Puri Jagannath Temple History: హిందువులు అతి పవిత్రంగా భావించే 'చార్ ధామ్' పుణ్యక్షేత్రాల్లో పూరీ ఒకటి. ఇక్కడ 'చార్ ధామ్' అంటే గంగోత్రి, యమునోత్రి, బద్రీనాథ్, కేదార్‌నాథ్ కాదు. బద్రీనాథ్, పూరి జగన్నాథ్, రామేశ్వరం, ద్వారకా ఈ నాలుగింటిని 'చార్ ధామ్' అంటారు. ఈ నాలుగు ధామాలు దర్శించుకుంటే మోక్షం కలుగుతుందని హిందువుల విశ్వాసం.
ప్రతి ఏటా జగన్నాధుని రథయాత్ర
ప్రతి సంవత్సరం ఆషాఢ శుద్ధ విదియ రోజున పూరి జగన్నాథుని యాత్ర కన్నుల పండుగలా జరుగుతుంది. దేశ విదేశాల నుంచి ఈ యాత్రలో పాల్గొనడానికి, కళ్లారా చూడటానికి 10 లక్షల మందికి పైగా భక్తులు హాజరవుతారని అంచనా. ఈ ఏడాది జులై 7 వ తేదీన జగన్నాథుని రథయాత్ర ప్రారంభం కానున్న నేపథ్యంలో జగన్నాథుని ఆలయ విశేషాలను, స్థల పురాణం గురించి తెలుసుకుందాం.
పురుషోత్తమ నగరం - శ్రీ క్షేత్రం
ఒడిశా రాజధాని భువనేశ్వర్ నుంచి 60 కిలోమీటర్ల దూరంలో పూరీ పట్టణం ఉంది. పూర్వం ఈ పట్టణాన్ని పురుషోత్తమ నగరమని, శ్రీ క్షేత్రం అని పిలిచేవారు. పురాతన కాలం నుంచి పూరీ ప్రముఖ క్షేత్రంగా కొనసాగుతోంది. ఈ పట్టణంలో విష్ణువు జగన్నాథుని పేరిట కొలువై పూజలందుకుంటున్నాడు. పూరి క్షేత్రంలో వెలసిన జగన్నాథుని ఆలయాన్ని 12వ శతాబ్దంలో కళింగ రాజ్యాన్ని పరిపాలించే అనంతవర్మ చోడగంగాదేవ ప్రారంభించగా, ఆయన మనవడైన రాజా అనంగ భీమదేవ్ పూర్తి చేశాడని చెబుతారు. అంతకు ముందు అక్కడున్న ఆలయాన్ని ఇంద్రద్యుమ్న మహారాజు కట్టించాడని అంటారు.
జగన్నాథుని ఆలయ చరిత్ర
ఆలయ స్థల పురాణం ప్రకారం ఈ జగన్నాథుడు గిరిజనుల దేవుడనీ, పూర్వంలో నీలమాధవుడనే పేరుతో పూజలందుకున్నాడని అంటారు. గిరిజనుల రాజైన విశ్వావసుడు అడవిలోని ఓ రహస్య ప్రదేశంలో ఉన్న ఈ జగన్నాథుణ్ని పూజించేవాడంట. విషయం తెలుసుకున్న ఇంద్రద్యుమ్న మహారాజు, ఆ రహస్యాన్ని కనిపెట్టడానికి విద్యాపతి అనే బ్రాహ్మణ యువకుణ్ని అడవికి పంపుతాడు.
జగన్నాథుని ఆలయానికి ఆవాలతో దారి
విద్యాపతి విశ్వావసుని కుమార్తె లలితను ప్రేమించి పెళ్లాడుతాడు. విద్యాపతి తన మామగారైన విశ్వావసుని జగన్నాధుని విగ్రహాలను చూపించమని పదేపదే ప్రాధేయపడగా చివరకు విశ్వావసుడు కళ్లకు గంతలు కట్టి గుడి దగ్గరికి తీసుకువెళతాడు. విద్యాపతి ఆ దారి తెలుసుకునేందుకు తెలివిగా తాను వెళ్లే ఆ దారి పొడుగునా ఆవాలు జారవిడుస్తాడు. కొద్దిరోజులకు అవన్ని మొలకెత్తి జగన్నాధుని ఆలయానికి దారి స్పష్టంగా తెలుస్తుంది. దీంతో వెంటనే అతను ఇంద్రద్యుమ్న మహారాజుకు కబురు పెడతాడు.
అదృశ్యమైన విగ్రహాలు
జగన్నాథుని చూడటానికి ఇంద్రద్యుమ్ను మహారాజు అడవికి చేరుకునేసరికి ఆలయంలోని విగ్రహాలు అదృశ్యమవుతాయి. దీంతో నిరాశ చెందిన ఇంద్రద్యుమ్నుడు నిరాహారదీక్ష మొదలుపెట్టి, అశ్వమేథయాగం చేస్తాడు. నీలాచలం మీద ఓ ఆలయాన్ని నిర్మించి నరసింహ స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తాడు. ఆ ఆలయంలోనే నిద్రిస్తూ ఉండేవాడు.
జగన్నాధుని స్వప్న దర్శనం
ఒకనాటి రాత్రి ఇంద్రద్యుమ్నునికి కలలో జగన్నాధుడు కనిపించి సముద్రతీరంలో చాంకీనది ముఖద్వారానికి వేప కొయ్యలు కొట్టుకొస్తాయని వాటితో విగ్రహాలు చేయించమని ఆదేశిస్తాడు.