Nava Vidha Bhakti Margalu In Telugu : భక్తి ఒక పవిత్రమైన భావన. దైవం పట్ల భక్తి భావన కలవారిని భక్తులు అంటారు. భక్తి యోగం గురించి భగవద్గీతలో వివరించి ఉంది. ఆ ప్రకారంగా భక్తి యోగం వేదాంతాల సారమని తెలుస్తోంది. భగవంతుని చేరుకోడానికి నారద భక్తి సూత్రాలు పలురకాల భక్తి విధాల గురించి పేర్కొన్నది. భక్తుని భగవంతుని దగ్గరకు చేర్చే భక్తి మార్గాల గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.
నవవిధ భక్తి మార్గాలు
బమ్మెర పోతనామాత్యుడు రచించిన భాగవతం ప్రకారం భగవంతుని చేరుకోడానికి నవవిధ భక్తి మార్గాలున్నాయి. 'నవ' అనగా 9 రకాలైన భక్తి మార్గాలు భాగవతంలోని ప్రహ్లాద చరిత్ర ఘట్టంలో ఉంది. 'శ్రవణం కీర్తనం విష్ణోః స్మరణం పాద సేవనం అర్చనం వందనం దాస్యం! సఖ్యమాత్మ నివేదనం' ఈ శ్లోకం ప్రకారం భగవంతుని చేరడానికి అనేక విధాలైన మార్గాలున్నాయి. అవేమిటో వివరంగా తెలుసుకుందాం.
శ్రవణం: శ్రవణం అంటే వినడం. సత్పురుషుల వాక్యాలు, సద్గ్రంథాలు విన్న మానవుడు మంచివాడుగా మారడానికి వీలవుతుంది. భగవంతునికి చేరువ కావడానికి శ్రవణం సులభమైన మార్గం. ఇది జ్ఞానానికి మార్గం చూపుతుంది, దీని వలన మానవులకు భగవంతుని పట్ల విశ్వాసం పెరుగుతుంది. 7 రోజుల్లో మరణిస్తానని తెలిసి కూడా 7 రోజుల్లో భాగవతం విని మోక్షాన్ని పొందిన పరీక్షిత్తు మహారాజు శ్రవణ భక్తి నాశ్రయించి మోక్షాన్ని పొందాడు.
కీర్తనం: భగవంతుని మహిమలను నిరంతరం కీర్తించుట కీర్తనా భక్తి విధానం. భగవంతుని సాక్షాత్కరింప చేసుకోడానికి కీర్తన భక్తి ఉత్తమమైనది. నారదుడు, తుంబురుడు, ప్రహ్లాదుడు, ఆళ్వారులు, నయనార్లు, అన్నమయ్య, రామదాసు మొదలైన వారు కీర్తన భక్తితో పరమపదం పొంది భగంతుని చేరారు.
స్మరణం: భగవంతుని లీలలను మనసులో నిలుపుకొని ఆ లీలను నిరంతరం స్మరించడమే స్మరణ భక్తి విధానం. ఇది నామ స్మరణం, రూప స్మరణం, స్వరూప స్మరణం అని మూడు విధాలు. అనేకమంది మునులు, ప్రహ్లాదుడు, ధ్రువుడు, తులసీదాసు, త్యాగరాజు మొదలైన వారు స్మరణ భక్తితో భగవంతుని చేరి ధన్యులైనారు.
పాద సేవనం: భగవంతుని సర్వావయవాలలో అత్యంత ప్రధానమైనవి పాదాలు. భగవంతుని పాదాలు భక్తితో సేవించడం పాద సేవనం భక్తి విధానం. పాదసేవనం భక్తులు భగవంతునికి చేసే పవిత్ర సేవతో సమానం. భరతుడు, గుహుడు మొదలైన వారు ఈ పాదసేవ ద్వారా ముక్తిని పొంది భగవంతుని చేరారు.
