Significance Of Wearing Bangles :కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టేశాం. మన పెద్దల కాలం నుంచీ, తరతరాలుగా పాటిస్తూ వస్తున్న కొన్ని నమ్మకాల వెనుక కేవలం మూఢవిశ్వాసం ఉందా? లేక శాస్త్రీయకోణం ఏదైనా ఉందా! అసలు వీటిని ఎంత వరకు నమ్మి, పాటించవచ్చు? శాస్త్రీయత మేళవించిన అలాంటి ఒక 'మూఢ' నమ్మకం గురించి తెలుసుకుందాం.
నమ్మకాల వెనుక శాస్త్రీయత ఎంత?
ఆధునిక యుగంలో మానవుని జీవనశైలి మారింది. రాకెట్ రోజుల్లో ఉన్నాం. టెక్నాలజీతో అద్భుతాలని సాధిస్తున్నాం. చంద్రునిపైకి అడుగు పెట్టేంత అభివృద్ధిని సాధించాం. కానీ ఇంకా ఎక్కడో ఒక మూలన కొన్ని నమ్మకాలు మాత్రం మనల్ని విడిచిపెట్టడం లేదు. అయితే, మూఢ నమ్మకాలుగా మనం భావించే వీటి వెనుక కొన్ని సార్లు అద్భుతమైన శాస్త్రీయత ఉంది. వాటిని జాగ్రత్తగా పరిశీలిస్తే మన పూర్వీకుల ముందు చూపుకు, వారి జ్ఞానానికి 'ఔరా!' అనిపిస్తుంది.
స్త్రీలు గాజులు వేసుకుంటే మంచిదా? గాజులు వేసుకోకుంటే సుమంగళితనం కాదా?
స్త్రీల అలంకరణకు సంబంధించి ఈ విశ్వాసం సమాజంలో ఉంది. అయితే, కొందరికి గాజులు వేసుకోవడం ఇష్టం ఉండదు. అలాంటి వారు ఈ విశ్వాసాన్ని మూఢ నమ్మకంగా కొట్టిపారేస్తారు. మరి ఇది నిజంగా మూఢ నమ్మకమేనా? లేక, దీని వెనుక శాస్త్రీయత ఏమైనా ఉందా అనేది ఇప్పుడు చూద్దాం.
గాజుల ప్రాచీనత
గాజుల ప్రాచీనత అలంకరణ కోసం గాజుల వాడకం అతి ప్రాచీన కాలం నుంచీ ఉంది. ఉదాహరణకు, సింధు నాగరికత ఉచ్చస్థితిలో ఉన్నప్పుడు దాదాపు 2400 BC-1900 BC ప్రాంతంలో తయారుచేసిన ఈ 'నాట్యగత్తె' బొమ్మ చేతులకి గాజులు ఉన్నాయి.
అయితే, ఇవి స్త్రీలకీ, గాజులకీ మాత్రమే పరిమితం కాదు. అనేక ఆకారాలలో, పెద్దవీ, చిన్నవీ – రకరకాల గాజులతో పాటు వేర్వేరు కడియాలు, కంకణాలు, వంకీలు, మొ. ఆభరణాలని పిల్లల దగ్గరి నుంచీ వృద్ధుల దాకా ఇప్పటికీ ధరిస్తూనే ఉన్నారు. వీటిలో కడియాలనీ (rigid bracelets), కంకణాలనీ (flexible bracelets) మహిళలే కాదు, పురుషులు కూడా ధరిస్తున్నారు. హిందువులలోనూ, సిక్కుల్లోనూ కొందరు పురుషులు కంకణాలని ధరిస్తారు. వీటినిబట్టి గాజులు, మొ. వాటికి సాంస్కృతికంగా ఉన్న ప్రాధాన్యం తెలుస్తుంది.
నాట్యగత్తె (Photo credit: Gary Todd - CC0,) స్త్రీలు గాజులు వేసుకోవటానికి శాస్త్రీయమైన కారణాలు ఏవైనా ఉన్నాయా?
చేతులకి ఈ విధమైన ఆభరణాలు పురుషులతో పోలిస్తే స్త్రీలకి గాజుల రూపంలో ఎక్కువ స్థిరపడటానికి సామాజిక శాస్త్రవేత్తలు కొన్ని కారణాలను విశ్లేషించారు.
గర్భస్థ శిశువులపై గాజుల శబ్దం ప్రభావం: మన దేశంలో అనేక ప్రాంతాల సంస్కృతుల్లో గర్భిణీ స్త్రీలకి సీమంతం చేసినప్పుడు గాజులని కానుకగా ఇవ్వటం ఆచారంగా ఉంది. పరిశోధనల ప్రకారం దాదాపు 27 వారాల గర్భం తరువాత గర్భస్థ శిశువులు తల్లి పొట్ట లోపలి నుంచే బయటి శబ్దాలని వినగలరు. గాజు (glass) వంటి పదార్థాలతో చేసిన గాజులు (వీటిని క్వార్ట్జ్ ఇసుకతో చేసినందువలన మట్టి గాజులు అని కూడా అంటారు) చేసే శబ్దాలు వినటానికి మృదువుగా ఉంటాయి. స్త్రీలు పనులు చేసుకునేటప్పుడు వచ్చే లయబద్ధమైన శబ్దాలు గర్భంలోని శిశువులకు బయటి ప్రపంచాన్ని కొద్దిగా తెలియజేయటంతో పాటు, జననం తరువాత అవే శబ్దాలు కొనసాగితే తమ అమ్మలని వారు త్వరగా గుర్తు పడతారు.
