తెలంగాణ

telangana

ETV Bharat / spiritual

మాఘ పురాణం 25వ అధ్యాయం- ప్రాయశ్చిత్త వ్రతాన్ని ఆచరించిన విశృంఖలుడి కథ! - MAGHA PURANA CHAPTER 25

ప్రాయశ్చిత్త వ్రతంతో పవిత్రులైన మిత్రులు- మాఘ పురాణం 25వ అధ్యాయం కథ ఇదే!

Magha Purana Chapter 25
Magha Purana Chapter 25 (Getty Images)

By ETV Bharat Telugu Team

Published : Feb 23, 2025, 5:01 AM IST

Magha Purana Chapter 25 : పరమ పవిత్రమైన మాఘ మాసంలో నిరాటంకంగా కొనసాగుతున్న మాఘ పురాణంలో 25వ అధ్యాయంలో వీరవ్రతుడు విశ్రుంఖలునికి పాపాలకు ఏ విధమైన ప్రాయశ్చిత్తం చెప్పాడో గృత్స్నమద మహర్షి, జహ్ను మహర్షుల సంవాదం ద్వారా తెలుసుకుందాం.

గృత్స్నమద మహర్షి, జహ్ను మహర్షుల సంవాదం
గృత్స్నమద మహర్షి, జహ్ను మహర్షితో, ఓ జహ్నువూ! విశ్రుంఖలుని వృత్తాంతం దివ్యదృష్టితో చూసిన వీరవ్రతుడు ఈ విధంగా పలికాడు అని చెబుతూ 25వ అధ్యాయాన్ని మొదలు పెట్టాడు.

విశ్రుంఖలుని దోషాలు వివరించిన వీరవ్రతుడు
వీరవ్రతుడు విశ్రుంఖలునితో "ఓరీ! విశృంఖలా! విప్రాధామా! నీవు చేసిన పాపాలు వివరించి చెబుతాను వినుము. నీ యజమాని కిరాతుడు కనికరం లేనివాడు. అమిత క్రూరుడు. జంతువులను పట్టి చంపేవాడు. అరణ్యంలో దారి కాచి బాటసారుల నుంచి ధనం, బంగారం దోచుకునేవాడు. వీడికి ఒక కంసాలి మిత్రుడు కలదు. వాడు మోసం చేయడంలో దిట్ట. ఇతరుల బంగారం దొంగిలించేవాడు. వీరిద్దరికి ఒక శూద్రుడు మిత్రుడు. వీడు పరమ ఘాతకుడు. కామానికి వశుడై వావి వరుస లేకుండా జంతువులా సంచరిస్తూ చేయరాని పాపాలు అనేకం చేశాడు. ఇటువంటి వారితో కలిసి మెలిసి తిరుగుతూ, వారితో కలిసి తింటూ, నిద్రిస్తూ, వారిచ్చే ధనంతో జీవించడం వలన నీ బ్రాహ్మణత్వం నశించింది. బ్రాహ్మణ జన్మ ఎత్తిన వారు పాపులకు దూరంగా ఉండాలి. వారితో మాట్లాడకూడదు, స్నేహం చేయకూడదు. తప్పనిసరై మాట్లాడవలసి వస్తే శిరస్సున దర్భలు ఉంచుకొని మాట్లాడితే వారి పాతకాలు అంటవు. నీవు స్నేహం చేసిన ముగ్గురు కూడా పంచ మహాపాతకాలు చేసినవారు. అందుకే నీతో కూడా మాట్లాడకూడదు" అని వీరవ్రతుడు మౌనం వహించాడు.

భయంతో ప్రాయశ్చిత్తం కోరిన విశ్రుంఖలుడు
వీరవ్రతుని మాటలు విన్న విశ్రుంఖలుడు భయకంపితుడై పశ్చాత్తాపం పొంది వీరవ్రతునితో "ఓ మహానుభావా! నా అజ్ఞానాన్ని మన్నింపుము. సమస్త పాపక్షయకరమగు ప్రాయశ్చిత్త కర్మను నా చేత చేయించి నన్ను పునీతుని గావింపుము అని పరిపరి విధాలుగా ప్రార్థించెను.

