Lord Krishna Birth Story: బమ్మెర పోతన రచించిన భాగవతం ప్రకారం కంసుని చెల్లెలు దేవకి. కంసునికి తన చెల్లెలంటే ఎంతో ప్రేమ. దేవకిని వసుదేవునికి ఇచ్చి వివాహం జరిపించి వారిని అత్తవారింటికి సాగనంపే సమయంలో ఆకాశవాణి దేవకీ అష్టమ గర్భంలో పుట్టే సంతానం కారణంగా కంసుడు మరణిస్తాడని చెబుతుంది. దాంతో ఆగ్రహానికి గురైన కంసుడు దేవకీ వసుదేవులను చెరసాలలో బంధిస్తాడు. కేవలం అష్టమ గర్భంలో పుట్టే కుమారుని వల్లనే ప్రమాదమని తెలిసి కూడా దేవకీ వసుదేవులకు పుట్టిన బిడ్డలను పుట్టినట్లు చంపుతూ ఉండేవాడు.
ఎనిమిదో సంతానంగా పరమాత్మ
కంసుని అకృత్యాలకు ఏడు మంది సంతానాన్ని పోగొట్టుకున్న దేవకి మళ్ళీ గర్భం ధరిస్తుంది. ఇది అష్టమ గర్భం అందుకే కంసుడు చెరసాల వద్ద పటిష్టమైన భద్రత ఏర్పాటు చేస్తాడు. నెలలు నిండిన దేవకి శ్రావణ మాసం బహుళ అష్టమి నాడు రోహిణి నక్షత్ర శుభ లగ్నంలో, సరిగ్గా అర్ధరాత్రి సమయంలో శ్రీకృష్ణునికి జన్మనిస్తుంది. ఈ బిడ్డను ఎలాగైనా రక్షించాలనుకుంటారు దేవకీ వసుదేవులు.
శ్రీమన్నారాయణుని ఆదేశాలు
ఆ సమయంలో అర్ధరాత్రి చెరసాలలో జన్మించిన బాలుడు సాక్షాత్తూ ఆ శ్రీమన్నారాయణుడే. ఆయనే తనను ఎలా కాపాడాలన్నది వసుదేవునికి వివరిస్తాడు. విష్ణు మాయతో వసుదేవుని సంకెళ్లు విడిపోతాయి. చెరసాల తలుపులు వాటంతటవే తెరుచుకుంటాయి. సైనికులు స్పృహ తప్పి పడిపోతారు.
రేపల్లెకు పయనమైన వసుదేవుడు
వసుదేవుడు బాల కృష్ణుడిని బుట్టలో పెట్టుకుని రేపల్లెకు బయలుదేరుతాడు. ఆ అర్ధరాత్రి వేళ కుంభవృష్టి కురుస్తుండగా చిన్ని కృష్ణునికి ఆది శేషుడు పడగ విప్పి గొడుగు పడతాడు. అమిత వేగంతో ప్రవహిస్తున్న యమునా నది రెండుగా చీలి వసుదేవునికి మార్గం ఇవ్వగా వసుదేవుడు యమునా నది దాటుకుంటూ వెళ్లి రేపల్లె చేరుకుంటాడు.
యశోద తనయుడిగా చిన్ని కృష్ణుడు
రేపల్లెలో యాదవ రాజైన నందుని భార్య యశోద అదే సమయంలో ఆడ పిల్లకు జన్మనిస్తుంది. అది గమనించిన వసుదేవుడు కన్నయ్యను యశోద పక్కన పడుకోబెట్టి, ఆడపిల్లను తన చేతుల్లోకి తీసుకుని అక్కడి నుంచి తిరిగి కారాగారానికి బయలుదేరి వెళ్తాడు. వసుదేవుడు కారాగారంలోకి రాగానే తిరిగి అతనికి సంకెళ్లు వాటికవే పడతాయి. భటులు మేల్కొంటారు. పసిబిడ్డ ఏడుపులు విని కంసునికి సమాచారం అందిస్తారు.
యోగమాయ చెప్పిన కఠోరసత్యం
భటుల నుంచి సమాచారం అందుకున్న కంసుడు 'ఆకాశవాణి చెప్పిన ప్రకారం మగబిడ్డ వల్లనే కదా నీకు ప్రాణాపాయం. కానీ పుట్టింది ఆడపిల్ల కదా విడిచి పెట్టమని' దేవకి ఎంత ప్రార్ధించినా వినకుండా ఆ పసి బిడ్డను చంపడానికి ప్రయత్నించగా ఆ శిశువు యోగ మాయగా మారి కంసుడికి దొరక్కుండా గాలిలోకి ఎగిరి 'నిన్ను చంపేవాడు ఇప్పటికే పుట్టాడు. రేపల్లెలో పెరుగుతున్నాడు' అని చెప్పి మాయమవుతుంది.