Bikkavolu Ganapati Temple : విఘ్నాలను తొలగించి సకల శుభాలను ప్రసాదించే స్వామి వినాయకుడు. అందుకే గణనాథుని దేవతలు సైతం ఆరాధిస్తారు. దేశవ్యాప్తంగా గణేశునికి ఎన్నో ఆలయాలు ఉన్నాయి. ఒక్కో ఆలయానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలులోని శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయం గణేశుని ఆలయాలన్నింటిలోను ప్రత్యేకమైనది. ఈ ఆలయానికి ఇంతటి ప్రత్యేకత ఎలా వచ్చింది? ఈ క్షేత్ర విశేషాలేమిటో ఈ కథనంలో తెలుసుకుందాం.
బిక్కవోలు గణపతి ఆలయం
భక్తులు తమ కోరికలను నేరుగా భగవంతునికి చెప్పుకునే వీలున్న క్షేత్రం బిక్కవోలు గణపతి ఆలయం. చారిత్రాత్మక ప్రాముఖ్యత కలిగిన బిక్కవోలు శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో స్వామి ఇక్కడ స్వయంభువుగా వెలిశాడని చెబుతారు. ఇక్కడ స్వామిని దర్శిస్తే కోరిన కోర్కెలు నెరవేరుతాయని నమ్మకంతో భక్తులు విశేషంగా తరలి వస్తుంటారు. ఈ ఆలయంలో ఎన్నో ప్రత్యేకతలున్నాయి. అవేంటో చూద్దాం.
ఏకశిలా మూర్తి
బిక్కవోలు గణపతి ఆలయంలో స్వయంభువుగా వెలసిన స్వామి విగ్రహం ఏకశిలా మూర్తి కావడం విశేషం.
సుందరమైన విగ్రహం - కుడివైపు తొండం
బిక్కవోలు లక్ష్మీ గణపతి ఆలయంలో స్వామి తొండం కుడి వైపు తిరిగి ఉంటుంది. ఇలా ఉన్న గణపతి శీఘ్రంగా కోర్కెలను నెరవేరుస్తాడని విశ్వాసం. అంతేకాకుండా బిక్కవోలు గణపతి సుమారు ఏడు అడుగుల ఎత్తు కలిగి, పెద్ద పెద్ద చెవులతో ఆకర్షణీయంగా కూర్చుని ఉన్న భంగిమలో దర్శనమిస్తాడు. అంతేకాదు గణపతి ఇక్కడ మహారాజ ఠీవి ఉట్టిపడేలా కొద్దిగా వెనక్కి వంగి ఆశీనుడైనట్లు ఉంటాడు.
ఏటా పెరిగే గణపతి
బిక్కవోలు గణపతి ఏటా పెరుగుతూనే ఉంటాడని స్థానికులు అంటారు. ఇందుకు నిదర్శనం గతంలో స్వామివారికి చేయించిన వెండి తొడుగు ప్రస్తుతం చాలకుండా పోవడమేనని భక్తులు అంటారు.
స్వామికి స్వయంగా విన్నవించుకోవచ్చు
బిక్కవోలు గణపతి గర్భాలయం లోపలికి భక్తులను అనుమతిస్తారు. ఇక్కడ భక్తులు స్వయంగా తమ కోరికలను స్వామికి విన్నవించుకోవచ్చు. కోరిన కోరికలు నెరవేరిన తర్వాత పునఃదర్శనానికి వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. దీని వెనుక ఓ కథ కూడా ఉంది. అదేమిటో చూద్దాం.
షావుకారుకు గణేశుని స్వప్న సాక్షాత్కారం
బిక్కవోలు ప్రాంతానికి చెందిన ఒక షావుకారు కలలోకి వచ్చిన వినాయకుడు స్వయంగా "కోరికలైనా కష్టాలైనా నా చెవిలో చెప్పు తప్పక తీరుస్తాను" అని చెప్పారట! ఆ ప్రకారమే ఆయన మరుసటి రోజు స్వామికి తన కోరికలు చెప్పాడని, దానితో అతని సంకల్పం నెరవేరిందని చెబుతారు. అప్పటి నుంచి ఈ సంప్రదాయాన్ని భక్తులు నిరాటంకంగా కొనసాగిస్తున్నారు. స్వయంభువుగా వెలసిన ఈ గణపతి ఆలయాన్ని తూర్పు చాళుక్యులు నిర్మించారని చెబుతారు.
నిజరూప దర్శనం
ప్రతి ఏడాది వినాయక చవితి ముందు రోజు భక్తులకు స్వామి వారి నిజరూప దర్శనం కల్పిస్తారు.
వినాయక చవితి ఉత్సవాలు
బిక్కవోలు గణపతి ఆలయంలో వినాయక చవితి ఉత్సవాలు 9 రోజుల పాటు ఘనంగా జరుగుతాయి. ఇందులో భాగంగా స్వామివారికి తీర్థపు బిందె సేవతో చవితి వేడుకలు వైభవంగా మొదలవుతాయి. చెవిలో విన్నవించుకుంటే చాలు కోరిన కోర్కెలు తీర్చే బిక్కవోలు గణపతి అనుగ్రహం మనందరిపై ఉండాలని కోరుకుంటూ - ఓం గం గణపతయే నమః
ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంత వరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.