జననం తరువాత గాజుల శబ్ద ప్రభావం: సంతానం కలిగిన తరువాత మహిళలు వారి దైనందిన కార్యక్రమాలలో ఉన్నప్పుడు శిశువులని ఒకచోట విడిచి, ఆయా పనులు చేసుకోవలసి వస్తుంది. ఆ సమయాలలో నవజాత శిశువులకి ఒంటరితనమూ, దాన్నుంచీ రాగల అభద్రతా కలగకుండా, తమ అమ్మ అక్కడే చుట్టుపక్కలే ఉంది అనే ధైర్యాన్ని అమ్మ చేతి గాజుల శబ్దం ఇస్తుంది.
స్త్రీలు పాదాలకి మువ్వలు (లేక గజ్జెలు) ధరించటం వెనుక కూడా ఇది ఒక బలమైన కారణం అని భావిస్తున్నారు. ఇదే కారణం వలన పాకటం మొదలు పెట్టిన శిశువుల చేతులకి మురుగులూ, కాళ్ళకి చిరుమువ్వలూ వేస్తారు. ఆ విధంగా, ప్రతి క్షణం చూడకపోయినా స్త్రీలకి పిల్లల జాడ తెలుస్తూనే ఉంటుంది. శిశువులు (లేక పిల్లలు) దూరంగా వెళ్లినా, లేక వెళ్ళకూడని వైపులకి వెళ్లినా తల్లులకి వెంటనే తెలుస్తుంది. అలాగే, స్త్రీల గాజుల శబ్దం శిశువులకి ఆకర్షణీయంగా ఉండి, వారి దృష్టి అమ్మ మీదే ఉండేలా చేస్తుంది. శబ్దానికి ఈ శక్తి ఉంది కాబట్టే, వివిధ రకాలైన శబ్దాలను చేసే బొమ్మలని శిశువులకు కానుకలుగా ఇవ్వటం మన ఆనవాయితీ.
చేతి నరాలకి గాజుల వల్ల మంచి వైబ్రేషన్స్ కలుగుతాయా?
గాజుల రాపిడివలన చేతులకి మంచి వైబ్రేషన్స్ కలిగి, స్త్రీల హార్మోన్లు సమతూకంలో ఉంటాయని కొందరు అంటుంటారు. కానీ, దీనికి శాస్త్రీయమైన నిరూపణలు లేవు. అలాగే, ఈ రాపిడి వల్ల కొన్ని వ్యాధులు తగ్గుతాయని అంటుంటారు. కానీ, వాటికి కూడా శాస్త్రీయమైన నిదర్శనాలు లేవు. అంతే కాదు, ఎన్ని గాజులు, ఎంత పెద్దవి లేక చిన్నవి, ఎక్కడెక్కడ ధరిస్తే అవి వైద్యపరమైన సత్ఫలితాలని ఇవ్వగలవు అనే విషయంలో కూడా గట్టి రుజువులు లేవు. వేర్వేరు సంస్కృతుల్లో వేర్వేరుగా ముంజేతుల నుంచీ భుజాల వరకూ గాజులని ధరించే అలవాట్లు ఉన్నాయి. అందువల్ల, మరిన్ని పరిశోధనలు జరిగే కొద్దీ ఈ విషయాలపై మరింత అవగాహన రాగలదు.
అప్పటి వరకూ!
మన పెద్దలు ఏదైనా ఒక నియమాన్ని ఏర్పరిచారంటే దాని వెనుక ఉన్న శాస్త్రీయత గురించి తెలుసుకోవాలి. ప్రతి అంశాన్ని సైన్స్‌తో జోడించి చెబితే కానీ నమ్మని ఆధునిక అమ్మాయిలకు ఆ నియమం వెనుక ఉన్న శాస్త్రీయతను వివరించి చెప్పాలి. అప్పుడు వారు దాని పట్ల అవగాహనతో పాటు గౌరవాన్ని కూడా పెంపొందించుకోగలరు. ప్రతీ ఆచారాన్నీ మూఢ నమ్మకం అని కొట్టి పారేయకుండా దాని వెనుక ఉన్న ప్రయోజనం గురించి తెలుసుకొని పాటిస్తే, అందంతో పాటు సామాజిక ప్రయోజనాన్ని కూడా పొందవచ్చు. సానుకూల దృక్పథంతో ముందుకెళ్తే అంతా విజయమే!
ముఖ్య గమనిక :పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.