Ekadashi Puja : తెలుగు పంచాంగం ప్రకారం ఒక ఏడాదిలో 24 ఏకాదశులు వస్తాయి. ప్రతి నెలా శుక్ల పక్షంలో ఒకటి, కృష్ణ పక్షంలో ఒకటి చొప్పున రెండు ఏకాదశులు వస్తాయి. ఒక్కో ఏకాదశికి ఒక్కో విశిష్టత ఉంది. మార్గశిర మాసం బహుళ పక్షంలో వచ్చే ఏకాదశిని సఫల ఏకాదశిగా జరుపుకుంటారు. అయితే ఈ సఫల ఏకాదశి ఎప్పుడు? ఆ రోజు ఎలాంటి పూజలు చేయాలి? తదితర వివరాలను ఈ కథనంలో తెలుసుకుందాం.
సఫల ఏకాదశి విశిష్టత
శ్రీ మహా విష్ణువుకి ఏకాదశి అంటే ప్రీతికరం. మార్గశిర మాసం కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశిని సఫల ఏకాదశి అంటారు. ఈ రోజున ఉపవాసం, జాగారం చేసి శ్రీమన్నారాయణుని అనుగ్రహం కోసం పూజిస్తారు. చేపట్టిన పనులు సఫలం కావాలంటే సఫల ఏకాదశి రోజు లక్ష్మీనారాయణులను పూజించడం సహా దానాలు చేయడం మంచిది. సఫల ఏకాదశి రోజున జాగరణ చేసి ఆలయాల్లో దీపాలను వెలిగిస్తే ఐదువేల సంవత్సరాలు తపస్సు చేసిన ఫలితం దక్కుతుందని అంటారు.
సఫల ఏకాదశి ఎప్పుడు?
తెలుగు పంచాంగం ప్రకారం, డిసెంబర్ 25వ తేదీ బుధవారం రాత్రి 9:29 నిమిషాల నుంచి ఏకాదశి తిధి ప్రారంభమై డిసెంబర్ 26వ తేదీ రాత్రి 11:27 నిమిషాల వరకు ఉంది. సూర్యోదయం తిథిని అనుసరించి డిసెంబర్ 26వ తేదీనే సఫల ఏకాదశి జరుపుకోవాలని పంచాంగ కర్తలు సూచిస్తున్నారు. ఈ రోజు తెల్లవారు ఝాము 5 గంటల నుంచి 10 గంటల వరకు పూజకు శుభ సమయం.
సఫల ఏకాదశి పూజా విధానం
వ్యాస మహర్షి రచించిన బ్రహ్మాండ పురాణం ప్రకారం, సఫల ఏకాదశి పరమ పవిత్రమైన రోజు. ఈ రోజున శ్రీ మహా విష్ణువును లక్ష్మీ సమేతంగా పూజిస్తారు. ఈ ఏకాదశి రోజున చేసే ఉపవాసం, లక్ష్మీనారాయణుల పూజ, జాగారం వలన చేపట్టిన పనులు సఫలం అవుతాయని విశ్వాసం.
సఫల ఏకాదశి వ్రతాన్ని ఆచరించే వాళ్లు ఉదయాన్నే తలస్నానం చేసి, ఇంటినీ, పూజా మందిరాన్ని శుభ్రపరిచి లక్ష్మీనారాయణుల చిత్ర పటాలు గంధం, కుంకుమ, పసుపు రంగు పుష్పాలతో అలంకరించాలి. ఏకాదశి పూజలో తులసి తప్పనిసరి. ఆవునేతితో దీపారాధన చేయాలి.
లక్ష్మీనారాయణులకు శాస్త్రోక్తంగా షోడశోపచార పూజలు చేయాలి. అరటిపండ్లు, కొబ్బరికాయ, చక్ర పొంగలి నైవేద్యంగా స్వామికి సమర్పించాలి. అనంతరం శ్రీహరి ఏకాదశి కథ విని, విష్ణు సహస్రనామ పారాయణం చేయాలి. చివరగా హారతి ఇవ్వాలి. ఆ రోజంతా ఉపవాసం ఉండి విష్ణు నామ సంకీర్తనతో జాగరణ చేయాలి. మరునాడు ఉదయాన్నే పునః పూజ చేసి నైవేద్యం సమర్పించాలి. మరుసటి రోజైన ద్వాదశి రోజు సద్బ్రాహ్మణులకు భోజనం పెట్టి దక్షిణ తాంబూలాదులతో సత్కరించి నమస్కరించుకోవాలి. అనంతరం భోజనం చేసి ఉపవాసాన్ని విరమిస్తే ఏకాదశి వ్రతం పూర్తి చేసినట్లు అవుతుంది.
ఈ దానాలు శ్రేష్ఠం
సఫల ఏకాదశి రోజున బెల్లం దానం చేయడం శుభప్రదం. ఈ రోజు బెల్లం దానం చేసే వారికి సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుందని విశ్వాసం. అలాగే ఈ రోజు బ్రాహ్మణులకు, అన్నార్తులకు అన్నదానం, వస్త్రదానం చేయడం మంచిది. ముఖ్యంగా ఏకాదశి రోజున బ్రాహ్మణులకు పసుపు రంగు వస్త్రాన్ని దానం చేయడం వలన జాతకంలో గురుబలం పెరిగి జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకుంటారని శాస్త్రవచనం.
ఈ నియమాలు తప్పనిసరి!
సఫల ఏకాదశి వ్రతం ఆచరించే వారు ఉపవాసం తప్పనిసరిగా చేయాలి. ఒకవేళ ఉపవాసం ఉండలేని వాళ్ళు పాలు, పండ్లు వంటి సాత్విక ఆహారం తీసుకోవాలి. ఈ రోజంతా భగవన్నామ సంకీర్తనలతో, పురాణం పఠనాలతో కాలక్షేపం చేస్తూ జాగారం చేయాలి. ఉల్లి, వెల్లుల్లి, మద్య మాంసాలు నిషిద్ధం. బ్రహ్మచర్యం తప్పనిసరి. ఈ నియమాలు పాటిస్తూ సఫల ఏకాదశి వ్రతం ఆచరిస్తే చేపట్టిన ప్రతి పనిలోనూ సఫలీకృతం పొంది విజయాలు సిద్ధిస్తాయని శాస్త్రవచనం. భక్తి శ్రద్ధలతో చేసే పూజను భగవంతుడు కూడా స్వీకరిస్తాడు. కనుక రానున్న సఫల ఏకాదశి వ్రతాన్ని మనం కూడా ఆచరిద్దాం - కార్య సఫలతను పొందుదాం.
జై శ్రీమన్నారాయణ!
ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంత వరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.