తెలంగాణ

telangana

ETV Bharat / spiritual

అక్కడ 'కావడి' ఎత్తితే సంతాన ప్రాప్తి- ఈ స్పెషల్ టెంపుల్ గురించి మీకు తెలుసా? - Subramanya Swamy Temple - SUBRAMANYA SWAMY TEMPLE

Palani Dhandayuthapani Temple : తమిళనాడులో ప్రఖ్యాతి చెందిన ఆరు సుబ్రహ్మణ్య క్షేత్రాల్లో పళని క్షేత్రం ఒకటి. సంతానం లేని వారు ఈ ఆలయంలో కావడి ఉత్సవంలో పాల్గొంటే తప్పకుండా సంతానం కలుగుతుందని విశ్వాసం. ఆడికృత్తిక పర్వదినం సందర్భంగా పళని క్షేత్ర విశేషాలను ఈ కథనంలో తెలుసుకుందాం.

Palani Dhandayuthapani Temple
Subramanya Swamy Temple (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Jul 30, 2024, 4:44 AM IST

Palani Dhandayuthapani Temple : తమిళనాడులో వెలసిన ఆరు సుబ్రహ్మణ్య క్షేత్రాలను షణ్ముఖ క్షేత్రాలు అంటారు. వీటిలో నాలుగో క్షేత్రంగా పళని భాసిల్లుతోంది. స్కంద పురాణం ప్రకారం శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆరాధనలో అతి ముఖ్యమైన కావడి ఉత్సవం తొలిసారిగా ప్రారంభమైందిక్కడే అని తెలుస్తోంది.

పళని ఎక్కడ ఉంది?
ఎంతో మహిమాన్వితమైన దివ్య క్షేత్రం పళని తమిళనాడులోని దిండుక్కల్ జిల్లాలో మధురై నుంచి 120 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఏడాది పొడుగునా ఈ క్షేత్రం భక్త జన సందోహంతో కళకళలాడుతూ ఉంటుంది.

ముచ్చట గొలిపే సుబ్రహ్మణ్యుని రూపం
పళని క్షేత్రంలో శ్రీ సుబ్రమణ్య స్వామి దండాయుధపాణి అనే నామంతో వెలసి భక్తులచే పూజలందుకుంటున్నారు. ఒక చేతిలో దండం పట్టుకుని, కౌపీన ధారియై, వ్యుప్త కేశుడై నిలబడి, చిరునవ్వులొలికిస్తూ నిలుచుని ఉన్న సుబ్రహ్మణ్యుని ముగ్ధ మనోహర రూపం ఎంత చూసినా తనివి తీరదు.

నవ పాషాణాల మూర్తి
పళని ఆలయంలో మరో ముఖ్య విశేషం ఏమిటంటే మందిరంలో గర్భ గుడిలో స్వామి వారి మూర్తి నవ పాషాణాలతో రూపొందించారు. ఇటువంటి స్వరూపం ప్రపంచంలో మరెక్కడా లేదు. ఈ మూర్తిని సిద్ధ భోగార్ అనే మహర్షి చేశారు. తొమ్మిది రకాల విషపూరిత పదార్ధాలతో ఈ విగ్రహాన్ని తయారు చేశారు.

సుబ్రహ్మణ్యుని అవతారమే రమణ మహర్షి
సాక్షాత్తు సుబ్రహ్మణ్యుని అవతారంగా భావించే అరుణాచలేశ్వరుని భక్తుడైన శ్రీ రమణ మహర్షి వారిది కూడా ఇదే స్వరూపం. అందుకే భగవాన్ రమణులను సుబ్రమణ్య అవతారమని పెద్దలు అంటారు. పళని లోని సుబ్రహ్మణ్య స్వామి కౌపీనంతో వెలసిన అంతరార్ధం ఏమిటంటే తనను చేరుకోవాలంటే అన్ని వదిలి వేయాలని భక్తులకు సందేశం ఇవ్వడమే!

తొలిసారి కావడి ఉత్సవాలు
జ్ఞాన క్షేత్రంగా పేరొందిన ఈ పళనిలోనే తొలిసారిగా కావడి ఉత్సవాలు ప్రారంభమయ్యాయని స్కంద పురాణం ద్వారా తెలుస్తోంది.

