Magha Purnima 2025 : తెలుగు పంచాంగం ప్రకారం మనకు మొత్తం 12 మాసాలున్నాయి. ఒక్కో మాసానికి ఒక్కో ప్రత్యేకత ఉంది. కార్తిక మాసం దీపాలకు, దీపారాధనకు ప్రసిద్ధి అయితే, మాఘమాసం పవిత్ర స్నానాలకు ప్రసిద్ధి. హిందూ సంప్రదాయం ప్రకారం మాఘమాసంలో వచ్చే మాఘపూర్ణిమకు విశిష్ఠ ప్రాధాన్యత ఉంది. ఈ కథనంలో మాఘ పూర్ణిమకు ఎందుకంతటి విశిష్టత వచ్చింది? మాఘ పూర్ణిమ రోజు ఎలాంటి విధి విధానాలు పాటించాలి అనే విషయాలు వివరంగా తెలుసుకుందాం.
మాఘం అంటే?
'అగము' అనే పదానికి సంస్కృతంలో పాపం అని అర్థం. 'మా' అనే పోగొట్టేది అని అర్ధం. మా + ఆగం మాఘం అంటే పాపాలను పోగొట్టేది అని అర్థం. చాంద్రమానం ప్రకారం పౌర్ణమి రోజు చంద్రుడు "మఖ'' నక్షత్రంతో కూడి వుండే మాసం కనుక ఈ మాసానికి "మాఘమాసం అనే పేరు వచ్చింది.
మాఘ పూర్ణిమ విశిష్టత
మాఘ పౌర్ణమి రోజు గౌరీ దేవి జననం జరిగినట్లు పురాణాలు తెలియజేస్తున్నాయి. అలాగే శ్రీ మహా విష్ణువు మాఘ పౌర్ణమి రోజు స్వయంగా గంగయందు నివసిస్తాడని పురాణాలు చెబుతున్నాయి. అందుచేత ప్రతి ఒక్కరూ ఈ రోజు పుణ్య నదులు, సముద్రంలో స్నానం చేయాలి. వీలు కాని వారు వారి వారి గృహాల్లో గంగా జలంతో శ్రీ మహావిష్ణువును, గంగను స్మరిస్తూ తలస్నానం ఆచరించాలి. మాఘ పౌర్ణమి రోజు తల స్నానం ఆచరించిన వారికి శ్రీమన్నారాయణుడిని, సూర్య భగవానుడిని, గంగా నదిని స్మరించి తర్పణాలు వదిలిన వారికి పుణ్యం కలుగుతుందని మాఘ పురాణం తెలియజేస్తోంది.
ఆచరించాల్సిన విధి విధానాలు
- మాఘ పూర్ణిమ రోజు సూర్యోదయానికి ముందు సముద్ర స్నానం కానీ, నదీ స్నానం కానీ చేయాలి. సాధారణ స్నానం శరీర మలినాన్ని పోగొడితే, మాఘమాసం, మనసులోని మాలిన్యాన్ని పోగొట్టి మాధవుని సన్నిధికి చేరుస్తుంది.
- నదీ స్నానం అనంతరం దోసిలిలోకి నదీ జలాలను తీసుకొని సూర్యునకు ఆర్ఘ్య ప్రదానం చేయాలి.
- ఈ విధంగా మాఘస్నానం చేసిన తరువాత, పితృతర్పణాది నిత్యకర్మలు పూర్తిచేసుకుని, ఇష్టదైవాన్ని ఆరాధించాలి.
- స్నానం చేసిన తర్వాత ఇంట్లోని పూజ గదిని అలంకరించుకోవాలి. తర్వాత ఆవునెయ్యితో దీపం వెలిగించాలి.
- విష్ణువు విగ్రహాన్ని ప్రతిష్ఠించి గంగాజలంతో అభిషేకం చేయాలి.
- ఈ రోజు విష్ణువు ఆరాధనకి విశేష ప్రాముఖ్యత ఉంటుంది.
- విష్ణువుతో పాటు లక్ష్మీదేవిని పూజించాలి. విష్ణు పూజలో తులసి తప్పనిసరిగా ఉండాలి.
- చక్రపొంగలి, పరమాన్నం, కొబ్బరికాయ, పండ్లు వంటి నైవేద్యాలు భగవంతుడికి సమర్పించాలి.
- మాఘ పూర్ణిమ విశిష్టతను తెలిపే పురాణకథలు చదవడం లేదా వినడం చేయాలి.
ఈ దానాలు శ్రేష్టం
మాఘ పౌర్ణిమ రోజు చేసే దానాలకు కోటిరెట్ల అధిక ఫలం ఉంటుందని శాస్త్రవచనం. ఈ రోజు నూతన వస్త్రములు, కంబళ్ళు, పాదరక్షలు, గొడుగు, తైలము, నెయ్యి, తిలపూర్ణఘటము, బంగారము, అన్నము మొదలైనవి దానం చేస్తే మహా పుణ్య ఫలం లభిస్తుంది. చేయగలిగే శక్తి , అవకాశం ఉన్నవారు "నేతితో తిలహోమం'' చేస్తే మరింత పుణ్యం కలుగుతుంది.
తిల పాత్ర దానము
మాఘపూర్ణిమ నాడు "తిల పాత్ర దానము'' చేయడం ఎంతో మంచిది. ఈ దానం ఎలా చేయాలంటే, ఒక రాగి పాత్ర నిండుగా తిలలు అంటే నువ్వులు పోసి, వాటిపైన శక్తికొలది బంగారం ఉంచి మంత్రపూర్వకంగా బ్రాహ్మణులకు దానం చేయాలి. మాఘ పౌర్ణమి రోజు చేసే దానాల వల్ల శత్రు బాధలు తొలగిపోతాయి. ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది. ఆయురారోగ్యాలు సమకూరుతాయని పురాణాలు చెబుతున్నాయి.
అరుదైన అవకాశం
ప్రస్తుతం ప్రయాగరాజ్‌లో మహా కుంభమేళా జరుగుతోంది. మాఘ మాసంలో నదీ స్నానం చేయాలని శాస్త్రం చెబుతోంది కాబట్టి వీలైతే ప్రయాగరాజ్‌లో త్రివేణి సంగమంలో పుణ్య స్నానం చేస్తే ఇటు మాఘ స్నానం అటు మహా కుంభమేళా స్నాన ఫలం కూడా దక్కుతుంది. ఎప్పుడో కానీ దొరకని ఇలాంటి అరుదైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాం. ఆధ్యాత్మిక అనుభూతిని సొంతం చేసుకుందాం. జై శ్రీమన్నారాయణ!
ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం