తెలంగాణ

telangana

ETV Bharat / spiritual

ధనత్రయోదశి రోజు తప్పకు తెలుసుకోవాల్సిన కుబేర వృత్తాంతం - విన్నా, చదివినా ఐశ్వర్య ప్రాప్తి! - DHANTERAS 2024

కుబేరుడి గత జన్మ వృత్తాంతం ఏమిటి? దొంగ నుంచి సంపదలకు అధిదేవత ఎలా అయ్యాడు?

Kubera Story in Telugu
Kubera Story in Telugu (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Oct 29, 2024, 7:33 AM IST

Kubera Story in Telugu : దీపావళి అమావాస్యకు ముందు వచ్చే త్రయోదశి రోజు కుబేరుని కూడా పూజించడం ఆనవాయితీ. కుబేరుని పూజించకుండా చేసే ధన్‌తేరస్ పూజ అసంపూర్ణం అని శాస్త్రవచనం. హిందూ సంప్రదాయంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కుబేరుడికి భక్తులు ఉన్నారు. వివిధ దేశాల్లో వివిధ రూపాల్లో కుబేరుడిని పూజిస్తారు. ఈ సందర్భంగా సంపదలకు అధిదేవత అయిన కుబేరుని గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.

ఎవరీ కుబేరుడు?
శ్రీ శివ, మత్స్య, స్కాంద పురాణాల ప్రకారం, కుబేరుని శరీరం వినాయకుని పోలి ఉంటుందని తెలుస్తోంది. కుబేరుడు రావణుడి సోదరుడు. కుబేరుని యక్ష రాజుగా, సంపదలకు అధి దేవతగా భావిస్తారు. తిరుమల వెంకటేశ్వర స్వామి పద్మావతి దేవిని వివాహం చేసుకోవడానికి కుబేరుడి దగ్గర అప్పు తీసుకున్నాడని, దానికి సంబంధించిన సాక్ష్యాలు ఇప్పటికీ రాగి రేకుల మీద లిఖిత రూపంలో ఉన్నాయని చెబుతారు. అయితే కుబేరుడు ధనానికి, సంపదలకు అధి దేవత ఎలా అయ్యాడు? కుబేరుడి గత జన్మ ఏమిటి? ఈ విషయాలను విపులంగా తెలుసుకుందాం.

దొంగ సంపదలకు అధిదేవతగా
సంపదలకు అధిదేవత అయిన కుబేరుడు గత జన్మలో ఎంతో గొప్ప పుణ్యం చేసుకుని ఉంటాడని ప్రతి ఒక్కరికీ అనిపిస్తుంది. కానీ గత జన్మలో కుబేరుడు దొంగతనానికి ప్రయత్నించి మరణించిన వ్యక్తి. ఇలాంటి వ్యక్తి సంపదలకు అధిదేవత ఎలా అయ్యాడో చూద్దాం.

కుబేరుని పూర్వజన్మ వృత్తాంతం
వ్యాస మహర్షి రచించిన శివమహాపురాణం ప్రకారం కుబేరుడు గత జన్మలో గుణనిధి పేరుతో ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన వ్యక్తి. పుట్టడం బ్రాహ్మణ కుటుంబంలో అయినా చెడు సావాసాల కారణంగా జూదం ఆడేవాడు. జూదం ఆడటంలో భాగంగా తమ తల్లిదండ్రులు, తమ తాతలు సంపాదించిన ధనాన్ని మొత్తం జూదంలో పోగొట్టాడు.

గుణనిధి చర్యలు దాచిపెట్టిన తల్లి
గుణనిధి ఇంత చేస్తున్నా సరే అతని తల్లి మాత్రం కొడుకు చేస్తున్న పనులను సమర్థిస్తూ, కప్పి పుచ్చుకుంటూ ఉండేది. గుణనిధి చేసే పనులు ఆయన తండ్రికి తెలియనివ్వకుండా ఆమె జాగ్రత్త పడింది. కానీ ఒకరోజు గుణనిధి తండ్రికి నిజం తెలిసింది. తండ్రికి నిజం తెలియడంతో గుణనిధి భయపడ్డాడు. ఇంటి నుంచి పారిపోయి ఒక శివాలయంలో దాక్కున్నాడు.

