తెలంగాణ

telangana

ETV Bharat / spiritual

కార్తిక మాసంలో ఈ రోజుల్లో ఇలా "ధనదీపం" వెలిగించండి - ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయి ధనవంతులవ్వడం పక్కా! - DHANA DEEPAM IMPORTANCE

హరిహరాదులకు ప్రీతికరమైన కార్తిక మాసంలో ఈ దీపం వెలిగిస్తే - ఆర్థిక ఇబ్బందుల తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయట!

KARTHIKA MASAM 2024
Dhana Deepam Importance (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Nov 4, 2024, 8:17 PM IST

Dhana Deepam Importance in Karthika Masam :శివకేశవులిద్దరికీ పరమ పవిత్రమైన, ప్రీతిపాత్రమైన కార్తిక మాసం ఆధ్యాత్మిక సాధనకు, మోక్షసాధనకు విశిష్టమైనది. హిందూ మత విశ్వాసాల ప్రకారం ఈ మాసంలో స్నానం, దానం, జపం, ఉపవాసం, దీపారాధన, దీప దానం వంటి వాటికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. ఈ క్రమంలోనే అందరూ శివాలయాలు, వైష్ణవాలయాల్లో, ఇంటి గుమ్మం ముందు రకరకాల దీపాలు వెలిగిస్తుంటారు. అలాకాకుండా కార్తిక మాసంలో ధనదీపం పేరుతో ఒక ప్రత్యేకమైన దీపం వెలిగిస్తే లక్ష్మీదేవి అనుగ్రహంతో ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోయి.. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయంటున్నారు ప్రముఖ జ్యోతిష్య నిపుణులు మాచిరాజు కిరణ్ కుమార్. ఇంతకీ, ఈ ధనదీపాన్ని ఎప్పుడు వెలిగించాలి? ఎలా వెలిగించాలి? పూర్తి పూజా విధానమేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

పరమపవిత్రమైన కార్తిక మాసంలో దీపారాధనకు ఎంత ప్రాముఖ్యత ఉంటుందో మనందరికీ తెలిసిన విషయమే. అయితే, అందులో భాగంగా ఈ మాసంలో ఏ రోజు అయినా సరే "ధనదీపం" పేరుతో ఇంట్లో ఒక ప్రత్యేకమైన దీపం వెలిగిస్తే మీ గృహంలో లక్ష్మీదేవి ఆనందతాండవం చేస్తుందంటున్నారు జ్యోతిష్యులు మాచిరాజు కిరణ్ కుమార్. ఈ ధన దీపాన్నే "లక్ష్మీదీపం" అనే పేరుతో కూడా పిలుస్తుంటారని చెబుతున్నారు.

ఈ దీపాన్ని ఎలా వెలిగించాలంటే?

