Padmavathi Brahmotsavam Hanumantha Vahanam : తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా డిసెంబర్ 1వ తేదీ ఆదివారం సాయంత్రం అమ్మవారు హనుమంత వాహనంపై ఊరేగనున్నారు. ఈ సందర్భంగా హనుమంత వాహన సేవ విశిష్టతను ఈ కథనంలో తెలుసుకుందాం.
దాస్య ప్రపత్తిపై అవగాహన
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తిక బ్రహ్మోత్సవాలలో భాగంగా నాలుగో రోజు ఆదివారం సాయంత్రం అమ్మవారు హనుమంత వాహనంపై శ్రీ భద్రాద్రి రాముడి అలంకారంలో ఊరేగుతూ భక్తులను ఆశీర్వదించడమే కాకుండా ఈ దివ్యవాహనం ద్వారా బోధిస్తున్న గొప్ప దాస్య ప్రపత్తిపై అవగాహన కలిగించనున్నారు. అశ్వాలు, వృషభాలు, గజాలు, మంగళవాయిద్యాలు, భక్తుల కోలాటాల నడుమ అమ్మవారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు రాముడిగా దర్శనమిస్తారు.
దాస్య ప్రపత్తికి నిదర్శనం
త్రేతాయుగంలో హనుమంతుడు శ్రీరామునితో శాశ్వతమైన బంధానికి ప్రసిద్ధి చెందాడు. శ్రీరామునికి అంకితభావంతో సేవ చేయడమే కాకుండా ఒక నమ్మిన బంటుకు చిహ్నంగా హనుమంతుడు నిలిచాడు.
భక్తికి పరాకాష్ట
హనుమంతుడు భగవత్ భక్తులలో అగ్రగణ్యుడు. భక్తికి పరాకాష్ట హనుమత్ తత్వం. రామాయణంలో మారుతి స్థానం అద్వితీయం. చతుర్వేద నిష్ణాతుడుగా, లంకాభీకరుడిగా ప్రసిద్ధుడైన ఆంజనేయుడు అమ్మవారిని తన భుజాలపై మోస్తూ బ్రహ్మోత్సవాలలో దర్శనమిస్తాడు.
హనుమంత వాహన దర్శనం సకలపాప హరణం
హనుమంత వాహనం అంటే భగవత్ భక్తి ప్రాప్తి అని పురాణాలు చెబుతున్నాయి. అందుకే బ్రహ్మోత్సవాలలో హనుమంతునిపై ఊరేగే అమ్మవారిని దర్శిస్తే భగవంతునిపై అచంచలమైన భక్తి విశ్వాసాలు పెంపొందుతాయని, జన్మాంతర పాపాలు నశిస్తాయని శాస్త్రవచనం. భక్తుల పాపాలను పోగొట్టి భక్తి మార్గం వైపు నడిపించడానికి బ్రహ్మోత్సవాలలో హనుమంత వాహనంపై ఊరేగే పద్మావతి అమ్మవారికి నమస్కరిస్తూ ఓం శ్రీ పద్మావతి దేవ్యై నమః
ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.
Conclusion: