తెలంగాణ

telangana

ETV Bharat / spiritual

శనికి ప్రీతికరమైన పుష్య మాసం- ఈ పరిహారాలతో దోషాల నుంచి విముక్తి! - SHANI TRAYODASHI 2025

శని ప్రీతికరమైన పుష్య మాసం- శని బాధల నుంచి విముక్తి పొందాలంటే శనిత్రయోదశి రోజు ఈ పరిహారాలు పాటించండి!

Shani Trayodashi 2025
Shani Trayodashi 2025 (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Jan 10, 2025, 6:07 PM IST

Shani Trayodashi 2025 :శని దేవుని జన్మ నక్షత్రం పుష్యమి. అందుకే పౌర్ణమితో కూడిన పుష్యమి నక్షత్రం ఉండే పుష్య మాసం శని ప్రీతికర మాసంగా పేరొందింది. ఈ నెలంతా శనైశ్చరుణ్ని పూజించే వారిపట్ల శని ప్రసన్నుడై శుభాలు కలిగిస్తాడని పురాణాలు తెలుపుతున్నాయి. గరుడ పురాణం ప్రకారం శని ధర్మదేవత. మానవులు చేసిన పాపపుణ్యాలు లెక్కించి తత్ఫలితాలను ఇచ్చేవాడు శని భగవానుడు. ఇక ఈ మాసంలో వచ్చే మొదటి శని త్రయోదశి అత్యంత ప్రభావవంతమైనదని జ్యోతిష్యశాస్త్ర పండితులు చెబుతున్నారు.

శని త్రయోదశి పూజ ఎవరు చేయాలి?
ఒక వ్యక్తి జాతకంలో ఏలినాటి శని, అర్ధాష్టమ శని నడుస్తుంటే వృత్తి వ్యాపారాలలో తీవ్ర ఆటంకాలు, ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. శని త్రయోదశి రోజు చేసే చిన్నపాటి పూజతో ఇలాంటి సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. శని త్రయోదశి ఎప్పుడు వచ్చింది? ఆ రోజు ఎలాంటి పూజలు చేస్తే మంచిది అనే విషయాలను వివరంగా ఈ కథనంలో తెలుసుకుందాం.

శని త్రయోదశిని ఏ విధంగా నిర్ధరిస్తారు?
తెలుగు పంచాంగం ప్రకారం శనివారం త్రయోదశి తిథితో కలిసివస్తే ఆ రోజును శని త్రయోదశి అంటారు. జనవరి 11 వ తేదీ శనివారం, త్రయోదశి తిథి కలిసి వచ్చాయి కాబట్టి ఆ రోజున శని త్రయోదశి పూజ చేసుకోవాలని పంచాంగ కర్తలు సూచిస్తున్నారు.

శని త్రయోదశి పూజకు శుభసమయం
జనవరి 11 వ తేదీ శనివారం ఉదయం 8 గంటల నుంచి 11 గంటల లోపు శని త్రయోదశి పూజ చేసుకోవాలి.

త్రయోదశి తిథి విశిష్టత
దేవదానవులు చేసిన క్షీరసాగర మథనంలో ఉద్భవించిన హాలాహలాన్ని తన కంఠంలో దాచుకుని లోకాలను కాపాడిన నీల కంఠుడైన ఆ శివుడికి కృతజ్ఞతలు చెప్పడానికి దేవతలందరూ ఆయన వద్దకు వెళ్లింది ఈ త్రయోదశి తిథి నాడే అని శివ పురాణం ద్వారా తెలుస్తుంది.

శని త్రయోదశి ప్రాముఖ్యత
శని త్రయోదశి రోజున శని దేవుడికి భక్తి శ్రద్ధలతో పూజించి శనిత్రయోదశి వ్రతాన్ని ఆచరించడం వలన ఆర్థిక, ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందని జ్యోతిష్య శాస్త్ర పండితులు చెబుతున్నారు.

శని దేవుడు కష్టాలు ఇస్తాడా!
జ్యోతిష్య శాస్త్ర రీత్యా శనివారానికి అధిపతి శని భగవానుడు. ఏ వ్యక్తికైనా పూర్వజన్మ కర్మ ఫలితాలను అందించే అధికారం శనిది. అందుకే మానవులకు మంచి ఫలితాలు అయినా చెడు ఫలితాలు అయినా కలిగేది శని భగవానుని అనుగ్రహం వల్లనే! నిజానికి శని పాప గ్రహం అంటారు కానీ ఒక వ్యక్తిని అగ్ని పరీక్షలకు గురి చేసి చెడు మార్గం నుంచి సన్మార్గం వైపు నడిపించేది శని భగవానుడే! అందుకే శని దేవుని ఆరాధనకు అంతటి విశిష్టత.

