New Ration Cards Distribution in Telangana : ఇటీవలె ప్రకటించిన ప్రభుత్వ సంక్షేమ పథకాల జాబితాలో పేర్లు లేని వారికి మళ్లీ దరఖాస్తులు చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం కల్పించింది. రైతు భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల పథకాల కోసం జిల్లాలోని 255 పంచాయతీలు, 4 పురపాలక సంఘాల్లో 332 సభలు నిర్వహించారు. దీంట్లో 60,349 దరఖాస్తులు స్వీకరించారు. గ్రామసభలు ముగిసి వారం రోజుల దాటినా అర్జీలను ఆన్‌లైన్‌లో నమోదు చేయడానికి ఉన్నత స్థాయి నుంచి ఆదేశాలు రాకపోవడంతో అవి కాస్త మండల కార్యాలయాలకే పరిమితమయ్యాయి.
మార్గదర్శకాలు లేవంటూ : వచ్చిన దరఖాస్తులను ఆన్‌లైన్ చేసి అర్హులను సంక్షేమ పథకాలకు ఎంపిక చేస్తామని అధికారులు స్పష్టం చేశారు. కానీ ఇంత వరకు ఆన్‌లైన్ చేసేందుకు మార్గదర్శకాలు వెలువడలేదు. ఆన్‌లైన్ చేసి మరో మారు దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలన చేస్తారా? లేదా అనే దానిపై అధికారుల వద్ద స్పష్టమైన సమాధానం లేదు. ఈ నేపథ్యంలో సంక్షేమ పథకాలు తమకు అందవేమోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
పునఃపరిశీలన : గ్రామసభల్లో అర్హులైన వారి నుంచి కొత్తగా మరోసారి వినతులు స్వీకరించారు. ఇందులో ఇందిరమ్మ ఇళ్ల కోసం వచ్చినవి మాత్రం ప్రభుత్వం పంచాయతీ కార్యదర్శులతో పునఃపరిశీలన చేయించాలని మౌఖికంగా ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. వచ్చిన వాటిని (ఎల్ -1, ఎల్ - 2, ఎల్ -3, ఎల్ - 4) నాలుగు కేటగిరీలుగా విభజించి విచారణ చేసేందుకు కార్యాచరణను ప్రారంభించడానికి కసరత్తు చేస్తున్నారు.
ఇళ్లు లేని వారికి దరఖాస్తులు : ఎల్ 1 కేటగిరీలో సొంత స్థలం ఉండి ఇళ్లు లేని వారి దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలన చేయడానికి సిద్ధం చేసుకున్నారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కోసం దరఖాస్తు చేసుకున్న వారి వివరాలను సేకరించడానికి 2023-24 పని దినాలను పరిగణలోకి తీసుకుని లబ్ధిదారులుగా గుర్తించడానికి ఉపాధి రికార్డులు పరిశీలించాలని నిర్ణయించారు. కొత్త రేషన్ కార్డుల జారీపై ఇంత వరకు ఎలాంటి ఆదేశాలు లేవు. రైతు భరోసాపై వ్యవసాయ శాఖ క్షేత్రస్థాయిలో విచారించడానికి సిద్ధంగా ఉన్నా వారికి దరఖాస్తులు అందలేదని తెలిసింది.
తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల జారీలో కొర్రీలు! - మీకు ఇవి ఉంటే దరఖాస్తు తిరస్కరణ!
కొత్త రేషన్ కార్డు కావాలంటే ఆ పత్రాలు కచ్చితంగా ఉండాల్సిందే - అయోమయంలో అర్జీదారులు