Sravana Masam Vratham 2024 :మిగిలిన మాసాలతో పోలిస్తే వర్షాలు అధికంగా కురిసే శ్రావణ మాసంలో రోగాలు కూడా ఎక్కువే! అందుకే ఈ మాసంలో పూజలు, వ్రతాల పేరుతో అనేక ఆహార నియమాలు ఏర్పాటు చేశారు పెద్దలు. మిగతా మాసాలతో పోలిస్తే శ్రావణంలో శరీరంలో రోగనిరోధక శక్తి సన్నగిల్లుతుంది. అందుకే పౌష్టికాహారం తీసుకోవడం తప్పనిసరి.
సూపౌదన వ్రతం విశిష్టత
కొంతమంది ఎప్పుడు చూసినా ఏదో ఒక అనారోగ్యంతో బాధపడుతూ కనిపిస్తుంటారు. ఎన్ని రకాల మందులు వాడినా పెద్దగా ఫలితం కనిపించలేదని చెబుతుంటారు. ఇలా అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్న వాళ్లు అనారోగ్యాలు దరిచేరకుండా సంపూర్ణ ఆరోగ్యం చేకూరడానికి 'సూపౌదన వ్రతం' చేయాలని శాస్త్రం చెబుతోంది. ఈ వ్రతం గురించి పురాణాల్లో ప్రస్తావన లేకపోయినా శ్రావణమాసం నోములు, వ్రతాలలో ఈ వ్రతం గురించిన ప్రస్తావన ఉంది. అలాగే ఆయుర్వేద గ్రంధాలలో కూడా ఈ వ్రతం గురించి వివరించారు.
సూపౌదన అంటే?
'సూప + ఓదనం', సూప అంటే పప్పు అని, ఓదనం అంటే అన్నం అని అర్థం. మనం జాగ్రత్తగా గమనిస్తే శ్రావణంలో చేసే వ్రతాలలో, పూజలలో 'పులగం' ప్రధాన ప్రసాదంగా ఉంటుంది. అన్నం పెసరపప్పు కలిపి చేసే పులగం రోగ నిరోధక శక్తిని పెంచి శరీరానికి బలాన్ని ఇస్తుంది. అన్ని రకాల పప్పు దినుసుల్లోకెల్లా పెసలు శ్రేష్టమైనవి.
సూపౌదన వ్రతం ఎప్పుడు చేయాలి
శ్రావణ శుద్ధ షష్ఠి రోజున ఈ వ్రతాన్ని ఆచరించవలసి ఉంటుంది. ఈ ఏడాది ఆగస్టు 10 వ తేదీ శనివారం శ్రావణ శుద్ధ షష్ఠి కాబట్టి ఈ రోజునే సూపౌదన వ్రతం ఆచరించాలి.
సూపౌదన వ్రత పూజకు శుభసమయం
ఆగస్టు 10వ తేదీ శనివారం షష్టి తిథి పూర్తి సమయం ఉంది కాబట్టి ఈ రోజు ఉదయం 8 గంటల నుంచి 9 గంటల లోపు పూజ చేసుకోవడానికి శుభ సమయమని పండితులు చెబుతున్నారు.