Sai Baba Vratam Telugu :సాయినాథునికి అంకితమైన గురువారం రోజు సాయిబాబా వ్రతాన్ని ఆచరించడం వల్ల అసంపూర్తిగా ఆగిపోయిన పనులు పూర్తవుతాయని, అనారోగ్య సమస్యలు తొలగిపోతాయని, ఆర్థిక బాధలుండవని విశ్వాసం. అయితే సాయిబాబా కోసం ఎన్ని రోజులు ఉపవాసం ఉండాలి? గురువార వ్రతం ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
గురువారమే ప్రారంభం
సాయిబాబా వ్రతాన్ని ఒక నెలలో ఏ గురువారం నుంచైనా మొదలు పెట్టవచ్చు. ఒకవేళ ఆ రోజు పౌర్ణమి అయితే మరీ మంచిది. సాధారణంగా జ్యోతిష శాస్త్రం ప్రకారం ఏ వ్రతమైనా 5, 7, 9, లేదా 11 వారాలు చేయడం వలన విశేష ఫలితాలుంటాయని తెలుస్తోంది. సాయిబాబా వ్రతాన్ని మొదలు పెట్టిన రోజే ఎన్ని వారాలు చేయాలో నిర్ణయించుకొని బాబా సమక్షంలో దీక్ష తీసుకోవాలి.
గురువార వ్రత దీక్ష ఇలా తీసుకోవాలి?
సాయినాథుని పూజించే విధానం చాలా సులభంగా ఉంటుంది. ఇందులో ఎక్కువగా మడి, ఆచారాలు ఉండవు కాబట్టి ఎవరైనా సులభంగా చేసుకోవచ్చు. గురువార వ్రతాన్ని మొదలు పెట్టిన మొదటి గురువారం రోజు సూర్యోదయ సమయంలో తలారా స్నానం చేసి, పసుపు రంగు వస్త్రాలు ధరించి, పూజా మందిరాన్ని శుభ్రం చేసుకొని సాయిబాబా పటాన్ని కానీ, విగ్రహాన్ని కానీ ఉంచుకొని ఈ రోజు నుంచి తొమ్మిది గురువారాలు వ్రతాన్ని చేస్తానని సంకల్పించుకోవాలి. ప్రతి గురువారం సాయంత్రం వరకు ఉపవాసం ఉండాలి.
పసుపు రంగే ప్రధానం
సాయినాథుని సమక్షంలో నెయ్యి దీపం వెలిగించాలి. సాయిబాబాకు పసుపు రంగు అంటే చాలా ఇష్టం. అందుకే ఈ రోజు బాబాను పసుపు రంగు పూలతో పూజించాలి. సాయిని అష్టోత్తర శతనామాలతో అర్చించాలి. పూజ పూర్తి అయ్యాక బాబా వారి చరిత్రను కానీ, బాబా వారి ఉపవాస వ్రత కథను కానీ చదువుకోవాలి. బాబాకు నిమ్మకాయ పులిహోర, బూందీ లడ్డూలు, మామిడి పండ్లు, అరటి పండ్లు వంటి పసుపు రంగు ప్రసాదాలు నివేదించాలి. బాబాకు ఎంతో ప్రీతికరమైన కిచిడీ ప్రసాదం ఈ రోజు విశేషంగా సమర్పిస్తారు. అనంతరం బాబాకు హారతి పాటలు పాడుకుంటూ మంగళ హారతులు ఇవ్వాలి. బాబాకు నివేదించిన ప్రసాదాలను అందరికీ పంచి పెట్టాలి. సాయంత్రం సమీపంలోని సాయిబాబా ఆలయానికి వెళ్లి సాయినాథుని దర్శనం చేసుకుని ఇంటికి వచ్చి ఉపవాసాన్ని విరమించవచ్చు.
దానంతోనే పెరిగే సంపద
పూజ పూర్తయ్యాక చేసే దానాల వల్ల విశేష ఫలం ఉంటుంది. పేదలకు దానం చేసే వారి పట్ల సాయిబాబాకు అవ్యాజమైన అనురాగం ఉంటుంది. అందుకే పేదలకు ఆహారం, దుస్తులు దానం చేయవచ్చు. అన్ని దానాలలో కెల్లా అన్న దానం శ్రేష్ఠం. అందుకే గురువారం అన్నదానం చేస్తే ఐశ్వర్యం సిద్ధిస్తుందని అంటారు. అసలు సంపద పెరగడానికి సులభమైన మార్గం దానాలు చేయడమే అని హిందూ ధర్మ శాస్త్రం చెబుతోంది.