శని త్రయోదశి పూజలు ఎవరు చేయాలి
జాతకం ప్రకారం ఏలినాటి శని, అష్టమ శని అర్ధాష్టమ శని నడుస్తున్న వారు తప్పకుండా శని త్రయోదశి పూజలు చేసుకోవడం వలన శని దేవుని అనుగ్రహాన్ని పొందవచ్చు. ఈ ఏడాది శని మీన రాశిలోకి ప్రవేశిస్తున్నందున మీన రాశి, మేష రాశి వారికి ఏలినాటి శని ప్రభావం ఉండబోతోంది. అలాగే కుంభరాశి వారికి కూడా ఏలినాటి శని ప్రభావం చివరి దశలో ఉంది. కాబట్టి ఈ మూడు రాశుల వారు శని త్రయోదశి రోజు శనికి ప్రత్యేక పూజలు జరిపించుకోవడం వలన కొత్త సంవత్సరంలో శుభ ఫలితాలను పొందుతారని పంచాంగ కర్తలు చెబుతున్నారు.

శని త్రయోదశి పూజా విధానం
శని త్రయోదశి నాడు సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి. అభ్యంగన స్నానం చేయాలి. దగ్గరలో ఉన్న ఆలయానికి వెళ్లాలి. అక్కడ నవగ్రహాలకు ప్రత్యేక పూజలను నిర్వహించాలి. ఈ రోజు ప్రధానంగా శనీశ్వరుడిని ఆరాధించడం, తైలాభిషేకం చేయాలి. ఒక తమలపాకులో బెల్లం ఉంచి శనికి నైవేద్యంగా సమర్పించాలి. ఇలా చేయడం వల్ల జాతకంలో ఉన్న శని దోషాలు తొలగిపోతాయని విశ్వాసం. అంతే కాకుండా ఈ రోజు నల్ల నువ్వులు, నల్లని వస్త్రంలో ఉంచి తాంబూలం, దక్షిణతో బ్రాహ్మణులకు దానం చేస్తే జాతకంలో అరిష్టాలు ఉంటే తొలగిపోయి సర్వశుభాలు చేకూరుతాయని పండితులు చెబుతారు.

సింపుల్ గా ఇలా కూడా చేయవచ్చు!
శని త్రయోదశి నాడు వివిధ కారణాల చేత ఇవేమి చేయలేని వారు కనీసం నవగ్రహాల వద్ద మట్టి ప్రమిదలో నువ్వుల నూనెతో దీపారాధన చేసి, శనిదేవుని తమలపాకులో బెల్లం నైవేద్యంగా సమర్పించి, 9 ప్రదక్షిణలు చేస్తే శని దేవుని ప్రీతిని పొందవచ్చు. అలాగే శివునికి కానీ, ఆంజనేయస్వామికి కానీ భక్తితో 11 ప్రదక్షిణలు చేస్తే శనిదేవుని అనుగ్రహాన్ని పొందినట్లే అని శాస్త్ర వచనం. ఈ రోజు శనిదేవుని వాహనమైన కాకులకు ఆహారం పెట్టడం, నల్ల చీమలకు పంచదార పెట్టడం చేస్తే కూడా మంచిది. ఏ పూజకైనా భక్తి ప్రధానం. భక్తితో చేసే చిన్నపాటి పూజకైనా అపారమైన ఫలితం ఉంటుందని శాస్త్రవచనం.

ఇలా కూడా చేయవచ్చు
శని త్రయోదశి రోజు రావి చెట్టు దగ్గర మట్టి ప్రమిదలో నువ్వుల నూనెతో దీపారాధన చేసి 11 ప్రదక్షిణలు చేస్తే కూడా శని దోషాలు తొలగిపోతాయని విశ్వాసం. అలాగే కలియుగ ప్రత్యక్ష దైవమైన వేంకటేశ్వర స్వామిని దర్శించి పూజిస్తే కూడా మంచిది.

రానున్న శని త్రయోదశిని భక్తిశ్రద్ధలతో జరుపుకుందాం, సకల దోషాలను తొలగించుకొని సర్వ శుభాలను పొందుదాం.

ఓం శ్రీ శనైశ్చరాయ నమః

ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ABOUT THE AUTHOR

...view details