Krishna Janmashtami 2024:పండగల సమయంలో దేవుడి విగ్రహాలు, చిత్రపటాల ముందు వివిధ రకాల నూనెలతో దీపారాధన చేస్తుంటారు. అందులో నువ్వుల నూనె, ఆవు నెయ్యి, కొబ్బరినూనె వంటివి ఉంటాయి. అయితే కేవలం ఇవి మాత్రమే కాకుండా ఇతర నూనెలతో దీపారాధన చేసిన మంచి జరుగుతుందని అంటున్నారు. ముఖ్యంగా ఈ కృష్ణాష్టమి రోజున ఒక్కోరకమైనటువంటి నూనెతో దీపం వెలిగించడం వల్ల ఒక్కో ఫలితం పొందవచ్చని ప్రముఖ జ్యోతిష్య నిపుణులు మాచిరాజు కిరణ్ కుమార్ చెబుతున్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.
ఆవు నెయ్యి:శ్రీకృష్ణుడికి అన్నింటికంటే ఆవు నెయ్యితో చేసే దీపారాధన విశేషమైన శుభ ఫలితాలను కలిగుతాయని అంటున్నారు. గోకులాష్టమి రోజున శ్రీకృష్ణుడి దగ్గర ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే మనం చేసే ప్రతి పనిలోనూ విజయం కలుగుతుందని.. ఇంట్లో సంతోషాలు నెలకొంటాయని అంటున్నారు.
నువ్వుల నూనె:శ్రీకృష్ణుడి దగ్గర నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే.. మనకున్నటువంటి కష్టాలు, బాధలన్నీ తొలగిపోతాయని చెబుతున్నారు. ఉదర సంబంధమైనటువంటి వ్యాధుల నుంచి ఉపశమనం కలుగుతుందని.. గ్యాస్, అల్సర్ సమస్యలతో బాధపడేవారు నువ్వుల నూనెతో దీపారాధాన చేస్తే మంచి జరుగుతుందని మాచిరాజు కిరణ్ కుమార్ సూచిస్తున్నారు.
ముత్యాల నూనె :కృష్ణాష్టమి రోజున కృష్ణుడి దగ్గర ముత్యాల నూనెతో దీపం పెడితే అనారోగ్య సమస్యలు తొలగిపోయి దీర్ఘాయుష్షు కలుగుతుందని అంటున్నారు.
గంధం నూనె :గంధం నూనెతో కృష్ణాష్టమి రోజున దీపారాధన చేస్తే మనకున్న రుణ బాధలు తొలగిపోతాయి. భరించలేని అప్పులు ఉన్న వారు కృష్ణుడి దగ్గర గంధం నూనెతో దీపం వెలిగిస్తే ఆ బాధల నుంచి ఉపశమనం కలుగుతుందని మాచిరాజు కిరణ్ కుమార్ పేర్కొన్నారు.
పిప్పళ్ల నూనె (పిప్పిలి నూనె):దీర్ఖకాలికంగా అనారోగ్య సమస్యలతో బాధపడేవారు జన్మాష్టమి రోజున పిప్పళ్ల నూనెతో దీపం వెలిగిస్తే మంచి జరుగుతుందని అంటున్నారు.
తెన్న చెట్టు నూనె :ఈ నూనెతో దీపారాధాన చేయడం వల్ల కను దిష్టి, నర దిష్టి తొలగిపోతుందని వివరిస్తున్నారు. తెన్నచెట్టు నూనెతో కృష్ణుడి దగ్గర దీపం వెలిగించడం వల్ల శత్రు బాధల నుంచి బయటపడవచ్చని సూచిస్తున్నారు.