తెలంగాణ

telangana

ETV Bharat / spiritual

పిల్లల శ్రేయస్సు కోరే 'పోలాల అమావాస్య' పూజ- ఈ కథ తెలుసుకుంటేనే వ్రత ఫలితం! - Polala Amavasya Vratha Katha 2024 - POLALA AMAVASYA VRATHA KATHA 2024

Polala Amavasya Vratha Katha : హిందూ ధర్మశాస్త్రం ప్రకారం ప్రతి వ్రతం, నోముకు ఒక కథ ఉంటుంది. నియమ నిష్టలతో, భక్తి శ్రద్ధలతో వ్రతం పూర్తి చేసుకున్న తర్వాత వ్రత కథను చదువుకుని అక్షింతలు వేసుకుంటేనే వ్రతం పరిపూర్ణమై, వ్రత ఫలం దక్కుతుందని శాస్త్రవచనం. అలాగే పోలాల అమావాస్య పూజ చేసుకున్న తర్వాత వ్రత కథను చదువుకోవాలి. పోలాల అమావాస్య కథ ఇదే!.

Polala Amavasya Vratha Katha
Polala Amavasya Vratha Katha (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Sep 2, 2024, 4:01 AM IST

Polala Amavasya Vratha Katha : పూర్వ కాలంలో ఓ బ్రాహ్మణ మహిళకు ప్రతి ఏటా పిల్లలు పుడుతుంటారు. అయితే పుట్టీ పుట్టగానే ఆ పసికందులు ఏదో ఒక కారణంతో మరణిస్తూ ఉంటారు. అలా పుట్టిన కొన్ని గంటల్లోపే మరణిస్తున్న బిడ్డలను చూసి ఎంతో దుఃఖంతో ఆ మహిళ ఊరి వెలుపల ఉన్న గ్రామ దేవత పోచమ్మ చుట్టూ ప్రతి సంవత్సరం మరణించిన పిల్లల్ని సమాధి చేస్తుండేది. ఇలా ప్రతి ఏటా పోలాల అమావాస్యకు పిల్లలు పుట్టి మళ్లీ పోలాల అమావాస్యకు మరణిస్తుండంతో ఆమె ఇంటికి ఎవరూ పేరంటానికి వచ్చేవారు కాదు, ఈమెను ఎవరూ పేరంటానికి పిలిచే వారు కాదు.

బ్రాహ్మణ స్త్రీని అనుగ్రహించిన పోచమ్మ
తన ఈ దుస్థితికి ఆ బ్రాహ్మణ స్త్రీ ఎంతో బాధ పడుతుండేది. గ్రామ దేవత పోచమ్మను ఆశ్రయించి తాను పూర్వ జన్మలో ఏదో పాపం చేసింది కాబట్టే తనకు పుట్టిన బిడ్డలు ప్రతిసారీ చనిపోతున్నారని బాధపడింది. అప్పుడు ఆ పోచమ్మ తల్లి ఆ బ్రాహ్మణ స్త్రీ పట్ల కరుణతో "ఓ బ్రాహ్మణమ్మా! గత జన్మలో పోలాల అమావాస్య రోజు నీవు పేరంటానికి ముత్తైదువులు రాకముందే పిల్లలు ఏడిస్తే ఎవరూ చూడకుండా పాయసం, గారెలు పెట్టావు. పులుపు, తీపి సరిపోయిందో లేదో అని వండిన వంటలు రుచి చూశావు. ఆచారాలన్నీ పాటించకుండా అమంగళం చేశావు. అందుకే నీ బిడ్డలు పుట్టిన కొంత సమయానికే మరణిస్తున్నారు’’ అని చెప్పింది.

పోలాల అమావాస్య పూజ చేసిన బ్రాహ్మణ స్త్రీ
గత జన్మలో తన వల్ల జరిగిన తప్పును తెలుసుకున్న ఆమె పోచమ్మ తల్లి కాళ్ల మీద పడి తనను క్షమించమని కోరింది. గత జన్మలో చేసిన తప్పును సరిదిద్దుకుంటానని పోలాల అమావాస్య వ్రత విధానం తెలిపామని కోరగా పోచమ్మ ఇలా వివరించారు. శ్రావణ బహుళ అమావాస్యను పోలాల అమావాస్య అంటారు. ఆ పర్వదినాన ఇల్లు, పెరడు గోమాత పేడతో అలికి పసుపు, కుంకుమ రాసి, పెరట్లో కంద మొక్కను గౌరీ దేవిగా భావించి నాటాలి. ఆ కంద మొక్కలోకి సమంత్ర పూర్వకంగా గణపతిని, గౌరీదేవిని ఆవాహన చేయాలి. తరువాత కంద మొక్కకు 9 వరుసల దారంతో 9 పసుపు కొమ్ములు కట్టి, ఆ తోరాన్ని కంద మొక్కకు కట్టి పూజ చేయాలి. 9 వరుసల తోరం పేరాంటాలకు ఇచ్చి వారిచే మనం కట్టించుకోవాలి. అమ్మవారికి 5 రకాల పిండి వంటలను నివేదన చేయాలి. బంధుమిత్రులతో కలిసి అమ్మవారికి నివేదించిన ప్రసాదాలతో భోజనం చేయాలి.

తాంబూలం దానం
పూజ పూర్తయ్యాక భోజనం చేసిన తర్వాత ముత్తైదువులకు దక్షిణ తాంబూలం ఇచ్చి నమస్కరించాలి. తరువాత శక్తి కొద్దీ దానధర్మాలు చేయాలి. ఇలా చేయడం వలన మంచి సంతానం కలుగుతుంది. అంతే కాకుండా పోలాల అమావాస్య పూజ చేయడం వల్ల పుట్టిన పిల్లలు మరణించకుండా కలరా, మలేరియా, మశూచి తదితర వ్యాధులు రాకుండా కాపాడుకోవచ్చు’’అని పోచమ్మ బ్రాహ్మణ స్త్రీకి వివరించారు. పోచమ్మ చెప్పినట్లుగా పోలాల అమావాస్య వ్రతాన్ని చేసిన ఆమె తిరిగి తన బిడ్డల్ని పొందినట్లు పురాణాల్లో వివరించినట్లుగా తెలుస్తోంది. కాబట్టి సంతానం శ్రేయస్సు కోరుకునే వారు పోలాల అమావాస్య పూజను తప్పకుండా చేసుకోవాలి.

ముఖ్య గమనిక :పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

సంతాన భాగ్యాన్ని కలిగించే 'పోలాల అమావాస్య'- ఈ మొక్కను పూజిస్తే అంతా శుభమే! - Polala Amavasya 2024

సకల బాధలను తొలగించే 'శని ప్రదోష' పూజ! ఎలా చేసుకోవాలో తెలుసా? - Shani Pradosh Puja

ABOUT THE AUTHOR

...view details