తెలంగాణ

telangana

ETV Bharat / spiritual

మహా శివరాత్రి రోజున జ్యోతిర్లింగాల దర్శనం ఎంతో పుణ్యం - ఎక్కడున్నాయి? - ఎలా వెళ్లాలి? - how to go Jyotirlingas

Mahashivratri Special Jyotirlinga Darshan : మహా శివరాత్రి పర్వదినం.. ఆ పరమేశ్వరుడి భక్తులకు అత్యంత ముఖ్యమైన రోజు. ఈ రోజున దేశంలోని 12 జ్యోతిర్లింగాల్లో ఏదైనా ఒక్కటి దర్శించుకున్నా.. ఎన్నో జన్మల పుణ్యఫలం దక్కుతుందని పండితులు చెబున్నారు. మరి మీరు కూడా ఈ క్షేత్రాలకు వెళ్లాలనుకుంటున్నారా? అయితే.. అవి ఏ రాష్ట్రంలో ఉన్నాయి? అక్కడికి ఎలా చేరుకోవాలి? అనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం

Mahashivratri Special Jyotirlinga Darshan
Mahashivratri Special Jyotirlinga Darshan

By ETV Bharat Telugu Team

Published : Mar 2, 2024, 4:52 PM IST

Mahashivratri Special Jyotirlinga Darshan : హిందూవులకు ఎంతో పవిత్రమైన మహాశివరాత్రి ఈ సంవత్సరం మార్చి 8వ తేదీన వచ్చింది.పరమశివుడికి అత్యంత ప్రీతికరమైన ఈ రోజున దేశంలోని 12 జ్యోతిర్లింగాలలో ఏ ఒక్కటి దర్శించుకున్నా.. పాపాలన్నీ తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు. మీరు కూడా వీటిని దర్శించుకోవాలని అనుకుంటున్నారా ? అయితే, అవే ఏ రాష్ట్రంలో ఉన్నాయి ? అక్కడికి ఎలా చేరుకోవాలనేది ఇప్పుడు చూద్దాం.

1. సోమనాథేశ్వరం :
పరమశివుని ద్వాదశ జ్యోతిర్లింగాలలో మొదటిస్థానంలో ఉన్న సోమనాథక్షేత్రం గుజరాత్‌లో ఉంది. శివుడు జ్యోతిర్లింగ ఆకారంలో భక్తులకు యుగయుగాల నుంచి ఇక్కడ దర్శనమిస్తున్నారు. ఇక్కడికి చేరుకోవడానికి మీరు డయ్యూ విమానాశ్రాయానికి వెళ్లవచ్చు. లేదా రైలులో వెరావల్‌ రైల్వే స్టేషన్‌ చేరుకోవచ్చు. అక్కడి నుంచి క్షేత్రానికి వెళ్లొచ్చు.

2.మ‌ల్లికార్జున స్వామి ఆలయం :
ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాలో ఉన్న నల్లమల కోనలో శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయం ఉంది. ఇక్కడ కృష్ణా నది తీరంలోని ఒక కొండ మీద నందీశ్వరుడు చేసిన ఘోర తపస్సుకి మెచ్చిన శివుడు.. భ్రమరాంబికాసమేతుడై వెలిశాడనేది ఓ పురాణ గాథ. ఇక్కడికి చేరుకోవడానికి కర్నూలు రైల్వే స్టేషన్‌కు చేరుకోవాలి. అక్కడి నుంచి కాస్త దగ్గరగా ఉంటుంది.

3. మహాకాళేశ్వరాలయం :
మధ్యప్రదేశ్‌లోని క్షిప్రా నది ఒడ్డున ఉన్న ఉజ్జయినిలో ఉందీ ఆలయం. ఈ పట్టణంలో 7 సాగర తీర్థాలు, 30 శివలింగాలు, అష్టభైరవులు, ఏకాదశరుద్రులు, వందలాది దేవతా మందిరాలు ఉన్నాయి. మహాశివరాత్రి రోజున ఇక్కడ ఎంతో వైభవంగా పూజలు జరుగుతాయి. ఇక్కడికి చేరుకోవడానికి సమీప విమానాశ్రయం ఇండోర్‌లో ఉంది. రైలు మార్గంలో వెళ్లాలనుకుంటే ఉజ్జయిని వరకు రైలు మార్గం ఉంది.

4. ఓంకారేశ్వరాలయం :
ఈ ఆలయం మధ్యప్రదేశ్‌లోని నర్మదా నది మధ్యలో ఉన్న ఒక ద్వీపంలో ఉంది. ఈ ద్వీపం హిందూ చిహ్నం 'ఓం' ఆకారం రూపంలో ఉంటుంది. అందుకే ఓంకారేశ్వర్ అని పేరు వచ్చిందని భక్తులు నమ్ముతారు. ఇక్కడికి చేరుకోవడానికి సమీప విమానాశ్రయం ఇండోర్‌లో ఉంది. ఓంకారేశ్వర్ రోడ్‌ వరకు రైలు మార్గం ఉంది.