పళని క్షేత్ర స్థల పురాణం
పళని క్షేత్ర స్థల పురాణాన్ని పరిశీలిస్తే మనకందరికీ తెలిసిన వినాయక చవితి కథను ఇక్కడ ఒకసారి మననం చేసుకోవాలి. పూర్వం విఘ్నాలకు ఆధిపత్యం కోసం వినాయకుని సుబ్రహ్మణ్యునికి పెట్టిన పందెంలో సుబ్రహ్మణ్యుడు తన నెమలి వాహనం ఎక్కి భూలోకం చుట్టి అన్ని పుణ్య నదుల్లో స్నానం ఆచరించి ఆ క్షేత్రాలను దర్శించి రావడం కోసం బయలుదేరగా మన బొజ్జ వినాయకుడు మాత్రం కైలాసంలోనే ఉండి ఆది దంపతులు, తన తల్లిదండ్రులైన ఉమా మహేశ్వరుల చుట్టూ మూడు మాట్లు ప్రదక్షిణ చేస్తాడు. సుబ్రహ్మణ్యుడు ఏ క్షేత్రమునకు వెళ్లినా, అప్పటికే అక్కడ లంబోదరుడు వెనుతిరిగి వస్తూ కనపడతాడు. ఈ విధంగా వినాయకుడు విఘ్నాలకు అధిపతి అయ్యాడు. ఈ కథ మనకు తెలిసినదే.

అలిగిన షణ్ముఖుడు
వినాయకుడికి విఘ్నాధిపత్యం ఇచ్చిన తర్వాత శివ కుటుంబంలో చిన్నవాడు శివపార్వతుల గారాల పుత్రుడైన షణ్ముఖుడు అలిగి ఒక కొండ శిఖరం మీద నివాసం ఉంటాడంట! పిల్లలు చిన్న బుచ్చుకుంటే ఏ తల్లిదండ్రులకైనా బెంగే కదండీ. అప్పుడు శివ పార్వతులు ఇద్దరూ షణ్ముఖుని బుజ్జగించడం కోసం భూలోకంలో సుబ్రహ్మణ్యుడు ఉన్న కొండ శిఖరం వద్దకు వస్తారు.

సుబ్రహ్మణ్యుని బుజ్జగించిన శివ పార్వతులు
సుబ్రహ్మణ్యుడు నివసించిన ఆ కొండ శిఖరాన్ని 'తిరు ఆవినంకుడి' అని పిలుస్తారు. ఆ ప్రదేశానికి వచ్చిన శివుడు, సుబ్రహ్మణ్యుని బుజ్జగిస్తూ 'నువ్వే జ్ఞాన ఫలానివి నాన్నా' అని ఊరడించారంట. తమిళంలో జ్ఞాన ఫలం అంటే 'ఫల' అని, నీవు అంటే, 'నీ' అని అర్థం. ఆ విధంగా 'ఫల' 'ని' కలిపి ఆ క్షేత్రానికి పళని అని పేరు వచ్చింది. అంతటితో ప్రసన్నుడు అయిన సుబ్రహ్మణ్యుడు ఎప్పటికీ శాశ్వతంగా ఆ కొండ మీదే కొలువు ఉంటానని అభయం ఇస్తాడు. సుబ్రహ్మణ్య క్షేత్రాలలో జరిగే కావడి ఉత్సవం మొట్ట మొదట ఈ పళనిలోనే ప్రారంభం అయ్యింది. అసలీ కావడి ఉత్సవాలు ఎలా ప్రారంభం అయ్యాయో, దాని వెనుక ఉన్న కథ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

కావడి ఉత్సవాలు అంటే
సుబ్రహ్మణ్య స్వామి గొప్ప శిష్యుల్లో ఒకరైన అగస్త్య మహాముని, స్వామి నుంచి సకల జ్ఞానాన్ని పొందాడు. పూర్వం జరిగిన భీకర దేవ దానవ యుద్ధంలో చాలా మంది దానవులు హతులు కాగా 'ఇడుంబన్' అనే ఒక రాక్షసుడు మాత్రం అగస్త్య మహర్షి పాదాలు పట్టుకుని శరణు వేడుకున్నాడంట. అప్పుడు అగస్త్యుడు సంతోషించి వీనిని సంహరించడం కన్నా వీడిలో మిగిలిన కొద్దిపాటి రాక్షస ప్రవృత్తిని తొలగించాలని నిర్ణయించుకున్నాడు.