తెలిసో తెలియకో శివరాత్రి నియమాలు పాటించిన గుణనిధి
ఆ రోజు మహాశివరాత్రి కావడం వల్ల శివాలయంకు వచ్చిన భక్తులు ఆలయంలో పూజలు జరిపి ప్రసాదం అందిరికీ పంచి పెట్టి, తమ శక్తి కొలదీ జాగారాలు చేసి, మెల్లిగా నిద్రలోకి జారుకున్నారు. బాగా చీకటి పడ్డాక గుడిలో ఉన్న గుణనిధికి ఆకలి, దాహం ఎక్కువ అయ్యాయి. జనాలంతా పడుకున్నారని నిర్ధారించుకున్నాక, ఆకలితో ఉన్న గుణనిధి శివునికి అర్పించిన ప్రసాదాలను తిందామని గర్భ గుడిలోకి వెళ్లాడు. చీకటిలో ఏమీ కనిపించక, తన పై వస్త్రాన్ని చించి వత్తిగా చేసి అక్కడ ఉన్న నూనెతో దీపాన్ని వెలిగించాడు. ఆ వెలుతురులో ప్రసాద పాత్రలు కనిపించేసరికి ఆనందంతో వాటిని తీసుకుని బయటకి నడుస్తుండగా గుడిలో నిద్రిస్తున్న ఒక భక్తుని కాలు తగిలి, ఆ ప్రయత్నంలో జరిగిన తొక్కిసలాటలో గుణనిధి ప్రాణాలు కోల్పోతాడు.

గుణనిధి కోసం వచ్చిన యమదూతలు
మరణించిన గుణనిధి ఆత్మను తీసుకెళ్లడానికి యమదూతలు వస్తారు. అప్పుడు పరమేశ్వరుడు ప్రత్యక్షమై గుణనిధితో నువ్వు ఎన్నో పాపాలు చేసినా మహాశివరాత్రి పర్వదినం రోజున నా ఆలయంలోని దీపం ఆరిపోకుండా కాపాడావు. అందుకే వచ్చే జన్మలో నువ్వు సంపదలకు అధిదేవతగా ఉంటావని వరం ఇచ్చాడట. ఊరి నుంచి పారిపోతూ పవిత్రమైన గౌతమీ స్నానం, తిండి దొరకనందున ఉపవాసం, వెలుతురు కోసం శివాలయంలో వెలిగించిన దీపం, ప్రసాదాల కోసం చేసిన సగం జాగారం, ఇవన్నీ అనుకోకుండా చేసినా శివరాత్రి పర్వదినం నాడు చేసి మరణించడం వలన గుణనిధికి కైలాస ప్రాప్తి లభించింది. మరుజన్మలో కుబేరుడిగా జన్మించాడు.

కుబేర జననం
ఆ బ్రాహ్మణ జన్మ తరువాత కుబేరుడు తదుపరి జన్మలో విశ్రవసుడు, దేవవర్ణినిలకు కుమారుడిగా జన్మించాడు. వారు తమ పుత్రుడికి వైశ్రవణగా నామకరణం చేశారు. వైశ్రవణుడు వెయ్యి సంవత్సరాలు తపస్సు చేసి బ్రహ్మను సంతోషపెట్టాడు. ఆ తరువాత అతను యక్షులకు రాజుగా, దిక్కులకు రక్షకుడిగా, సంపదలకు అధిదేవతగా పేరు పొందాడు. ఇదీ కుబేరుడి కథ.

ధన్‌తేరస్ రోజు కుబేరుని పూజించినా, ఆయన జన్మ వృత్తాంతాన్ని విన్నా చదివినా ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుందని విశ్వాసం. శ్రీరస్తు! శుభమస్తు!

ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ABOUT THE AUTHOR

...view details