Sri Ramanuja Jayanti 2024 : హిందూ ధర్మ పరిరక్షణే ఊపిరిగా హిందూ ధర్మ రక్షణ కోసం నడుం బిగించిన మహనుభావులలో శ్రీ రామానుజాచార్యులు ఒకరు. వైశాఖ శుద్ధ పంచమి శ్రీ రామానుజ జయంతి సందర్భంగా రామానుజాచార్యులు ప్రచారం చేసిన సిద్ధాంతాలను గురించి తెలుసుకుందాం.
విశిష్టాద్వైత సిధ్ధాంత ప్రచారకర్త
రామానుజులు క్రీస్తు శకం 1017 సంవత్సరంలో చెన్నై నుంచి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీపెరంబుదూరులో చైత్ర శుద్ధ పంచమి, ఆరుద్ర నక్షత్రం రోజున జన్మించారు. దాదాపు 123 ఏళ్ళు జీవించిన రామానుజులు విశిష్టాద్వైత సిద్ధాంతం ప్రచారానికి విశేష కృషి చేశారు.
ఆదిశంకరుల బాటలో పయనం
దాదాపు వెయ్యి సంవత్సరాల కిందట ఆది శంకరుల జయంతికి ఒక్క రోజు తర్వాత జన్మించిన రామానుజులు, శంకరుల అద్వైతాన్ని ముందుకు తీసుకెళ్లడానికి అవతరించారు. అయితే ఆదిశంకరుల అద్వైతాన్ని విశేషంగా ప్రచారం చేస్తే రామానుజులు ఆ అద్వైతం శ్రీ మహావిష్ణువే అని నొక్కి చెప్పారు. అద్వైతం అంటే ఉన్నది ఒకటే అని, శైవ వైష్ణవ భేదాలు లేవని శంకరులు ప్రచారం చేసారు. అయితే రామానుజులు కూడా ఉన్నది ఒక్కటే అని ఆ ఒక్కటి శ్రీ మహావిష్ణువే అని ప్రచారం చేయడం గమనార్హం. అందుకే రామానుజులు ప్రచారం చేసింది విశిష్టాద్వైతం అంటారు.
విశిష్టాద్వైతం ఎందుకు
ఆది శంకరుల వారు తమ కాలంలో ప్రబలంగా పాతుకొని పోయి ఉన్న దురాచారాలను ఖండించడానికి అద్వైతాన్ని ప్రచారం చేసారు. కానీ రామానుజుల కాలం నాటికి పరిస్థితులు మారిపోయాయి. హిందూ మతాన్ని బౌద్ధ, జైన మతాల నుంచి కాపాడుకోవాల్సిన అవసరం ఏర్పడింది. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో రామానుజులు నిరాకార పరబ్రహ్మాన్ని ఉపాసించే అద్వైతానికు బదులుగా మూర్తి రూపంలో విష్ణువును పూజించే విశిష్టాద్వైతంను ప్రచారం చేసి ప్రజల్లోకి తీసుకు వచ్చారు.
ఆదర్శవాది
రామానుజులు మనుష్యులంతా ఒక్కటే అని నమ్మిన ఆదర్శవాది. తమిళ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన రామానుజుల కాలంలో అష్టాక్షరీ మంత్రం పరమ రహస్యంగా ఉండేది. ఈ మంత్రం ఎవరు పడితే వారు అనుష్ఠానం చేయకూడదని నియమం ఉండేది. అందుకే సదాచార సంపన్నులైన పెద్దలు, గురువులు అర్హులైన వారికి మాత్రమే అష్టాక్షరీ మంత్రాన్ని ఉపదేశించే వారు. అంతే కాదు ఈ మంత్రాన్ని గురు ముఖతా ఉపదేశం పొందిన వారికి ముక్తి కలుగుతుందని ప్రబల విశ్వాసం. ఎవరైతే ఈ మంత్రాన్ని బహిరంగంగా ప్రకటిస్తారో వారు నరకానికి వెళ్తారన్న మూఢ నమ్మకం కూడా ఆనాటి సమాజంలో ఎక్కువ ఉండేవి.
జనహితమే తనమతం
రామానుజులు సమాజ శ్రేయస్సు కోసం అందరి బాగు కోసం, తానొక్కడు నరకాన్ని వెళ్లినా ఫర్వాలేదని అనుకున్నారు. ఆ రోజుల్లోనే అందరినీ ఎదిరించి ఆలయ గోపురం పైకి ఎక్కి అష్టాక్షరీ మంత్రాన్ని సామాన్యులందరికీ బోధించిన నిస్వార్థపరుడు. ఈ మంత్రోపదేశంతో అందరికీ ముక్తి కలిగితే తన జీవితం ధన్యమని భావించి సహజీవన, సమతా భావాలను ఆనాడే ఆయన ప్రతిపాదించారు.