అర్చనం: భగవంతునికి ప్రతిరోజు తులసి పుష్పాదులు, ఇతర సుగంధ ద్రవ్యాలను సమర్పించి అర్చారూపంలో దేవుని పూజించడం అర్చనా భక్తి విధానం. మానవులు తమ ఇంటి దైవాన్ని, తాము నమ్ముకున్న భగవంతుని అర్చనా మూర్తులను ఇంట్లో ప్రతిష్ఠించుకొని పూజాద్రవ్యాలతో ధూప దీప నైవేద్యాలతో నిత్యం దేవతలను అర్చించడం అర్చనా భక్తి విధానం. ప్రస్తుత సమాజంలో ఈ విధానం ఎంతో ప్రాచుర్యంలో ఉంది. విష్ణుదత్తుడు వంటి ఆళ్వారులు, ఎంతోమంది భగవంతునికి నిత్యపూజా కైంకర్యాలు చేసేవారు అర్చనా భక్తయి విధానంతో భగవంతుని సన్నిధి చేరి మోక్షాన్ని పొందారు.
వందనం: వందనం అనగా నమస్కారం. శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో సర్వకాలాల్లో తన మీదే మనస్సు నిలిపి ఉంచి భక్తులై పూజింపుమని, నమస్కరింపుమని ప్రబోధించాడు. ఎన్ని యాగాలు చేసినా, శాస్త్రాలు చదివినా భగవంతునికి నమస్కరించని వాడు ఆ ఫలితాన్ని పొందలేడు. యాగఫలాన్ని పొందలేదని అంటారు. అందుకే దేవునికి చేసే వందనం ఎంతో గొప్ప ఫలాన్ని ఇస్తుంది. కేవలం భక్తి పూర్వకమైన నమస్కారంతో భగవంతుని సులభంగా చేరుకోవచ్చని ఎంతోమంది భాగవతుల కధల ద్వారా తెలుస్తోంది.
దాస్యం: దాస్యం అన్న మాటకు అర్ధం తాను నమ్మిన దైవానికి దాసుడిగా ఉండడం అని. అలా దేవునికి దాసుడిగా ఉండడమే దాస్య భక్తి విధానం. ప్రతి మానవుడు తనకు ఇష్టమైన దేవునకు ఎల్లప్పుడు సేవకుడై, దాసుడై భక్తి శ్రద్ధలతో పూజించాలి. కులశేఖర ఆళ్వారు దాస్య భక్తికి అత్యంత ప్రాధాన్యమిచ్చారు. హనుమంతుడు, లక్ష్మణుడు మొదలైన వారు దాస్య భక్తి నాశ్రయించి దేవుని చేరుకొని ముక్తిని పొందారు.
సఖ్యం: సఖ్యం అనగా స్నేహం. ఒక మంచి మిత్రునితో చేసే స్నేహంతో కలగని మంచిలేదు. ఇక భగవంతునితో స్నేహం చేస్తే ఎంతటి గొప్ప ఫలమో తెలిపేదే సఖ్యం భక్తి విధానం. భగవంతునితో సఖ్యమేర్పరచుకున్న వారు ధన్యులు. కుచేలుడు, అర్జునుడు, సుగ్రీవుడు మొదలైన వారు సఖ్య భక్తితో స్వామికి ప్రీతి పాత్రులైనారు. మోక్షాన్ని పొందారు.
ఆత్మ నివేదన: నవ విధ భక్తి మార్గాలలో చివరిది అత్యంత శ్రేష్టమైనది ఆత్మనివేదనం. ఈ భక్తి మార్గంలో ఇక మనకు జీవితంలో భగవంతుడు తప్ప ఇంకో ధ్యాస లేదన్నట్లు ఏ పని చేసినా, ఏ ఫలితం పొందినా, కష్టంలో, సుఖంలో ప్రతిదీ భగవదర్పణం అనుకుంటూ దేవునికి సర్వస్య శరణాగతి చేయడమే ఆత్మనివేదన భక్తి మార్గం. భగవంతుడు తప్ప అన్యులెవరూ లేరని శరణాగతి కోరడం. భక్తి మార్గాలన్నిటికన్నా ఆత్మ నివేదన మోక్ష మార్గానికి సులభమైన మార్గం. ద్రౌపది, గజేంద్రాదులు ఆత్మ నివేదన భక్తి మార్గంతోనే ముక్తులైనారు.
భగవంతుని పట్ల నిజమైన భక్తి విశ్వాసాలు ఉండి, భగవంతుని చేరుకోవాలన్న దృఢ నిశ్చయం ఉన్నవారు ఈ నవవిధ భక్తి మార్గాల్లో ఏదో ఒకదానిని ఎంచుకొని సాధన చేయడం ద్వారా భగవంతుని సులభంగా చేరవచ్చు. మోక్షాన్ని పొందవచ్చు. శుభం భూయాత్!
ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.