Magha Purnima 2024 Date and Significance: అన్ని మాసాలలో కెల్లా మాఘ మాసానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ మాఘమాసంలో వచ్చే పూర్ణిమనే మాఘపూర్ణిమ అని పిలుస్తారు. ఈరోజు సముద్రస్నానం చేయడం వల్ల అంతా మంచే జరుగుతుందని పండితులు చెబుతున్నారు. మరి ఈ సంవత్సరం మాఘ పూర్ణిమ ఎప్పుడు వచ్చింది? శుభ ముహూర్తం ఎప్పుడు? మాఘ పూర్ణిమ విశిష్టత, పూజా విధానం వంటి వివరాలు ఈ స్టోరీలో చూద్దాం..
అగము అనే పదానికి సంస్కృతంలో పాపం అని అర్థం. మాఘము అంటే పాపాలను నశింపజేసేది అని అర్థం. పాపాలను తొలగించేది గనుకనే మాఘ మాసానికి, మాఘ పౌర్ణమికి ప్రాధాన్యం లభించింది. మాఘ పౌర్ణమి రోజు గౌరీ దేవి జననం జరిగినట్లు పురాణాలు తెలియజేస్తున్నాయి. అలాగే శ్రీ మహా విష్ణువు మాఘ పౌర్ణమి రోజు స్వయంగా గంగయందు నివసిస్తాడని పురాణాలు చెబుతున్నాయి. అందుచేత ప్రతి ఒక్కరూ ఈ రోజు పుణ్య నదుల్లో గానీ, సముద్రంలో గానీ, వారి గృహాల్లో గంగా జలంతో శ్రీ మహావిష్ణువును, గంగను స్మరిస్తూ తలస్నానం ఆచరించాలి. మాఘ పౌర్ణమి రోజు తలస్నానం ఆచరించిన వారికి.. శ్రీమన్నారాయణుడిని, సూర్య భగవానుడిని, గంగా నదిని స్మరించి తర్పణాలు వదిలిన వారికి.. పుణ్యం కలుగుతుందని మాఘ పురాణం తెలియజేస్తోంది.
మాఘ పూర్ణిమ తేదీ, శుభ ముహూర్తం:మాఘ పౌర్ణమి ఫిబ్రవరి 23 మధ్యాహ్నం 03.33 గంటలకు ప్రారంభమవుతుంది. అలాగే ఇది మరుసటి రోజు అంటే ఫిబ్రవరి 24న సాయంత్రం 05.59 గంటలకు ముగుస్తుంది. సనాతన ధర్మంలో ఉదయ తిథికి ప్రాముఖ్యత ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఫిబ్రవరి 24 అంటే శనివారం నాడు మాఘ పూర్ణిమ జరుపుకోనున్నారు.
మాఘ పూర్ణిమ శుభ సమయం:
స్నానం-దానం ముహూర్తం - 05:11 AM నుంచి 06:02 AM వరకు
అభిజిత్ ముహూర్తం - మధ్యాహ్నం 12:12 నుంచి 12:57 వరకు