విశ్రుంఖలునికి ప్రాయశ్చిత్త కర్మను బోధించిన వీరవ్రతుడు
విశ్రుంఖలుని ప్రార్థనకు కరిగిపోయిన వీరవ్రతుడు ఎంతో దయతో "విశృంఖలా! జాగ్రత్తగా వినుము. ఈనాటి నుంచి 12 సంవత్సరాల పాటు నిరంతరం నీవు చేసిన పాపాలను తలచుకుంటూ గ్రామసంచారం చేస్తూ, ఇల్లిల్లూ తిరుగుతూ భిక్షాటన చేసి భిక్ష భోజనం మాత్రమే స్వీకరించాలి. ప్రతి సంవత్సరం మాఘ మాసం నెల రోజులపాటు ప్రయాగలో త్రివేణి సంగంలో స్నానం చేస్తూ, శ్రీహరిని పూజిస్తూ, ఆవు పిడకల మీద అన్నం వండుకుని తింటూ కాలక్షేపం చేయాలి. ఈ వ్రతం 12 ఏళ్ల పాటు చేసిన తరువాత నీవు పవిత్రుడవు కాగలవు. బ్రాహ్మణులూ జన్మతః పవిత్రులు. కానీ అజ్ఞానంతో చేసిన పాపాలు పోవడానికి ప్రయాగలో స్నానం చేయడం తప్పనిసరి. నేను చెప్పినట్లుగా చేస్తే నీ పాపాలు ప్రక్షాళన అవుతాయి" అని వీరవ్రతుడు విశ్రుంఖలునికి ప్రాయశ్ఛిత్త కర్మను ఉపదేశిస్తాడు.

తన మిత్రుల పాపాలకు పరిహారాన్ని కోరిన విశ్రుంఖలుడు
వీరవ్రతుడు చెప్పిన ప్రాయశ్చిత్త కర్మకు సంతోషించిన విశ్రుంఖలుడు "మహానుభావా! నా మిత్రులైన కిరాతుడు, కంసాలి, శూద్రుని పాపాలు పోయేందుకు కూడా ప్రాయశ్చిత్త కర్మను బోధించండి" అనగా అందుకు సంతోషించిన వీరవ్రతుడు నేను నీకు చెప్పిన ప్రాయశ్చిత్త కర్మ వారు కూడా ఆచరిస్తే పవిత్రులవుతారు" అని చెబుతాడు.

మిత్రులకు ప్రాయశ్చిత్త కర్మను చెప్పిన విశ్రుంఖలుడు
విశ్రుంఖలుడు వీరవ్రతుని మాటలకు సంతోషించి వేగంగా తన మిత్రుల వద్దకు వెళ్లి జరిగినదంతా వివరంగా చెబుతాడు. వారు కూడా వారు చేసిన పాపాలకు పశ్చాత్తాపం పొంది వీరవ్రతుడు చెప్పినట్లుగా ప్రాయశ్చిత్త కర్మను చేయడానికి సిద్ధమవుతారు.

ప్రాయశ్చిత్త కర్మ వ్రతాన్ని ఆచరించి పవిత్రులైన నలుగురు మిత్రులు
విశ్రుంఖలుడు, కిరాతుడు, కంసాలి, శూద్రుడు వేరువేరుగా తీర్థయాత్రలకు పోయి సర్వ తీర్ధములను సేవిస్తూ, శ్రీహరిని పూజిస్తూ, భిక్షాటన చేస్తూ 12 సంవత్సరాల పాటు ప్రతి మాఘమాసంలో ప్రయాగలో స్నానం చేసి రమామాధవుని సేవిస్తూ ప్రాయశ్చిత్త వ్రతమును పూర్తి చేసి పవిత్రులవుతారు.

నైమిశారణ్యానికి చేరుకున్న విశ్రుంఖలుడు
విశ్రుంఖలుడు 12 సంవత్సరాల ప్రాయశ్చిత్త వ్రతమును పూర్తిచేసి త్రిలోక పావని అయిన కాశీపురానికి చేరుకొని అచ్చట కొంతకాలం నివసించి అనంతరం వీరవ్రతుడు ఉండే నైమిశారణ్యానికి చేరుకుంటాడు. నైమిశారణ్యంలో విశ్రుంఖలుడు వీరవ్రతునికి ప్రదక్షిణాలు చేసి సాష్టాంగ నమస్కారం చేసి ప్రాయశ్చిత్త వ్రతమును పూర్తి చేసిన వైనాన్ని వివరిస్తాడు. అప్పుడు వీరవ్రతుడు సంతోషంతో విశ్రుంఖలునితో ఈ విధంగా పలికాడు. గృత్స్నమదమహర్షి ఈ కథను ఇక్కడవరకు చెప్పి 25వ అధ్యాయాన్ని ముగించాడు.

ఇతి స్కాందపురాణే! మాఘమాస మహాత్యే! పంచవింశాధ్యాయసమాప్తః - ఓం నమః శివాయ

ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంత వరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ABOUT THE AUTHOR

...view details