ఇడుంబుని కైలాసానికి పంపిన అగస్త్యుడు
అగస్త్యుడు ఆదిగురువు దక్షిణామూర్తి, శంకరుడు కొలువున్న కైలాసానికి ఇడుంబన్ పంపించదలచి ఇడుంబుడిని పిలిచి, తాను ఎప్పటినుంచో కైలాసంలో ఉన్న శివగిరి, శక్తిగిరి అనే రెండు కొండలను తేవాలని అనుకుంటున్నానని, ఇడుంబుడు ఆ రెండు కొండలను, ఒక కావిడిలో పెట్టుకొని తాను ఉన్న చోటికి రావాల్సిందని ఆజ్ఞాపించాడు.

కైలాసానికేగిన ఇడుంబుడు
అగస్త్య మహాముని ఆజ్ఞ మేరకు ఇడుంబుడు కైలాసం వెళ్లి ఆ రెండు కొండలను కావిడిలో పెట్టుకుని, కావిడిని భుజాలపై వేసుకొని బయలుదేరతాడు. అప్పుడు పరమశివుడు ఈ రాక్షసుడి అసురత్వం పోగొట్టడం, జ్ఞాన రాశి అయినటువంటి సుబ్రహ్మణ్యుడు చేస్తాడులే అని అనుకోని వాడిని వెళ్లనిస్తాడు.

ఇడుంబుని పరిహసించిన కుమారస్వామి
ఇడుంబుడు దారిలో వస్తూ ఉండగా సరిగ్గా పళని దగ్గరకి వచ్చే సరికి ఆ కొండలు మోయలేక ఆయాసం వచ్చి, కాసేపు క్రింద పెట్టి సేద తీరాడు. మళ్లీ కావిడి ఎత్తుకుందామని కిందకి వంగి కావిడి బద్ద భుజం మీద పెట్టుకుని లేచి నిలబడి, రెండు వైపులా బరువు సమానంగా ఉండేలా సర్దుదామని చూస్తే, ఒక వైపు ఎక్కువ బరువు, ఇంకో వైపు తేలిక అవుతోంది కాని, ఎంత ప్రయత్నించినా అవి సమానంగా కుదరలేదు. విసుగెత్తిన ఇడుంబుడు ఏమిటిరా ఈ కావిడి అనుకుని, అలా పైకి చూడగానే అక్కడ సుబ్రహ్మణ్యుడు చిన్న పిల్లవాడి రూపంలో పకపక నవ్వుతున్నాడు.

పాదచారియై పళని కొండపైకి
తనను చూసి నవ్విన పిల్లవాని చూసి 'ఏదో చిన్న పిల్లవాడు నవ్వుతున్నాడులే!' అని అనుకోకుండా తనలో మిగిలి ఉన్న కొద్దిపాటి రాక్షస బుద్ది కారణంగా స్వామికేసి తిరిగి ఏమిటా నవ్వు, నేనేమైనా ఈ కావిడి ఎత్తలేనని అనుకుంటున్నావా? కైలాసం నుంచి తీసుకొచ్చాను. నిన్ను చంపేస్తాను ఇవ్వాళ అని తెలిసో తెలియకో పళని కొండ మీదకి పాదచారియై వెళ్లాడు. పైకి వెళ్లాక, కుమారస్వామి, ఇడుంబునిపై దాడి చేశాడు.

అంత్య సమయంలో వరం కోరిన ఇడుంబుడు
షణ్ముఖుని దెబ్బలకు ప్రాణం పోయే సమయంలో ఇడుంబునికి ఈ పిల్లవాడు సామాన్యుడు కాదు, మా గురువు గారు అయిన అగస్త్యునికే గురువు, సాక్షాత్తు ఈశ్వర పుత్రుడు అయిన సుబ్రహ్మణ్యుడు అని గ్రహించి తనను క్షమించి వరం ఇవ్వాలని కోరుకున్నాడు.

అలా మొదలైంది కావిళ్ల ఉత్సవం
'ఇడుంబుడు ఏ కావడి వల్ల అయితే సుబ్రహ్మణ్యుని చేరుకోగలిగాడో అలాగే పాల కావిడి కాని, విభూతి కావడి కాని, పూల కావిడి కాని, తేనె కావిడి కాని, నేతి కావిడి కాని భుజం మీద పెట్టుకుని, తాము సుబ్రహ్మణ్యుడి దగ్గరకి పోతున్నాము అని పాదచారులై పళని మురుగన్ గుడికి వచ్చినవారికి సుబ్రహ్మణ్యారాధన, శాస్త్రంలో ఎన్ని విధాలుగా చెయ్యాలని ఉందో, అంత ఆరాధన చేసిన ఫలితం ఇవ్వాలి' అని వరం కోరుకున్నాడు ఇడుంబుడు. చూసారా! రాక్షసుడు అయినా లోక కళ్యాణం కోసం ఎంత గొప్ప వరం కోరుకున్నాడో!

