Sri Hanumadvratam Story : అత్యంత శక్తివంతమైన హనుమద్వ్రతం ఆచరించడం వలన కార్యసిద్ధి, శత్రుజయం కలుగుతుందని విశ్వాసం. హనుమద్వ్రతం శాస్త్రోక్తంగా ఎలా ఆచరించాలో తెలుసుకున్నాం కదా! ఈ కథనంలో హనుమద్వ్రత కథను గురించి తెలుసుకుందాం.
సూత ఉవాచ
పూర్వం గంగాతీరంలో శౌనకాది మహామునులు సూత మహామునిని చూసి "ఓ మహర్షి! సకల కార్యసిద్ధిని, శత్రు జయాన్ని కలిగించే వ్రతం ఏదైనా ఉంటే వివరించమని" ప్రార్థించగా సూత మహాముని ఈ విధంగా చెప్పడం ప్రారంభించాడు. "ఓ మునులారా! పరమ పవిత్రమైన సకల మానవులు ఆచరించదగిన వ్రతం ఒకటుంది. దాని గురించి చెప్తాను జాగ్రత్తగా వినండి" అంటూ చెప్పసాగెను.
పాండవులకు హనుమద్వ్రతం వివరించిన వ్యాసుడు
వ్యాస మహర్షి ఒకసారి ద్వైత వనంలో ఉన్న పాండవుల దగ్గరకు వచ్చాడు. ధర్మరాజు, భార్య ద్రౌపదితో, సోదరులు సహా ఎదురు వెళ్ళి స్వాగతం చెప్పి లోపలికి ఆహ్వానించి అర్ఘ్యపాద్యాలు యిచ్చి భక్తి శ్రద్ధలతో సేవించాడు. అప్పుడు వ్యాసుడు సంతోషించి ధర్మరాజుతో "ఓ ధర్మరాజా! సకల జయాలను కలిగించే అతి రహస్యమైన వ్రతం ఒకటుంది. ఈ వ్రతాన్ని ఆచరిస్తే మీరు పోగొట్టుకున్న రాజ్యాన్ని కూడా తిరిగి పొందుతారు. ఈ వ్రతం సత్వరమే కార్య సిద్ధిని కలిగిస్తుందనీ, వెంటనే ఫలితం అందిస్తుందని" చెప్పాడు. అదే శ్రీ హనుమద్ వ్రతం. దుష్ట గ్రహాల్ని, వ్యాధుల్ని పోగొట్టి సకల శుభాలు, శ్రేయస్సు ఇస్తుందని, దాన్ని ఆచరించి మళ్ళీ రాజ్యాన్ని పొందమని ఉపదేశించాడు.
ద్రౌపదిపై అర్జునుని ఆగ్రహం
పూర్వం ఈ వ్రతాన్ని శ్రీ కృష్ణుడు ద్రౌపదికి బోధించి, దగ్గర ఉండి వ్రతం చేయించాడని దాని ప్రభావం వల్లనే పాండవులకు అఖిల సంపదలు లభించాయని చెప్పాడు. అయితే ద్రౌపది ఈ వ్రతం ఆచరించి హనుమత్ తోరాన్ని చేతికి ధరించి ఉండటాన్ని చూసిన అర్జునుడు ఆ తోరం గురించిన వివరాలు అడుగగా ద్రౌపది హనుమద్ వ్రతం గురించి చెప్పింది. అది విన్న అర్జునుడు కోతిని గూర్చిన వ్రతం ఏమిటని, తన ధ్వజంపై ఉండే ఒక వానరుడు హనుమకు వ్రతం చేయటమేమిటని దుర్భాషలాడాడు. అప్పుడు ద్రౌపది దుఃఖిస్తూ తన అన్న శ్రీ కృష్ణుడు చెప్పి చేయించిన వ్రతం ఇది అని చెప్పింది. అయినా అర్జునుడి శాంతించకుండా ఆమె చేతికున్న తోరాన్ని బలవంతంగా లాగి పారవేశాడు. అప్పటి నుంచి పాండవులకు కష్టాలు ప్రారంభమైనాయనీ, అరణ్య, అజ్ఞాత వాసాలు దాని ఫలితమేనని వ్యాసుడు ధర్మరాజుకు చెప్పాడు. పదమూడు ముడులు గల హనుమత్ తోరాన్ని తీసివేయటం వల్లే పదమూడు ఏళ్ళ అరణ్య, అజ్ఞాతవాసం అని వివరించాడు. కనుక వెంటనే హనుమత్ వ్రతం చేయమని హితవు చెప్పాడు. అప్పుడు ధర్మరాజు వ్యాసునితో 'గతంలో ఎవరైనా ఈ వ్రతం చేసి ఫలితం పొందారా?' అని అడిగాడు. అప్పుడు వ్యాసుడు దానికి సమాధానంగా ఒక కథ చెప్పాడు.