5. కేదారనాథేశ్వరం :
ఉత్తరాఖండ్‌లో ఉన్న కేదార్‌నాథ్ ఆలయం 11,755 అడుగుల ఎత్తులో ఉంది. ఇక్కడికి చేరుకోవడం కొంచెం సవాలుతో కూడకున్నది. మీరు ఈ శివరాత్రికి కేదారనాథేశ్వరం ఆలయానికి వెళ్లాలనుకుంటే.. విమానంలో డెహ్రాడూన్ విమానాశ్రయానికి చేరుకోవచ్చు. ఇక్కడి నుంచి ఈ ఆలయం దగ్గరగా ఉంటుంది. రిషికేశ్‌ రైల్వే స్టేషన్‌ వరకు రైల్లో వెళ్లొచ్చు.

6.భీమశంకరాలయం :
మహారాష్ట్రలోని పుణెకు సమీపంలో ఉన్న భావగిరి గ్రామంలో భీమశంకరాలయం ఉంది. ఈ జ్యోతిర్లింగం నుంచి నిత్యం నీరు ప్రవహిస్తూనే ఉంటుంది. భీమశంకరం క్షేత్రం చేరుకోవడానికి దగ్గరగా ఉండే విమానాశ్రయం, రైల్వే స్టేషన్‌ రెండూ పూణేలో ఉన్నాయి.

7.కాశీ విశ్వేశ్వరం :
వారణాసిగా పిలిచే కాశీ క్షేత్రంలో విశ్వేశ్వర జ్యోతిర్లింగం ఉంది. హిందువులకు అత్యంత పవిత్రమైన దేవాలయాలలో ఒకటిగా దీన్ని చెబుతారు. ఇక్కడికి చేరుకోవడానికి దగ్గరగా ఉండే విమానాశ్రయం, రైల్వే స్టేషన్‌ రెండూ వారణాసిలో ఉన్నాయి.

8. త్రయంబకేశ్వరం, మహారాష్ట్ర :
మహారాష్ట్రలోని నాసిక్‌ సమీపంలో త్రయంబకేశ్వరం క్షేత్రం ఉంది. ఈ ఆలయం బ్రహ్మగిరి పర్వతం నుంచి గోదావరి నది జన్మించిందని భక్తులు నమ్ముతారు. ఇక్కడికి చేరుకోవడానికి దగ్గరగా ఉండే విమానాశ్రయం ముంబయిలో ఉంది. అలాగే నాసిక్‌ రైల్వే స్టేషన్‌కు వచ్చి మీరు ఈ ఆలయానికి వెళ్లవచ్చు.

మీరు ధరించే రుద్రాక్ష ఏ రకం? - మొత్తం 21 రకాలు - వాటి విశిష్టతలు తెలుసా?

9.వైద్యనాథ్‌ ఆలయం :
ఈ ఆలయం ఝార్ఖండ్‌లోని డియోఘర్‌లో ఉంది. దీనిని అత్యంత శక్తివంతమైన జ్యోతిర్లింగాలలో ఒకటిగా చెబుతారు. ఈ క్షేత్రాన్ని ఒక్కసారి దర్శనం చేసుకుంటే అన్ని రకాల వ్యాధులూ నయమవుతాయని భక్తులు విశ్వసిస్తారు. ఇక్కడికి చేరుకోవడానికి మీరు రాంచీ విమానాశ్రయానికి చేరుకోవచ్చు. అలాగే దగ్గరగా ఉండే రైల్వే స్టేషన్‌ డియోఘర్‌లో ఉంది.

10.నాగేశ్వర్ ఆలయం :
గుజరాత్‌లోని ద్వారక నగరంలో నాగేశ్వర్ ఆలయం ఉంది. ఇక్కడికి చేరుకోవడానికి మీరు జామ్‌నగర్‌లో ఉన్న విమానాశ్రయానికి చేరుకోవచ్చు. అలాగే ద్వారక రైల్వే స్టేషన్‌కు చేరుకున్నా కూడా ఈజీగా ఈ ఆలయానికి వెళ్లవచ్చు.

11. రామేశ్వరం :
రామేశ్వ‌ర జ్యోతిర్లింగం తమిళనాడు రాష్ట్రంలోని రామేశ్వరం పట్టణంలో ఉంది. ఇక్కడికి చేరుకోవడానికి మధురైలో ఉండే విమానాశ్రయం దగ్గరగా ఉంటుంది. అలాగే రామేశ్వరం ర్వైల్వే స్టేషన్‌ నుంచి కూడా చేరుకోవచ్చు.

12. ఘృష్ణేశ్వరం :
మహారాష్ట్రలోని దౌలతాబాద్‌ సమీపంలో ఉన్న ఘృష్ణేశ్వరం ఆలయం వేరుల్‌ గ్రామంలో ఉంటుంది. పూర్వం ఈ నగరాన్ని దేవగిరి అని పిలిచేవారట. ఈ ఆలయానికి చేరుకోవడానికి దగ్గరగా ఉండే విమానాశ్రయం, రైల్వే స్టేషన్‌ రెండూ ఔరంగాబాద్‌లో ఉన్నాయి.

పసుపు నీటితో స్నానం చేస్తున్నారా? - జ్యోతిష్యం ఏం చెబుతోందో తెలుసా?

పర్సులో ఈ వస్తువులు పెడుతున్నారా? - వాస్తు ప్రకారం మీకు ఆర్థిక కష్టాలు గ్యారెంటీ!

ABOUT THE AUTHOR

...view details