  • ఇందుకోసం ముందుగా పూజాగదిని శుభ్రం చేసుకోవాలి. తర్వాత శ్రీ మహాలక్ష్మీదేవి చిత్రపటాన్ని గంధం, కుంకుమ బొట్లతో అలంకరించుకోవాలి.
  • అనంతరం అమ్మవారి చిత్రపటం ముందు శుభ్రంగా ఉన్న పూజకు సంబంధించి ఒక పీటను ఏర్పాటు చేసుకోవాలి. తర్వాత ఆ పీటకు మూడు చోట్లు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి దాని మీద ఒక రాగి లేదా ఇత్తడి పళ్లెంను ఏర్పాటు చేసుకోవాలి.
  • ఆ పళ్లెంకు ఐదు చోట్ల గంధం, కుంకుమ బొట్లు పెట్టాలి. ఆపై ఆ పళ్లెంలో గుప్పెడు బియ్యం పోసుకోవాలి. అందులో కొద్దిగా పసుపు, కుంకుమ వేయాలి. అలాగే అందులో ఒక గులాబీ పువ్వును ఉంచాలి.
  • ఆ తర్వాత రెండు చిన్న మట్టి ప్రమిదలను తీసుకొని వాటికి పూర్తిగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి సిద్ధం చేసుకోవాలి.
  • ఇప్పుడు రాగి లేదా ఇత్తడి పళ్లెంలో ఉన్న బియ్యంలో ఒక మట్టి ప్రమిదను ఉంచాలి. ఆపై ఆ ప్రమిదలో మూడు చొప్పున యాలకులు, లవంగాలు, కొద్దిగా రాళ్లు ఉప్పు వేసుకోవాలి.
  • ఆ తర్వాత రెండో మట్టి ప్రమిదను తీసుకొని మొదటి ప్రమిద మీద ఉంచాలి. ఆపై ఆ ప్రమిదలో ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె పోసుకోవాలి. అనంతరం అందులో రెండు లేదా మూడు వత్తులను కలిపి ఒక వత్తిగా చేసి వేసుకోవాలి. అనంతరం దాన్ని ఏక హారతి లేదా ఆగరుబత్తితో వెలిగించుకోవాలి. దీన్నే "ధనదీపం లేదా లక్ష్మీదీపం" పేరుతో పిలుస్తారు.
  • ఈ దీపాన్ని కార్తీకమాసంలో ఏ రోజు అయినా వెలిగించుకోవచ్చు. అలాకాకుండా "గురు లేదా శుక్రవారం" వెలిగిస్తే ఇంకా అద్భుతమైన ఫలితాలు సిద్ధిస్తాయంటున్నారు జ్యోతిష్యులు మాచిరాజు కిరణ్ కుమార్.
  • అయితే, రెండో మట్టి ప్రమిదలో దీపాన్ని వెలిగించిన తర్వాత జవ్వాది అనే ఒక సుగంధద్రవ్యం పూజా స్టోర్​లలో దొరుకుతుంది. దాన్ని వెలుగుతున్న దీపంలో కొద్దిగా వేయాలి.
  • ఇక దీపం కొండెక్కిన తర్వాత మొదటి ప్రమిదలో ఉన్నటువంటి యాలకులు, లవంగాలు, రాళ్ల ఉప్పును తీసుకొని ఎవరు తొక్కని చోట చెట్టు మొదట్లో వేయాలి. అలాగే పళ్లెంలో ఉన్నటువంటి గులాబీ పువ్వునూ ఎవరు తొక్కని ప్రదేశంలో వేయాలి.

దీపం వెలిగించడానికి ముందు ఈ పని చేయాలి!

  • దీపం వెలిగించడానికి ముందే మీరు ఒక ప్రత్యేకమైన పనిచేయాలి. అదేంటంటే.. రాగి లేదా ఇత్తడి పళ్లెంలో గుప్పెడు బియ్యం పోసి పసుపు, కుంకుమ వేసి గులాబీ పువ్వును ఉంచాక.. అదే బియ్యంలో దీపం దగ్గర ఒక రూపాయి కాయిన్ కూడా ఉంచాలి. ఆ తర్వాత రెండు చిన్న మట్టిప్రమిదలతో ధనదీపాన్ని వెలిగించాలి.
  • అలాగే, ధనదీపం కొండెక్కాక మొదటి ప్రమిదలో ఉన్న రాళ్లఉప్పు, యాలకులు, లవంగాలతోపాటు గులాబీ పువ్వును ఎవరూ తొక్కని ప్రదేశంలో చెట్టు మొదట్లో వేశాక.. ఆ బియ్యంలో ఉన్న రూపాయి కాయిన్ తీసుకొని దాన్ని ఒక పసుపు లేదా ఎరుపు వస్త్రంలో మూటకట్టి మీరు ధనం దాచుకునే బీరువాలో దాచుకోవాలి. అనంతరం ఆ పళ్లెంలో ఉన్న బియ్యంతో పొంగలి తయారు చేసి.. లక్ష్మీదేవికి నైవేద్యంగా సమర్పించి మీరు ప్రసాదంగా స్వీకరించాలి.
  • ఇలా ఎవరైతే కార్తికమాసంలో ఏ రోజు అయినా, మరీ ముఖ్యంగా గురు లేదా శుక్రవారం నాడు ఈ శక్తివంతమైన ధనదీపాన్ని వెలిగిస్తారో వారి ఇంట శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహంతో ఆర్థిక సమస్యలు తీరిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయంటున్నారు జ్యోతిష్య నిపుణులు మాచిరాజు కిరణ్ కుమార్.

NOTE:పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ఇవీ చదవండి :

కార్తికంలో "దీపదానం" చేస్తున్నారా? - ఈరోజున దానం చేస్తే ప్రభుత్వ ఉద్యోగమట!

కార్తిక మాసంలో బిల్వ పత్రాలతో శివపూజ - అనంత కోటి పుణ్యఫలాలు, అష్టైశ్వర్యాలు మీ సొంతం!

ABOUT THE AUTHOR

...view details