Tirumala Garuda Vahana Seva : శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో రోజున సాయంత్రం గరుడ వాహన సేవ జరుగుతుంది. సృష్టి కర్త బ్రహ్మ మొదలు పెట్టిన బ్రహ్మోత్సవాలకు ముక్కోటి దేవతలకు ఆహ్వానం పలికేది గరుత్మంతుడు. కనుక గరుడ వాహన సేవకు ఎంతో ప్రాధాన్యం ఉంది. అందుకే స్వామివారి వాహన సేవల్లో అత్యంత కీలకమైన గరుడ వాహన సేవ విశిష్టతను ఈ కథనంలో తెలుసుకుందాం.
గరుడ వాహన సేవ విశిష్టత
దాస్యానికి ప్రతిరూపం గరుడ వాహన సేవ. ఈ గరుడ వాహనం ద్వారా స్వామి వారు దాసానుదాస ప్రపత్తికి తాను దాసుడని తెలియజేస్తారు. అంతేగాదు జ్ఞానవైరాగ్య సిద్ధి కోసం తపించే మానవులు జ్ఞానవైరాగ్యాలనే రెక్కలుగా చేసుకొని భగవంతుని తన భుజస్కందాలపై మోస్తూ విహరించే భగదధిష్టుతుడైన గరుడుని దర్శిస్తే సర్వపాపాలు తొలగిపోతాయని భక్తకోటి విశ్వాసం. అందుకే బ్రహ్మోత్సవాల్లో కీలకమైన గరుడ సేవకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారు. శ్రీవారి గరుడ సేవను చూడటానికి ముక్కోటి దేవతలు భూమిపైకి వస్తారని బ్రహ్మాండ పురాణంలో వివరించారు.
సమస్త వాహనాలలో సర్వ శ్రేష్టం గరుడ వాహనం
గరుడ సేవలో ధ్రువ మూర్తి వేంకటేశ్వరస్వామికి, ఉత్సవమూర్తి మలయప్ప స్వామికి భేదం లేదు. అందుకే మలయప్ప స్వామిని గరుడ వాహనంపై ఉండగా వీక్షించడం మోక్షదాయకం. ‘నానా దిక్కుల నరులెల్లా’ అంటూ అన్నమయ్య కీర్తించిన రీతిలో గరుడ సేవ రోజు తిరుమల మొత్తం అనంత భక్త సాగరాన్ని తలపిస్తుంది. ఏ నోటా విన్నా గోవిందా నామమే! అన్ని దారులు తిరుమలకే!
వెలకట్టలేని ఆభరణాలు
గరుడ వాహనంపై విహరించే ఉత్సవమూర్తికి వెలకట్టలేని ఆభరణాలైన మకర కంఠి, సహస్రనామ మాల, లక్ష్మీ హారాలను అలంకరిస్తారు. ముఖ్యంగా స్వామి వారి మూల విరాట్టుకు అలంకరించే హారాలను ఈ రోజు మలయప్ప స్వామికి అలంకరిస్తారు. అందుకే గరుడ సేవలో స్వామిని దర్శించుకుంటే ఆనంద నిలయంలో శ్రీనివాసుని దర్శించుకున్నట్లే! అత్యంత కీలకమైన గరుడ వాహన సేవలో పాల్గొనే భక్తులు శ్రీవారి కృపాకటాక్షాలకు పాత్రులవుతారని, సకల పాపాలు తొలగిపోతాయని, జ్ఞానం లభిస్తుందని పురాణం వచనం. గరుడ వాహనంపై విహరించే శ్రీనివాసునికి నమస్కరిస్తూ - ఓం నమో వేంకటేశాయ!
ముఖ్యగమనిక :పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంత వరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.