుతుందని అర్ధం. ఈ కథనంలో దానం ఎంత గొప్పదో తెలుసుకునే ఒక పౌరాణిక ఇతివృత్తం గురించి తెలుసుకుందాం.
దానం విశిష్టత
కుడిచేత్తో చేసిన దానం ఎడమ చేతికి కూడా తెలియకూడదని పెద్దలు అంటారు. అంటే చేసిన దానం గురించి ఎప్పుడు గొప్పలు చెప్పుకోకూడదు. చేసిన దానం మర్చిపోవాలి. పొందిన మేలును జీవితాంతం గుర్తుంచుకోవాలి. దానం చేయాలని మనలో ఏ కొద్ది మందికో ఉంటుంది. చాలా మందికి దానం చెయ్యడం వల్ల వచ్చే ఫలితం తెలియక దానధర్మాలు చేయకుండా జీవితం సాగిస్తుంటారు. మన పురాణాలు చేసిన ధర్మం వల్లే మనకు కామితార్ధాలు అన్నీ సమకూరుతాయని తెలియజేస్తోంది.
బలి చక్రవర్తి
బలి చక్రవర్తి గురించి ఎంతటి గొప్ప ధనవంతుడో అందరికీ తెలుసు. తన ప్రాణాలకే ప్రమాదం అని తెలిసి కూడా బలి చక్రవర్తి సాక్షాత్ శ్రీమహావిష్ణువుకే మూడు అడుగుల భూమిని దానం చేసి మహనీయుడిగా, గొప్ప దాతగా చరిత్రలో నిలిచిపోయాడు. అతనికి అంతటి గొప్ప అవకాశం రావటానికి కారణం తను గత జన్మలో చేసుకొన్న పుణ్యమే.
బలి చక్రవర్తి గత జన్మ వృత్తాంతం
బలి గత జన్మలో ఒక దరిద్రుడు. అంతేకాదు దేవునిపై నమ్మకం లేకుండా నాస్తికునిలా వేద పండితులనూ దేవతలనూ నిత్యం దూషిస్తూ తిరుగుతుండేవాడు. అతను దరిద్రుడే అయినా వేశ్యా లోలుడు. ఒక సారి వేశ్యా సంగమానికి సిద్ధమై ఎలాగో తను సంపాదించిన తాంబూలం, సుగంధ ద్రవ్యాలూ, శ్రీ చందనం, కర్పూరం, మల్లె పూలూ ఇత్యాది భోగ వస్తువులను ఒక సంచీలో పెట్టుకొని వేశ్యా వాటికకి బయల్దేరాడు.
అపస్మారక స్థితిలో శివార్పణం చేస్తున్న ఊహ
వేశ్యా వాటికకు బయల్దేరిన అతను మార్గమధ్యంలో కాలుజారి నేల మీద పడ్డాడు. అలా పడేటప్పుడు తన తలకి బలంగా గాయమై మూర్చపోయాడు. ఆ సమయంలో అతనికి ఒక విచిత్రమైన ఊహ కలిగింది. తన దగ్గరున్న ఈ పరిమళ ద్రవ్యాలన్నీ శివుడికి నివేదన చేస్తున్నట్టు. ఆ ఊహలో ఉండగానే అతను ప్రాణాలు విడిచాడు. తన దగరున్న సర్వస్వాన్నీ భగవంతుడికి ఊహా మాత్రంగా నివేదించిన పుణ్యఫలానికి ఆ పరమేశ్వరుడి దయవల్ల అతనికి గొప్ప పుణ్యఫలం లభించింది.
శివార్పణ ఊహతో గర్భ దరిద్రునికి ఇంద్రపదవి
మరణించిన వారిని యమభటులు నరకానికి తీసుకుపోయారు. అక్కడ యముడు అతని పాప పుణ్యాలని విచారించగా అతనికి చేసిన పాపాలకిగానూ ఘోరమైన నరక శిక్షలు విధించాల్సి ఉందని చిత్రగుప్తుడు చెప్పాడు. కానీ అతడు తన చివరి ఘడియలలో తన దగ్గరున్న యావత్తూ ఆ పరమేశ్వరుడికి నివేదిస్తున్నట్టు భావించినందుకు మూడు ఘడియల పాటు ఇంద్ర పదవిని చేపట్టాల్సి ఉందని, అలా మూడు ఘడియలు పూర్తయ్యాక అతడ్ని నరకంలో శిక్షించవచ్చని చెప్పాడు.
