తెలంగాణ

telangana

ETV Bharat / spiritual

బ్రహ్మోత్సవాల్లో చక్రస్నానం ఎందుకు చేస్తారు? ఈ విషయాలు మీకు తెలుసా? - SRIVARI CHAKRASNANAM

శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు- చక్రస్నానం, స్నపన తిరుమంజనం విశిష్టత

Srivari Chakrasnanam
Srivari Chakrasnanam (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Oct 11, 2024, 8:20 PM IST

Srivari Chakrasnanam Significance : కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో చివరిరోజు అక్టోబర్ 12వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు చక్రస్నానం జరుగుతుంది. ఈ సందర్భంగా బ్రహ్మోత్సవాల చివరిరోజు నిర్వహించే చక్రస్నానం విశిష్టత ఏమిటి? అసలు చక్రస్నానం ఎందుకు నిర్వహిస్తారు తదితర ఆసక్తికర విషయాలను ఈ కథనంలో తెలుసుకుందాం.

శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా ఎనిమిది రోజుల పాటు వివిధ వాహన సేవల పేరిట ఘనంగా జరిగే ఈ ఉత్సవాలు తొమ్మిదో రోజు ఉదయం పవిత్ర పుష్కరిణిలో స్వామి వారి సుదర్శన చక్రస్నానంతో పరిసమాప్తి అవుతుంది. బ్రహ్మోత్సవాలనే పవిత్ర యజ్ఞానికి ముగింపు పలికే ఈ చక్రస్నానం కూడా అవబృధ స్నానం వంటిదని శాస్త్ర వచనం. అవబృధ స్నానం అంటే ఏదైనా యజ్ఞం పరిసమాప్తి అయినప్పుడు యజ్ఞ మంత్రాలతో పునీతమైన కలశాలలోని పవిత్ర జలాలతో చేయించే మంగళ స్నానం.

సుదర్శన చక్రం అంటే?
హిందూ పురాణాల ప్రకారం శ్రీ హరిని విశ్వానికి రక్షకుడిగా పిలుస్తారు. శ్రీ మహా విష్ణువుకు నాలుగు చేతులలో కుడి చేతిలో పై భాగంలో పద్మం, మరో చేతిలో గద, ఎగువ ఎడమ చేతిలో శంఖం, మరో చేతిలో సుదర్శన చక్రం ఉంటుంది. ఈ చక్రానికి విష్ణుమూర్తి ఎనిమిదో అవతారమైన గోపాలునికి అవినాభావ సంబంధం ఉంది. ఈ సందర్భంగా విష్ణువు చేతికి అత్యంత శక్తివంతమైన సుదర్శన చక్రం ఎలా వచ్చింది. విష్ణుమూర్తికి ఈ చక్రాన్ని ఎవరిచ్చారనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

శివారాధన కోసం కాశీకి వెళ్లిన విష్ణుమూర్తి
వేదవ్యాసుడు రచించిన వామన పురాణం ప్రకారం కార్తీక మాసం శుక్ల చతుర్దశి తిథి రోజున శ్రీ మహా విష్ణువు శివయ్యను పూజించేందుకు ఓసారి కాశీకి వెళ్లాడు. అక్కడ మణికర్ణికా ఘాట్‌లో స్నానం చేసిన తర్వాత, వెయ్యి బంగారు తామర పువ్వులతో శివుడిని పూజిస్తానని మొక్కుకున్నాడు.

విష్ణుభక్తికి శివయ్య పరీక్ష
శివపూజకు వేయి తామరపూలు సిద్ధం చేసుకొని, సంప్రోక్షణ తర్వాత విష్ణువు పూజను ప్రారంభించే వేళ శివయ్య తన భక్తిని పరీక్షించ దలచి వేయి తామర పూవులలో ఒక తామర పువ్వును తగ్గించాడు.

