Karthika Puranam Chapter 20 :పరమ పవిత్రమైన కార్తిక మాసంలో నిరాటంకంగా సాగుతున్న కార్తిక పురాణంలో భాగంగా ఈ కథనంలో కార్తిక వ్రత మహాత్యమును గురించి వశిష్ఠుడు జనకునితో వివరించిన విధానాన్ని తెలుసుకుందాం.
వశిష్ట జనకుల సంవాదం
చాతుర్మాస వ్రత ప్రభావమును విన్న జనక మహారాజు వశిష్టునితో "ఓ మునివర్యా! కార్తిక మాస మహాత్యమును ఇంకను వినవలెనన్న కోరిక కలుగుతోంది. ఈ వ్రత మహాత్యమునకు చెందిన ఇంకా ఏమైనా విశేషములు ఉంటే దయచేసి నాకు ఉదాహారణలతో తెలియచేయండి." అని చెప్పగా వశిష్టుల వారు చిరునవ్వు నవ్వి "ఓ రాజా! కార్తిక మాస మహాత్యమును గురించి అగస్త్య మహామునికి, అత్రి మహామునికి జరిగిన సంవాదం ఒకటి ఉంది. చెబుతాను. శ్రద్దగా వినుము" అని అంటూ ఇరవయ్యో రోజు కథను ప్రారంభించాడు.
అగస్త్య అత్రి మునుల సంవాదం
పూర్వము ఒకప్పుడు అగస్త్య మహర్షి అత్రి మహామునిని చూసి "ఓ అత్రిమునీ! నీవు విష్ణువు అంశతో పుట్టినావు. కావున నీకు కార్తిక మాస మహాత్యమును గురించి పూర్తిగా తెలిసియుండును. కావున నాకు దాని గురించి తెలియచేయుము." అని కోరెను. అప్పుడు అత్రిమహాముని "ఓ అగస్త్యమునీ! నీవు అడిగిన ఈ ప్రశ్న ఎంతో ఉత్తమమైనది. కార్తిక మాసంతో సమానమైన మాసము, వేదములతో సమానమగు శాస్త్రములు, ఆరోగ్యసంపదకు మించిన సంపద ఈ భూలోకంలో మరొకటి లేదు. అలాగే శ్రీమన్నారాయణుని కంటే గొప్ప దైవం లేదు. ఏ మానవుడైనను కార్తిక మాసమునందు నదీ స్నానం చేసినను, శివకేశవుల ఆలయంలో దీపారాధన చేసినను, లేక దీపదానము చేసినను కలుగు ఫలితం అపారము. ఇందుకోక ఇతిహాసము కలదు. శ్రద్దగా వినుము. అని చెప్పసాగెను.
పురంజయుని కథ
త్రేతాయుగమున పురంజయుడను సూర్యవంశపు రాజు అయోధ్యా నగరమును రాజధానిగా చేసుకొని రాజ్యమేలుచుండేవాడు. అతడు సమస్త శాస్త్రములు చదివి, సమర్థుడై, న్యాయముగా తన ప్రజలను కన్నబిడ్డల వలె కాపాడుతూ రాజ్యపాలన చేస్తూ ఉండేవాడు. కాలక్రమేణా పురంజయుడిలోని మంచి లక్షణాలు మాయమయ్యాయి. అతడు అమిత ధనాశ చేత, రాజ్యాధికారినన్న గర్వము చేతను, బుద్ధిహీనుడై, దయాదాక్షిణ్యములు లేక ప్రవర్తించసాగెను. దేవుని మరియు బ్రాహ్మణుల మాన్యములు లాగుకొని, పరమ లోభియై, దొంగలను చేరదీసి, వారిచే దొంగతనములు చేయించి అందులో కొంత వాటాను తీసుకొంటూ, ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తూ ఉండేవాడు. ఇలా కొంత కాలము జరగగా అతని దుర్మార్గములు నలుదిక్కుల వ్యాపించెను. ఈ వార్త కాంభోజ, కొంకణ, కళింగాది రాజుల చెవినబడింది. వారంతా తమలో తాము ఆలోచించుకొని కాంభోజ రాజు ను నాయకునిగా చేసుకొని రథ, గజ, తురగ, పదాది సైన్యములతో అయోధ్యా నగరముపైకి దండయాత్రకు వచ్చారు. నగరమునకు నలువైపులా శిబిరములు నిర్మించి, నగరాన్ని ముట్టడించి యుద్ధానికి సిద్ధపడ్డారు.