Polala Amavasya 2024 :శివ, నారద పురాణం ప్రకారం పోలాల అమావాస్య పూజని భక్తి శ్రద్ధలతో చేసుకుంటే మంచి సంతానం కలుగుతుందని శాస్త్ర వచనం. ఈ ఏడాది సెప్టెంబర్ 2న సోమవారం రోజు అమావాస్య తిథి పూర్తిగా ఉంది. అదే రోజున పోలాల అమావాస్య జరుపుకోవాలని పంచాంగ కర్తలు సూచిస్తున్నారు. అమావాస్య తిథి సోమవారం తెల్లవారు ఝామున 5:30 నిమిషాలకు మొదలై, ఆ తర్వాత రోజు అంటే సెప్టెంబర్ 3న మంగళవారం ఉదయం 7:25 నిమిషాల వరకు ఉంది. కానీ ఈ పూజ చేయాలంటే రాత్రి సమయంలో అమావాస్య ఉండాలి. సోమవారం రోజు పోలాల అమావాస్య పూజను చేసుకోవాలి.
పూజకు శుభ ముహూర్తం
పోలాల అమావాస్య పూజను ఉదయం 6 గంటల నుంచి 10 గంటల లోపు చేసుకోవచ్చు. ఎక్కువ మంది ఈ పూజను సాయంత్రం చేస్తారు. అందుకే సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల లోపు చేసుకోవచ్చు.
పూజా విధానం
పోలాల అమావాస్య రోజున తెల్లవారుజామునే నిద్రలేచి, శుచియై ఈ రోజు పోలాల అమావాస్య పూజను చేస్తానని మనసులో సంకల్పించుకోవాలి. పూజ పూర్తయ్యే వరకు ఉపవాసం ఉండాలి. పూజామందిరాన్ని శుభ్రం చేసి నిత్య పూజను యధావిధిగా పూర్తి చేసుకోవాలి. అనంతరం పూజ గదిలో కంద మొక్కను ఉంచాలి. ఆ మొక్కకు 9 పసుపు కొమ్మలు కట్టాలి. ముందుగా వినాయకుడిని పూజించి, ఆ తర్వాత కంద మొక్కలోకి మంగళ గౌరీ దేవి లేదా సంతాన లక్ష్మీదేవిని ఆవాహనం షోడశోపచారాలతో పూజలు చేయాలి. 5 రకాల పిండి వంటలను నైవేద్యంగా సమర్పించాలి. పూజ పూర్తయిన తర్వాత ముత్తైదువులకు వాయనం ఇవ్వాలి.
ఉపవాస విరమణ
దేవునికి నివేదించిన ప్రసాదాలను భక్తిగా అందరితో కలిసి స్వీకరించి ఉపవాస విరమణ చేయాలి.