Shankhpushpi Plant Benefits :వాస్తు పండితులు చెప్పిన ప్రకారం అపరాజిత మొక్కను సరైన దిశలో పెంచుకుంటే ఆ ఇంట లక్ష్మీదేవి నివసిస్తుందని అంటారు. అపరాజిత మొక్క అంటే శంఖ పుష్పం మొక్క. ఎవరైనా తీవ్రమైన ఆర్థిక సమస్యలతో బాధపడుతూ ఉంటే శంఖ పుష్పం మొక్కను పెంచుకొని ఆ పూలతో లక్ష్మీదేవిని పూజిస్తే ఆర్థిక సమస్యలు దూరమవుతాయి. ఇక జీవితంలో ధనానికి లోటుండదు.
వాస్తు శాస్త్రం ఏమి చెబుతుందంటే?
మన ఇంట్లో అమర్చుకునే వస్తువులు మాత్రమే కాదు మొక్కలను కూడా వాస్తుకు అనుగుణంగా పెంచుకుంటే సానుకూల ఫలితాలుంటాయని వాస్తు శాస్త్రం చెబుతోంది. శ్రీ మహాలక్ష్మితో పాటు అపరాజిత మొక్క శివ,విష్ణువు, శనిశ్వరుడికి కూడా ప్రీతికరమని శాస్త్రం చెబుతోంది. శంఖ పుష్పం మొక్క ఇంట్లో ఉంటే శాంతి, ఐశ్వర్యం, ఆనందం, సకల శ్రేయస్సులు ఉంటాయి.
శని దోష పరిహారం
ఇంట్లో శంఖ పుష్పం మొక్కను పెంచి ఆ పూలతో ప్రతిరోజూ శివుని, వేంకటేశ్వర స్వామిని, ఆంజనేయ స్వామిని పూజిస్తే ఏలినాటి శని దోషాలు పోతాయని వాస్తు శాస్త్రం చెబుతోంది. అందుకే జాతకంలో శని దోషం ఉన్నవారు శని దోష ప్రభావాన్ని తగ్గించడానికి ఇంట్లో అపరాజిత మొక్కను పెంచుకుంటారు.
శంఖ పుష్పం మొక్కను ఏ దిశలో నాటాలి?
వాస్తు శాస్త్రం ప్రకారం శంఖ పుష్పం మొక్కను నాటేటప్పుడు సరైన దిశలో నాటాలి. లేకపోతే వ్యతిరేక ఫలితాలు వచ్చే ప్రమాదముంది. ఇంటికి కుబేర స్థానమైన ఈశాన్య దిశలో గణేశుడు, లక్ష్మీదేవి, కుబేరుడు నివసిస్తారని వాస్తు చెబుతోంది. అందుచేత అపరాజిత మొక్కను ఇంటికి తూర్పు, ఉత్తరం లేదా ఈశాన్య మూలలో నాటడం శుభప్రదం. శంఖ పుష్పం మొక్కను ఇంటికి దక్షిణం లేదా పడమర దిశలో ఎప్పుడూ నాటకూడదు. అలా నాటితే ప్రతికూల ఫలితాలు వస్తాయని వాస్తు శాస్త్రం చెబుతోంది.
శంఖ పుష్పం మొక్కను ఏ రోజు నాటితే మంచిది
వాస్తు ప్రకారం గురువారం విష్ణుమూర్తికి, శుక్రవారం లక్ష్మీదేవికి అంకితమని అంటారు. అందుకే గురువారం లేదా శుక్రవారం ఇంట్లో అపరాజిత మొక్కను నాటడం శుభప్రదం. మొక్కే కదా అని తేలిగ్గా తీసుకోకుండా శంఖ పుష్పం మొక్కను నాటుదాం. శుభ ఫలితాలను పొందుదాం. శుభం భూయాత్
ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.