Makar Sankranti 2025 Puja Vidhi :తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండగ వస్తోందంటే చాలు ఆ హడావుడి మామూలుగా ఉండదు. భోగి మంటలు, కోడి పందేలు, పిండి వంటలు, కొత్త అల్లుళ్లు ఇలా చెప్పుకుంటూ పోతే మూడు రోజుల పాటు పల్లెటూర్లు అన్నీ పండుగ వాతావరణంతో కళకళలాడతాయి. ఈ క్రమంలోనే పండగ వేళ కొత్త బట్టలు ధరించడం, దేవాలయాలకు వెళ్లడం వంటి పనులు చేస్తారు. ఇదిలా ఉంటే మకర సంక్రాంతిరోజు శివకేశవులను ప్రత్యేకంగా పూజించడంతో పాటు కొన్ని ప్రత్యేకమైన విధివిధానాలు పాటించడం ద్వారా సంవత్సరం మొత్తం సకల శుభాలు కలుగుతాయంటున్నారు ప్రముఖ జ్యోతిష్య నిపుణులు మాచిరాజు కిరణ్ కుమార్. మరి, అవేంటో ఇప్పుడు చూద్దాం.
- సంక్రాంతి రోజు ఇంటిల్లిపాదీ తప్పకుండా నల్ల నువ్వుల పిండిని ఒంటికి రాసుకొని అభ్యంగన స్నానం చేయాలి. అదేవిధంగా, స్నానం పూర్తికాగానే ఒక గ్లాసులో పాలు తీసుకొని కొద్దిగా పంచదార, తెల్ల నువ్వులు వేసుకొని కలిపి తాగాలి. పండగ రోజులు ఈ రెండు విధులను ఎవరైతే పాటిస్తారో వారికి సంవత్సరం మొత్తం శని భగవానుడి అనుగ్రహం కలుగుతుందంటున్నారు జ్యోతిష్యులు మాచిరాజు కిరణ్ కుమార్. అలాగే, ఆరోగ్యపరంగా కూడా చక్కటి ప్రయోజనాలు చేకూరతాయంటున్నారు.
- మకర సంక్రాంతి రోజు తప్పనిసరిగా శివకేశవులను పూజించాలి. అంటే శివుడు, విష్ణుమూర్తిని ప్రత్యేకంగా ఆరాధించాలి. మరి, ఈరోజు పరమేశ్వరుడిని ఎలా పూజించాలంటే మీ పూజా మందిరంలో శివలింగం లేదా చిత్రపటం దగ్గర నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించాలి. అలాగే శివలింగం ఇంట్లో ఉన్నవారు ఆవు నెయ్యితో అభిషేకం నిర్వహించాలి. ఇలా ఎవరైతే చేస్తారో వారికి ఏడాది మొత్తం శివుని అనుగ్రహం లభించి సమస్త శుభాలు కలుగుతాయంటున్నారు.
- అదేవిధంగా పరమశివుడికి తెల్ల బియ్యం అంటే చాలా ఇష్టం. అంటే కొన్ని బియ్యాన్ని తీసుకుని నీళ్లలో తడపండి. తర్వాత ఆ తడి బియ్యాన్ని శివలింగం మీద గానీ లేదంటే శివుడి చిత్రపటం దగ్గర గానీ వేస్తూ "శ్రీం శివాయ నమః" అనే మంత్రాన్ని మనసులో స్మరించుకోవాలి. సంక్రాంతి రోజు తడి బియ్యంతో ఇలా శివుడిని పూజించడం ద్వారా పరమేశ్వరుడి సంపూర్ణ అనుగ్రహం పొందవచ్చంటున్నారు.
- ఇకపోతే విష్ణుమూర్తిని పూజించేటప్పుడు పద్మ పుష్పాలను సమర్పించండి. ఎందుకంటే విష్ణువుకు ఆ పుష్పాలంటే చాలా ఇష్టం. కాబట్టి, మకర సంక్రాంతి నాడు ఇలా విష్ణుమూర్తిని పూజించడంతో పాటు విష్ణువు సహస్ర నామం చదివినా, విన్నా ఉత్తమ ఫలితాలు కలుగుతాయంటున్నారు.
- అలాగే, విష్ణువు సహస్రనామం చదువుకోలేని వారు "ఓం నమో భగవతే విష్ణవేః" అనే మంత్రాన్ని 21 సార్లు జపిస్తూ పద్మ పుష్పాలను స్వామి వారికి సమర్పించి నమస్కారం చేసుకున్నా శుభ ఫలితాలను పొందవచ్చంటున్నారు.
- మకర సంక్రాంతి రోజు సూర్య కిరణాలు పడే చోట ఆవు పాలతో పొంగలితయారు చేయండి. ఆ పొంగలి ఇంట్లో పూజలో నైవేద్యంగా సమర్పించండి. తర్వాత దాన్ని ఇంట్లో వారంతా నైవేద్యంగా స్వీకరించడం ద్వారా శివుడి, విష్ణుమూర్తి, సూర్యభగవానుడి అనుగ్రహం లభించి సకల శుభాలు కలుగుతాయంటున్నారు జ్యోతిష్యులు.
- ఇకపోతే మకర సంక్రాంతి రోజు సూర్యుడు ఉత్తరాయాణ పుణ్యకాలంలోకి ప్రవేశిస్తాడు. కాబట్టి, ఆయనను ఆహ్వానించడానికి ఆరోజు ఆకాశంలోకి గాలి పటాలు ఎగురవేయాలి. అలాగే సంక్రాంతి రోజు ఇంటి ముందు రథం ముగ్గు వేయాలి. ఇలా వేయడం ద్వారా సూర్యనారాయణుడి అనుగ్రహం సంపూర్ణంగా పొందవచ్చంటున్నారు.
- ఇలా మకర సంక్రాంతి రోజు కొన్ని ప్రత్యేకమైన విధివిధానాలు పాటించడం వల్ల సంవత్సరం మొత్తం సమస్త శుభాలను సిద్ధింపచేసుకోవచ్చంటున్నారు ప్రముఖ జ్యోతిష్య నిపుణులు మాచిరాజు కిరణ్ కుమార్.
NOTE:పైన తెలిపిన వివరాలు కొందరు జోతిష్య నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.