తెలంగాణ

telangana

ETV Bharat / spiritual

కార్తిక మాసంలో నారికేళ దీపాన్ని ఇలా వెలిగిస్తే - ధనపరమైన ఇబ్బందులు తొలగిపోతాయట! - NARIKELA DEEPAM IMPORTANCE

-శివానుగ్రహాన్ని కలిగించే నారికేళ దీపం -ఇలా వెలిగిస్తే కోరిన కోరికల నెరవేరుతాయట

Narikela Deepam Importance
Narikela Deepam Importance (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Nov 6, 2024, 4:59 PM IST

Narikela Deepam Importance in Karthika Masam: కార్తికం.. శివకేశవులిద్దరికీ పరమ పవిత్రమైన, ప్రీతిపాత్రమైన మాసం. ఇది ఆధ్యాత్మిక సాధనకు, మోక్షసాధనకు విశిష్టమైనది. హిందూ మత విశ్వాసాల ప్రకారం ఈ మాసంలో స్నానం, దానం, జపం, ఉపవాసం, దీపారాధన, దీప దానం వంటి వాటికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. ఈ క్రమంలోనే అందరూ దేవాలయాల్లో ఇంటి గుమ్మం ముందు రకరకాల దీపాలు వెలిగిస్తుంటారు. అయితే కార్తిక మాసంలో నారికేళ దీపం వెలిగిస్తే.. శివానుగ్రహం సంపూర్ణంగా లభిస్తుందని, ధనపరమైన ఇబ్బందులు తొలగిపోతాయని, కోరికలు నెరవేరతాయని ప్రముఖ జ్యోతిష్య నిపుణులు మాచిరాజు కిరణ్ కుమార్ చెబుతున్నారు. ఇంతకీ, ఈ నారికేళ దీపం ఎప్పుడు వెలిగించాలి? ఎలా వెలిగించాలి? పూర్తి పూజా విధానమేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

ఎప్పుడు వెలిగించాలి:పరమశివుడికి ఎంతో ప్రీతిపాత్రమైన నారికేళ దీపాన్ని కార్తికమాసంలో ఏ రోజైనా ప్రదోషకాలంలో అంటే సాయంకాలం ఇంట్లోని పూజ మందిరింలో వెలిగించాలని చెబుతున్నారు. కార్తిక మాసంలో వచ్చే సోమవారాల్లో నారికేళ దీపాన్ని వెలిగిస్తే మరీ మంచిదని వివరిస్తున్నారు.

ఎలా వెలిగించాలంటే:

  • పూజా మందిరాన్ని ముందుగా అలంకరించుకోవాలి.
  • ఆ తర్వాత పరమేశ్వరుడి చిత్రపటం లేదా లింగ స్వరూపానికి గంధం, కుంకుమ బొట్లు పెట్టి పుష్పాలు పెట్టాలి.
  • శివుడి చిత్రపటం ముందు పీట ఏర్పాటు చేయాలి. ఆ పీటకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి.
  • ఇప్పుడు ఆ పీట మీద రాగి లేదా ఇత్తడి పళ్లెంను ఉంచాలి. ఆ పళ్లెంకు ఐదు చోట్ల గంధం, కుంకుమ బొట్లు పెట్టాలి.
  • ఆ తర్వాత ఓ చిన్న ప్లేట్​లోకి గంధం తీసుకోవాలి. అందులోకి గంగాజలం లేదా మంచినీటిని పోసి కలపాలి. ఆ తడి గంధంలో ఉంగరపు వేలు ముంచి పళ్లెంలో స్వస్తిక్​ గుర్తు రాయాలి. ఆ స్వస్తిక్​ గుర్తుకు నాలుగు చోట్ల గంధం, కుంకుమ బొట్లు పెట్టాలి.
  • ఇప్పుడు ఆ స్వస్తిక్​ గుర్తు మీద బియ్యాన్ని కుప్పలాగా పోసుకోవాలి.
  • ఇప్పుడు ఓ కొబ్బరికాయను తీసుకుని పసుపు నీళ్లతో శుభ్రం చేసి దానిని పగలకొట్టాలి.
  • ఆ రెండు కొబ్బరి చెక్కలను పళ్లెంలోని బియ్యం మీద ఉంచాలి. ఇప్పుడు అందులో ఒక కొబ్బరి చిప్పకు ఐదు చోట్ల గంధం, కుంకుమ బొట్లు పెట్టాలి.
  • అనంతరం ఆ కొబ్బరి చిప్పలో ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె పోయాలి.
  • ఆ తర్వాత రెండు వత్తులను కలిపి ఒక వత్తిగా చేయాలి. అలాంటివి మూడు రెడీ చేసుకోవాలి.
  • ఈ మూడు వత్తులను కొబ్బరి చిప్పలో తూర్పువైపు ఒక వత్తి, ఉత్తరం వైపు రెండోది, ఈశాన్యం వైపు మూడో వత్తి ఉంచాలి. అలా ఉంచిన తర్వాత ఏకహారతి లేదా అగరబత్తీతో వెలిగిస్తూ "దారిద్య్ర దుఃఖ దహనాయ నమః శివాయ"అనే మంత్రాన్ని 21 సార్లు చదవాలి.
  • నారికేళ దీపం పక్కన ఉన్న మరో కొబ్బరి చిప్పలో తీపి పదార్థాలను నైవేద్యంగా సమర్పించాలి. అంటే ఒక కొబ్బరి చిప్పలో నారికేళ దీపం, మరో కొబ్బరి చిప్పలో నైవేద్యం పెట్టాలి.
  • ఇలా దీపం వెలిగించిన తర్వాత ఆ దీపం చుట్టూ పుష్పాలు అలకరించాలి. అక్షతలు వేయాలి. దీపానికి హారతి ఇవ్వాలి.

దీపం కొండెక్కిన తర్వాత ఏం చేయాలి:

  • నారికేళ దీపం కొండెక్కిన తర్వాత ఈ రెండు కొబ్బరి చిప్పలను, దీపం చుట్టూ ఉన్న పూలు, అక్షతలను ఎవరూ తొక్కని చోట చెట్టు మొదట్లో వేయాలని చెబుతున్నారు.
  • అలాగే పళ్లెంలో ఉన్న బియ్యాన్ని పొంగళిగా చేసుకుని శివుడికి నైవేద్యంగా పెట్టి దానిని కుటుంబ సభ్యులు స్వీకరించాలని వివరిస్తున్నారు మాచిరాజు కిరణ్​ కుమార్​.

Note :పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

కార్తికంలో "దీపదానం" చేస్తున్నారా? - ఈరోజున దానం చేస్తే ప్రభుత్వ ఉద్యోగమట!

కార్తిక మాసంలో ఈ రోజుల్లో ఇలా "ధనదీపం" వెలిగించండి - ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయి ధనవంతులవ్వడం పక్కా!

ABOUT THE AUTHOR

...view details