Shani Pradosh Puja 2024 :వ్యాస మహర్షి రచించిన శివ మహా పురాణంలో వివరించిన ప్రకారం దేవదానవులు క్షీరసాగర మథనం చేసినప్పుడు వచ్చిన విషాన్ని పరమశివుడు తన కంఠంలో ఉంచుకొని సమస్త లోకాలను రక్షించిన రోజును శనిప్రదోషంగా పిలుస్తారు.
శని ప్రదోషం ఎప్పుడు వస్తుంది?
ప్రతి నెలలో మనకు త్రయోదశి తిథి రెండు సార్లు వస్తుంది. ఒకటి శుక్ల పక్షంలో, రెండవది కృష్ణ పక్షంలో. ఈ త్రయోదశి తిథి శనివారం సూర్యాస్తమయం వేళలో ఉంటే దాన్ని శని ప్రదోషంగా పరిగణిస్తారు. డిసెంబర్ 28 వ తేదీ శనివారం సూర్యాస్తమయం సమయంలో త్రయోదశి తిథి ఉంది కాబట్టి ఆ రోజు శని ప్రదోష పూజను చేసుకోవాలి.
శని ప్రదోష పూజకు శుభసమయం
శని ప్రదోషం పూజను సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల లోపు చేసుకోవచ్చు.
శని ప్రదోష పూజ ఎవరు చేస్తే మంచిది?
జాతకంలో శని దశలు అనగా ఏలినాటి శని, అర్ధాష్టమ శని నడుస్తున్న వారు ఈ పూజను తప్పకుండా చేయాలి. అలాగే ఆర్థిక ఇబ్బందులు, రుణ బాధలు ఉన్నవారు కూడా ఈ పూజ చేసుకుంటే ఆర్థిక బాధల నుంచి ఉపశమనం ఉంటుంది. ముఖ్యంగా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు, నరాల సంబంధిత వ్యాధులతో బాధపడే వారు శని ప్రదోషం రోజున శివారాధన చేయడం ద్వారా ఆ దోషాలను పోగొట్టుకొని మంచి ఆరోగ్యాన్ని పొందవచ్చు.
ప్రదోష వేళ శివారాధన - సకల దోష పరిహారం
శనివారం వచ్చే ప్రదోషం రోజున సూర్యోదయం నుంచి రోజంతా ఉపవాసం చేసి, సాయంత్రం వేళ శివార్చన చేయడం ద్వారా సమస్త జాతక దోషాలు పోయి అనుకున్న కోరికలు నెరవేరుతాయని జ్యోతిష్య శాస్త్ర పండితులు చెబుతారు. అంతేకాదు ఈ ప్రదోష కాల పూజను భక్తి శ్రద్ధలతో శివుని ఆరాధిస్తే సమస్త దేవతలను పూజించిన ఫలితం దక్కుతుందని శాస్త్రవచనం.