Rudraksha Benefits In Telugu : రుద్ర అంటే శివుడు- అక్ష అంటే కన్ను, రుద్రాక్ష అంటే సాక్షాత్తు పరమశివుని కంటి నుంచి నుంచి జాలువారిన నీటి బిందువుల నుంచి మొలిచిన మొక్కలు పెద్ద వృక్షాలుగా మారాయని, ఆ వృక్షాల నుంచి వచ్చిన కాయలే ఈ రుద్రాక్షలని భక్తుల విశ్వాసం.
రుద్రాక్షల పురాణ చరిత్ర
రుద్రాక్షలు పురాణ కాలం నుంచి ఉండేవని మనకు అతి ప్రాచీన గ్రంధాల ద్వారా తెలుస్తోంది. యుగయుగాల నుంచి రుషులు, మునులు, వేదాంతులు అందరూ రుద్రాక్షలను ధరించేవారు. ఇప్పటికీ ఆధ్యాత్మిక గురువులు, మఠాధిపతులు, పీఠాధిపతులు, దేవాలయంలో పూజ చేసే పూజారులు, ప్రవచనకర్తలు రుద్రాక్షలు ధరించడం మనం చూస్తూనే ఉన్నాం.
పూజామందిరంలో రుద్రాక్షలు
రుద్రాక్షలు ధరించాలంటే కొన్ని కఠిన నియమాలు పాటించాలి. అలా పాటించలేని వారు రుద్రాక్షలను పూజామందిరంలో ఉంచుకుంటారు. రుద్రాక్షలో పలు రకాలు ఉంటాయి. సాధారణంగా రుద్రాక్షకు ఉన్న ముఖం ఆధారంగా వాటి స్వరూపము నిర్ధరిస్తారు.
ఏకముఖి రుద్రాక్ష
సాక్షాత్తు శివుని త్రినేత్రంగా, ఓంకార రూపంగా భావించే ఈ ఏకముఖి రుద్రాక్ష పరమ పవిత్రమైనది. ఈ రుద్రాక్ష విలువ కూడా ఎక్కువే! తాంత్రిక శక్తులను తిప్పికొట్టే సామర్థ్యం ఉన్న ఈ రుద్రాక్షను ధరిస్తే శిరః సంబంధ రోగాలు పోతాయి. సిరిసంపదలు కలుగుతాయి అని జ్యోతిష శాస్త్ర పండితులు చెబుతారు.
ద్విముఖి రుద్రాక్ష
ద్విముఖ రుద్రాక్షను శివపార్వతుల స్వరూపమని కొందరు అంటే బ్రహ్మ స్వరూపమని మరి కొందరు అంటారు. అర్ధనారీశ్వర తత్వానికి ప్రతీక అని నమ్మే ఈ రుద్రాక్షను ధరిస్తే సంతాన భాగ్యం కలుగుతుంది. మనః సంబంధిత రుగ్మతలు నశిస్తాయి. వ్యాపార వృద్ధి కలుగుతుంది.