నేత్రమే తామరగా!
ఆ సమయంలో విష్ణువు తాను మొక్కుకున్నట్టు వెయ్యి తామర పువ్వులను సమర్పించాల్సి వచ్చింది. అయితే ఒకటి తక్కువైన సందర్భంలో విష్ణువు తామర పువ్వును పోలి ఉన్న తన కళ్ళను తామర పువ్వు స్థానంలో సమర్పించాలని నిర్ణయించుకుంటాడు. తన కళ్లను శివయ్యకు సమర్పించడానికి సిద్దపడే లోపు, శివుడు తన ముందు ప్రత్యక్షమై "ఓ శ్రీహరి! విశ్వంలో నీలాంటి భక్తుడు లేడు! నీ భక్తికి మెచ్చాను" అని శివుడు శ్రీహరికి సుదర్శన చక్రాన్ని సమర్పించి, ఈ చక్రం రాక్షసులను నాశనం చేస్తుందని, మూడు లోకాల్లో ఇది సాటిలేని ఆయుధమని చెప్పాడు. విష్ణువుతో సమానంగా సుదర్శన చక్రం కూడా పూజలందుకుంటుందని, అలా పూజించిన వారికి వైకుంఠ లోక ప్రాప్తి లభిస్తుందని వరమిచ్చాడు. ఆనాటి నుంచి సుదర్శన చక్రం పూజలందుకుంటోంది.

చక్రస్నానం ఇలా!
శ్రీవారి బ్రహ్మోత్సవాలలో చివరిరోజు శ్రీవారి పుష్కరిణిలో వైభవంగా చక్రస్నానం జరుగుతుంది. అంతకుముందు శ్రీవారు, ఉభయదేవేరులు, చక్రత్తాళ్వారుకు స్నపన తిరుమంజనం శాస్త్రో‌క్తంగా జరుగుతుంది.

స్నపన తిరుమంజనం
స్నపన తిరుమంజనంలో భాగంగా ముందుగా విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం, ముఖ ప్రక్షాళన, ధూప దీప నైవేద్యం, ఛత్ర ఛామర వ్యంజన దర్పణాది నైవేద్యం, రాజోపచారం నిర్వహిస్తారు. అర్ఘ్యపాద నివేదనలో భాగంగా పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, గంధంతో స్నపనం జరుగుతుంది. వీటిని శంఖనిధి, పద్మనిధి, సహస్రధార, కుంభధారణలతో వైఖానస ఆగమయుక్తంగా జరిగే స్నపన తిరుమంజనం కళ్లారా చుసిన వారికి అనంత పుణ్యం.

చక్రస్నానం
భక్తుల గోవింద నామాలతో తీరు వీధులన్నీ మారు మ్రోగుతుండగా అశేష జనవాహిని మధ్య శ్రీ సుదర్శన చక్రత్తాళ్వార్లకు శ్రీవారి పుష్కరిణిలో ఆగమ శాస్త్రోక్తంగా చక్రస్నానం నిర్వహిస్తారు. అనంతరం అదే రోజు రాత్రి నిర్వహించే ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.

ఐశ్వర్యప్రాప్తి - మోక్షం
బ్రహ్మోత్సవాలలో చివరి రోజు జరిగే చక్రస్నానం దర్శించినవారు ఇహలోకంలో అష్టైశ్వర్యాలు అనుభవించి అంత్యమున మోక్షం పొందుతారు.

ధ్వజావరోహణం
చక్రస్నానం నాటి సాయంకాలం ధ్వజావరోహణం యథావిధిగా చేస్తారు. ఇంతటితో బ్రహ్మోత్సవయజ్ఞం మంగళాంతం అవుతుంది. ఎవరైతే బ్రహ్మోత్సవాలలో పాలు పంచుకొంటారో వారు సమస్త పాపవిముక్తులై, ధనధాన్య సమృద్ధితో తులతూగుతారు. ఆ శ్రీనివాసుని అనుగ్రహంతో అప మృత్యు నాశనం, రాజ్యపదవుల వంటి సకల ఐహిక శ్రేయస్సులు పొందుతారు. ఆ శ్రీనివాసుని కరుణాకటాక్షాలు భక్తులందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమో వేంకటేశాయ! ఏడుకొండలవాడా! వేంకటరమణా! గోవిందా! గోవిందా!

ముఖ్యగమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ABOUT THE AUTHOR

...view details