Maha Shivaratri 2024 Date: మహాశివుడికి అత్యంత ప్రీతిపాత్రమైన రోజు మహాశివరాత్రి. ఈ రోజు కోసం శివభక్తులు ఎంతగానో ఎదురు చూస్తుంటారు. ప్రతినెలా మాస శివరాత్రి వస్తుంది. కానీ.. మహా శివరాత్రి ఏడాదికి ఒక్కసారే వస్తుంది. ఈ పర్వదినాన ఉపవాసంతోపాటు రాత్రంతా జాగరణ ఉంటారు. మరి ఈ సంవత్సరం మహా శివరాత్రి ఎప్పుడు వచ్చింది..? ఆ రోజున భక్తులు ఏం చేయాలి? వంటి వివరాలు ఈ స్టోరీలో చూద్దాం..
మహాశివరాత్రి ఎప్పుడు వచ్చింది? :తెలుగు సంవత్సరాది ప్రకారం మహాశివరాత్రిని మాఘమాసం బహుళ చతుర్దశి రోజున జరుపుకుంటారు. క్యాలెండర్ ప్రకారం.. ఈ ఏడాది శివరాత్రి మార్చి 8వ తేదీ శుక్రవారం వచ్చింది. ఆ రోజున రాత్రి 8 గంటల 13 నిమిషాల వరకు త్రయోదశి తిథి ఉంటుంది. ఆ తర్వాత నుంచి చతుర్థశి ప్రారంభమవుతుంది. చతుర్థశి తిథి మార్చి 9, 2024 సాయంత్రం 06.17 గంటలకి ముగుస్తుంది. అయితే.. శివరాత్రి అంటే లింగోద్భవ సమయానికి చతుర్ధశి తిథి ఉండడం ప్రధానం.. అందుకే మహాశివరాత్రిని మార్చి 8న జరుపుకోవాలని పండితులు చెబుతున్నారు.
ఆరోజున ఏం చేయాలి:మహాశివరాత్రి.. పరమశివునికి ఎంతో ప్రీతికరమైన రోజుగా హిందూ ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. ఆ రోజున ప్రతి ఒక్కరూ ఉపవాసం, జాగరణ ఉండటం, రోజంతా శివనామాన్ని స్మరించడం, ప్రదోషకాలంలో శివున్ని అభిషేకిస్తారు. శివుడికి బిల్వార్చన, రుద్రాభిషేకం చేస్తారు. రోజంతా ఉపవాసం ఉంటారు. ఉపవాస నియమాలను భక్తిశ్రద్ధలతో పాటిస్తే.. పుణ్యఫలం దక్కుతుందని నమ్మకం. అలాగే శివరాత్రి రోజున జాగరణ ఉండటం వల్ల రాత్రి పూట చేసే శివార్చన, శివాభిషేకం వల్ల శరీరానికి తేజస్సు వస్తుందట. అలాగే.. భగవంతుడి మీద సాధకులకు, మోక్షమార్గంలో ప్రయత్నించేవారికి ఇది విశేష సమయమని చెబుతున్నారు.
Pratidwani: శివతత్వాన్ని ఎలా అన్వయించుకోవాలి?
ఐదు శివరాత్రులు..మహా శివరాత్రి రోజున శాస్త్రోక్తంగా శివుడిని ఆరాధించినా.. ఎలాంటి మంత్రాలూ తెలియక కేవలం భక్తితో శివలింగం మీద చెంబుడు నీళ్లు పోసినా రెండూ తనకి సమానమే అంటాడు ఆ కైలాసనాథుడు. హైందవ సంప్రదాయంలో నిత్య, పక్ష, మాస, మహా, యోగ అనే ఐదు రకాల శివరాత్రులు ఉన్నాయని పురాణాలు చెబుతున్నాయి. నిత్య శివరాత్రి అంటే రోజూ శివుడిని ఆరాధించడం. పక్ష శివరాత్రి అంటే ప్రతి మాసంలో శుక్ల, బహుళ చతుర్దశి రోజున శివారాధన చేయడం. మాస శివరాత్రి అంటే.. నెలలో బహుళ చతుర్దశి రోజున దేవదేవుడిని అర్చించేది. అలాగే, మాఘ బహుళ చతుర్దశిని సర్వశ్రేష్ఠమైన మహా శివరాత్రిగా శివపురాణం పేర్కొంటోంది. సాధకుడు తన యోగ మహాత్మ్యంతో యోగనిద్రకు ఉపక్రమించడాన్ని యోగ శివరాత్రి అంటారు.