Somvati Amavasya Pooja Process In Telugu :సోమవారం రోజు వచ్చే అమావాస్యకు శాస్త్రాల్లో ప్రత్యేక స్థానం ఉంది. దీనినే సోమవతి అమావాస్య అని పిలుస్తారు. ఈరోజు వివిధ దేవతలకు చేసే పూజలు, పాటించే పరిహారాల ద్వారా సకల శుభాలు కలుగుతాయని పురాణాలు గోచరిస్తున్నాయి. మరి ఉగాది పర్వదినానికి ముందురోజు వస్తున్న ఈ సోమవతి అమావాస్యకు సంబంధించి మరిన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
సోమవతి అమావాస్య ఏ రోజున వస్తుంది?
Somvati Amavasya April 2024 : హిందూ పంచాంగం ప్రకారం ప్రతి నెలలో అమావాస్య వస్తుంది. అయితే ఈ అమావాస్య సోమవారం రోజున వస్తే దానిని సోమవతి అమావాస్య అని అంటారు. ఈనెల 8వ తేదీన సోమవతి అమావాస్య వస్తుంది.
సోమవతి అమావాస్య పురాణ కథనం!
Somvati Amavasya Significance :దక్ష ప్రజాపతి తాను చేస్తున్న యజ్ఞానికి తన కుమార్తె సతీదేవిని అలాగే అల్లుడైన పరమశివున్ని ఆహ్వానించకుండా వారిని అవమానిస్తాడు. శివుడు వద్దన్నా వినకుండా యజ్ఞానికి ఆహ్వానం లేకుండా వెళ్లిన సతీదేవి అవమానానికి గురై శరీరాన్ని త్యాగం చేస్తుంది. సతీదేవి మరణ వార్త తెలిసి ఆగ్రహించిన శివుడు తన జటాజూటం నుంచి వీరభద్రుడిని సృష్టిస్తాడు. సమస్త ప్రమథ గణాలతో కలిసి వీరభద్రుడు దక్ష యజ్ఞాన్ని ధ్వంసం చేసి యాగానికి వచ్చిన వారందరిని చితకబాదుతాడు. శివుడిని అవమానించే కార్యక్రమంలో పాల్గొన్నందుకు శివగణాల చేతిలో చంద్రుడు కూడా చావు దెబ్బలు తింటాడు.
ఆ సమయంలో ఒంటినిండా గాయాలతో తీవ్రమైన బాధతో చంద్రుడు పరమశివున్ని శరణు వేడుకుంటాడు. చంద్రుని అవస్థను చూసి మనసు కరిగిన భోళాశంకరుడు త్వరలో రానున్న అమావాస్యతో కూడిన సోమవారం నాడు తనకు అభిషేకం జరిపిస్తే తిరిగి చంద్రుడు సంపూర్ణ ఆరోగ్యవంతుడు అవుతాడని అభయమిస్తాడు. ఆనాటి నుంచి సోముడు అంటే చంద్రుడి పేరిట సోమవారం అమావాస్య కలిసి వచ్చిన రోజును సోమవతి అమావాస్యగా మనం జరుపుకుంటున్నాం.
సోమవతి అమావాస్య పూజావిధానం
సోమవతి అమావాస్య రోజున నదిలో స్నానం చేసి పరమశివునికి గంగా జలంతో, పంచామృతాలతో అభిషేకం చేస్తే విశేషమైన ఫలితం లభిస్తుందని శాస్త్రం చెబుతోంది.