ప్రథమ దర్శనం ఇడుంబునిదే
తన స్వార్థం కోసం కాకుండా లోక కల్యాణం కోసం ఇడుంబుడు కోరుకున్న ఆ వరాన్ని అనుగ్రహించిన సుబ్రహ్మణ్యుడు, ఆనాటి నుంచి తన దగ్గరకు వచ్చే భక్తులు ఎవరైనా ముందుగా ఇడుంబుని దర్శించిన తర్వాతనే తన దర్శనానికి వస్తారని వరం ఇచ్చాడు. అందుకే తమిళనాడులోని అన్ని సుబ్రహ్మణ్య క్షేత్రాలలో స్వామి వారిని చేరే మార్గంలో ఇడుంబుడి మూర్తి ఉంటుంది, భక్తులు ముందుగా అక్కడ ఆయనకు నమస్కరించిన తరువాతే, సుబ్రహ్మణ్యుని దర్శనం చేసుకుంటారు.

అత్యంత మహిమాన్వితం కావిళ్ల ఉత్సవం
అప్పటి నుంచి తమిళులు సుబ్రహ్మణ్య కావిళ్లు ఎత్తి, సుబ్రహ్మణ్యుడిని తమ దైవం చేసేసుకున్నారు. అంతే కాక, ప్రతీ ఏటా స్కంద షష్ఠి ఉత్సవాలలో ఏ దంపతులైతే, భక్తి విశ్వాసాలతో స్వామికి నమస్కరించి ఈ కావడి ఉత్సవంలో పాల్గొంటారో వాళ్లకి తప్పక సత్సంతాన ప్రాప్తి కలుగుతుంది. వారి వంశంలో సంతానం కలగక పోవడం అనే దోషం రాబోయే తరాలలో ఉన్నా కూడా ఆ దోష పరిహారం చేసి స్వామి అనుగ్రహిస్తాడు అని పెద్దలు చెప్తారు. దీనినే కావిళ్ల పండగ అని అంటారు.

స్వామి విగ్రహం వెనుక నుంచి విభూతి
పూర్వ కాలంలో ఇక్కడి సుబ్రహ్మణ్యుని ఊరువు అంటే తొడ భాగము వెనుక నుంచి విభూతి తీసి కుష్ఠు రోగం ఉన్నవారికి ప్రసాదంగా ఇస్తే, వారికి వెంటనే ఆ రోగం పోయేదని పెద్దలు చెప్తారు. అలా ఇవ్వగా ఇవ్వగా, స్వామి వారి తొడ భాగం బాగా అరిగిపోవడం వల్ల తరువాత కాలంలో అలా ఇవ్వడం మానేశారు. ఇప్పటికీ స్వామి వారిని వెనుక నుండి చూస్తే అరిగిపోయిన భాగం కనబడుతుందని పెద్దలు చెబుతారు. కాని మనకి సాధారణంగా ఆ అవకాశం కుదరదు.

ఇంతటి శక్తిమంతమైన పళని క్షేత్రాన్ని మనందరం కూడా తప్పక దర్శిద్దాం! పళని దండాయుధ పాణి స్వామి వారి దర్శనం చేసి, జీవితంలో ఒక్క సారైనా సుబ్రహ్మణ్య కావిడి ఎత్తి సుబ్రహ్మణ్య అనుగ్రహం పొందుదాం.

ఓం శ్రీ సుబ్రహ్మణ్య స్వామినే నమః

ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం

సంతానం కోరుకునే వారు ఇలా చేస్తే శుభఫలితం! సోమవారమే సకల గ్రహ దోషాలు పోగొట్టే ఆడికృత్తిక- చేసేయండి మరి - Aadi Krithigai 2024

శివయ్యకు కావిళ్లతో గంగ- కాలినడకనే ప్రయాణం- కన్వర్ యాత్ర విశేషాలివే! - Kanwar Yatra 2024

ABOUT THE AUTHOR

...view details