Kitchen Vastu Tips :వాస్తు శాస్త్రంలో వంటగదికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. వంట గదిని ఎంత చక్కగా సర్దుకుంటే ఆ ఇంట్లోని వారు అంత అభ్యున్నతిలోకి వస్తారు! వంటగది నిర్మాణం, వస్తువుల అమరిక విషయంలో వాస్తు పాటించడం కుటుంబ సభ్యుల ఆరోగ్యానికి మంచిదని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ఇప్పుడు వంట ఇంట్లోని సామాన్లు ఏవి ఎక్కడ సర్డుకోవాలో చూద్దాం.
వంటింట్లో కిటికీలు ఇలా ఉంటే శుభం!
వంటింట్లో కిటికీలు తూర్పు కానీ దక్షిణ దిశలో కానీ అమర్చుకుంటే మేలు. అలా అయితేనే వంటింట్లోకి చక్కగా గాలి వెలుతురూ ప్రసరిస్తుంది. గాలి వెలుతురు ధారాళంగా వంటింట్లోకి వస్తే వంటింట్లో బొద్దింకలు, చెద పురుగులు, క్రిములు, చీమలు వంటివి చేరవు.
ఏ రంగులు వేయాలి
వంటింటి గోడలకు పసుపు, నారింజ, గులాబీ, చాకోలెట్, ఎరుపు రంగులు వేస్తే శుభకరం.
వంటింటి సమీపంలో టాయిలెట్లు ఉండొచ్చా?
వాస్తు ప్రకారం వంటింటి సమీపంలో టాయిలెట్లు అసలు ఉండకూడదు. కనీసం వంటగది గోడకు ఆనుకొని కూడా టాయిలెట్ల నిర్మాణం చేయకూడదు. అలా చేస్తే ఇంట్లో వారికి ప్రతికూల ఫలితాలు కలుగుతాయి.
వంటగది గుమ్మం ఎలా ఉంటే మంచిది?
వంటగది గుమ్మం విషయంలో వాస్తు ఏమి చెబుతోంది అంటే, ఎట్టి పరిస్థితుల్లో కూడా వంటగది గుమ్మం ఇంటి ముఖద్వారానికి ఎదురుగా ఉండ రాదు. వాస్తు శాస్త్రంలో ఇది చాలా ముఖ్యమైన విషయం. వీధి గుమ్మంలో నుంచి వంటగది అసలు కనిపించకూడదు. పొరపాటున ఇలా చేస్తే ఆ ఇంట్లోని వారికి జీర్ణసంబంధ వ్యాధులు వస్తాయి.