పాపికి పశ్చాత్తాపం
చిత్రగుప్తుడు చెప్పింది విన్న ఆ పాపికి తను ఇన్నాళ్లు తాను చేసిన పనులెంత ఘోరమైనవో తెలిసింది. 'జన్మ చివరలో దేవుడికే అన్నీ దానం చేస్తున్నా అని అనుకోగానే ఇంత ఫలితం వచ్చింది. అలాంటిది తను నిజంగానే దానం చేస్తే ఎంత బాగుంటుంది?' అనిపించింది. ఇంతలో ఇంద్రుడు, ఇంద్రగణాలు, అప్సర గణాలు మొత్తం అక్కడికి వచ్చి ఆ వేశ్యాలోలుడిని ఐరావతం మీద ఎక్కించుకొని సకల లాంఛనాలతో సాదరంగా స్వర్గానికి తోడ్కొని వెళ్లారు.
ఋషులకు అమూల్యమైన కానుకలు దానం
దాన మహత్యం తెలుసుకున్న అతడు ఇంద్ర సింహాసనం మీద కూర్చున్న వెంటనే అగస్త్యుడికి ఐరావతాన్ని, విశ్వామిత్రుడికి ఉచ్చైశ్రవాన్నీ, వశిష్టుడికి కామధేనువునూ, గాలవుడికి చింతామణినీ, కౌండిణ్యుడికి కల్ప తరువునూ ఇలా ఇంద్ర లోకంలోని విలువైన సంపదనంతా గొప్ప గొప్ప మహర్షులకి దానం చేసేసాడు. వారంతా ఎంతగానో సంతోషించి అతన్ని ఆశీర్వదించారు.
ఇంద్రుని ఆగ్రహం
మూడు ఘడియల కాలం పూర్తి కాగానే ఇంద్రుడు అక్కడకి వచ్చి ఐరావతం మొదలు పారిజాత వృక్షం వరకూ అన్నిటినీ ఆ వేశ్యాలోలుడు దానం చేయడం తెలుసుకొని కోపగించుకొన్నాడు. ఇంతలో యముడు అక్కడికి వచ్చాడు ఆ పాపిని మళ్లీ నరకానికి వెళ్లడానికి సిద్ధంకమ్మన్నాడు. అయితే మరలా చిత్రగుప్తుడు అడ్డు చెప్పి అతడు ఈ మూడు ఘడియల కాలంలో చేసిన పుణ్య ఫలితం వల్ల తను ఇక మీదట నరకానికి రానవసరం లేదని, మరు జన్మలో మహా చక్రవర్తిగా భూమి మీద జన్మిస్తాడని చెప్పాడు. అయితే గత జన్మలో చేసిన చెడ్డ పనులకి గానూ రాక్షస వంశానికి రాజౌతాడని చెప్పాడు.
చిరంజీవిగా బలి చక్రవర్తి
ఆ దాన ఫలితంగా అతను బలి చక్రవర్తిగా అవతరించి సాక్షాత్ శ్రీ మహా విష్ణువుకే మూడు అడుగుల రూపేణా మూడు లోకాలను దానం చేసిన పుణ్యాన్ని పొందాడు. చిరంజీవిగా పాతాళానికి రాజై నిలిచిపోయాడు. చూసారా. దానం ఎంత గొప్పదో. దానం చేసినట్లు ఊహించినంత మాత్రానికే ఇంద్ర పదవిని పొందితే ఇక నిజంగా మంచి మనసుతో దానం చేస్తే కలిగే ఫలితాలు ఎంత గొప్పగా ఉంటాయో కదా. మనం కూడా మనకున్నంతలో మంచి మనసుతో దానం చేద్దాం. పుణ్యగతులు పొందుదాం. సర్వే జనా సుఖినోభవంతు! లోకా సమస్తా సుఖినోభవన్తు!
ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం
ఒకే వేదికపై ముగ్గురు అవతార మూర్తులు- గుడిలో అరుదైన గోదాదేవి విగ్రహం- ఎక్కడో తెలుసా?
భూలోక వైకుంఠం శ్రీరంగం గురించి ఈ విషయాలు తెలుసా? ధనుర్మాసంలో తప్పకుండా వెళ్లాల్సిందే!