తెలంగాణ

telangana

ETV Bharat / spiritual

ప్రమోషన్ కోసం అలా, వివాహం కోసం ఇలా! కార్తీక మాసంలో ఎవరేం చేయాలంటే?

కార్తీక మాసంలో పాటించాల్సిన నియమాలు, పఠించాల్సిన శ్లోకాలు ఇవే!

Karthika Masam 2024
Karthika Masam 2024 (Getty Images)

By ETV Bharat Telugu Team

Published : 4 hours ago

Karthika Masam Rules And Slokas In Telugu : పరమ పవిత్రమైన కార్తీక మాసం ఆధ్యాత్మిక సాధకులకు ఎంతో విశిష్టమైనది. ఈ మాసంలో చేసే స్నానదాన జపాలకు విశేషమైన ఫలితం లభిస్తుందని శాస్త్ర వచనం. మరో రెండు రోజుల్లో కార్తీక మాసం ప్రారంభం కానున్న సందర్భంగా శివకేశవులకు ప్రీతిపాత్రమైన కార్తీక మాసంలో ఎలాంటి నియమాలు పాటించాలి, ఏ శ్లోకాలు పఠించాలి అనే విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

శివకేశవులకు ప్రీతికరం కార్తీకమాసం
వ్యాస మహర్షి రచించిన స్కాంద పురాణం ప్రకారం కార్తీకమాసానికి సమానమైన మాసం, శ్రీమహావిష్ణువుకు సమానమైన దేవుడు, వేదముతో సమానమైన శాస్త్రము, గంగతో సమానమైన తీర్థం లేదని అంటారు. పురాణ కాలంనుంచీ ఈ మాసం ఓ ప్రత్యేకతను సంతరించుకుంది. హరిహరాదులకు ప్రీతిపాత్రమైన ఈ మాసంలో భక్తకోటి యావత్తూ కఠిన నిష్ఠతో చేపట్టే నోములకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ఈ సందర్భంగా కార్తీక మాసంలో పాటించవలసిన నియమాలు గురించి తెలుసుకుందాం.

పరమ పవిత్రం కార్తీకం
కార్తీక మాసంలో కార్తీక స్నానాలు, దీపాలు, క్షేత్ర దర్శనం, ఆహార నియమం, దానాలు, దీప దానం, నిత్య దైవ నామ స్మరణ విశేష ఫలితం ఇస్తుంది. కార్తీక మాసం శివ కేశవులకు ఇరువురికి విశేషం. కార్తీక మాసంలో సోమవారాలు శివారాధన, శనివారం విష్ణు ఆరాధన, నాగులు చవితి , కార్తీక పౌర్ణమి, ముఖ్యంగా కార్తీక మాసంలో ఆదివారం చేసే పూజలకు విశేషమైన ఫలితాలు ఉంటాయని శాస్త్రవచనం.

కార్తీక ఆదివారం ఈ నియమాలు తప్పనిసరి
కార్తీక మాసమంతా ఆదివారం రోజు మాంసం తినకుండా కులదేవతను పూజించాలి. ఈ రోజు సూర్య నమస్కారాలు చేస్తూ, ఆదిత్య హృదయం పారాయణ చేసుకోవాలి. ఒంటిపూట భోజనం చేయాలి.

దోషాలు - పరిహారాలు
కార్తీక మాసంలో జాతకంలో ఎవరికి ఏ దోషం ఉంటే వాళ్ళు ఈ మాసం అంతా దానికి సంబంధించిన స్త్రోత్రాన్ని ఆ దేవతను ఆరాధించడం వల్ల విశేష మైన ఫలితం ఉంటుంది.

  • కుజ దోషం ఉన్న వాళ్లు , వివాహం ఆలస్యం అవుతున్న వాళ్ళు ఈ మాసమంతా సుబ్రహ్మణ్య స్త్రోత్రం చదవాలి.
  • ఎప్పుడూ ఏదో ఒక అనారోగ్యంతో బాధపడే వాళ్లు, బైద్యనాద్ స్త్రోత్రం,ఆదిత్య హృదయం పఠించాలి.
  • వ్యాపారంలో నష్టాలు, కుటుంబ కలహాలు, అప్పులు, కోర్టు కేసులు, అపనిందలు,రాహు గ్రహ దోషాలు ఉన్నవారు మంగళ చండికా స్తోత్రం చదవాలి.
  • మంత్ర సాధన చేస్తున్న వాళ్లు, కొత్తగా దీక్ష తీసుకుని ఉపాసన చేస్తున్న వాళ్ళు చర్మ వ్యాధులు, అధిక రక్తపోటు, మధుమేహ వ్యాధి ఉన్నవారు ఈ మాసం మొత్తం మానసా దేవి స్తోత్రం చదవాలి.
  • నేత్ర వ్యాధులు, ఎంత కష్టపడ్డా ఎదుగుదల గుర్తింపు లేని వారు గరుడ ప్రయోగ మంత్రం చదవాలి.
  • శత్రు బాధలు ఉన్నవారు, జయం కోరుకునేవారు దుర్గా స్త్రోత్రం పఠించాలి.
  • ఇంట్లో వివాహాది శుభకార్యాలు జరగాలని కోరుకునే వారు లలితా సహస్రనామ స్తోత్రం నిత్యం చదువుకోవాలి.
  • నూతన గృహం కొనాలనుకునే వారు మణిద్వీప వర్ణన పారాయణ చేయాలి.
  • భూమి అమ్మాలనుకునే వాళ్ళు గణేశ ప్రార్థన, భూమి కొనాలనుకునే వాళ్లు లక్ష్మీ వరాహ స్వామి ప్రార్థన శ్లోకాలు నిత్య పారాయణం చేయాలి.
  • ఉద్యోగం కోరుకునే నిరుద్యోగులు, ఉద్యోగంలో ప్రమోషన్ కోరుకునే వాళ్లు కనకధార స్తోత్రం పారాయణ చేయాలి.
  • రాజకీయ నాయకులు, పోలీసు శాఖ వాళ్ళు, క్రీడా రంగం వాళ్లు, వారాహి కవచం పాటించడమే మంచిది.
  • నాటక రంగంలో ఉన్నవాళ్లు వైద్య వృత్తిలో వారు ప్రత్యంగిరి, నరసింహ స్తోత్రాలు నియమానుసారం ఈ మాసం మొత్తం పారాయణ చేయాలి.
  • విద్యార్థులు చదువులో విజయం సాధించడం కోసం సరస్వతి, హాయగ్రీవ, వినాయక స్తోత్రాలు చదవాలి.
  • అపజయాల భయాలను తగ్గించి కార్యసిద్ధి చేకూరడానికి హనుమాన్ చాలీసా పారాయణ చేయాలి.
  • ఇక నిష్కామంగా ఆధ్యాత్మిక జ్ఞానం, దైవానుగ్రహం కోసం ఈ మాసం మొత్తం దామోదర అష్టకం ప్రతి రోజూ చదువుకుంటే ఆధ్యాత్మిక జ్ఞానం వృద్ధి చెందుతుంది.

దీపారాధన ప్రాశస్త్యం
ఇక కార్తీకమాసమంతా గడపలో దీపాలు పెట్టాలి. తులసి కోట ముందు దీపం పెట్టాలి, ఈ మాసంలో సూర్యోదయానికి ముందు పెట్టే దీపాలు విష్ణుమూర్తికి చెందుతాయి. సంధ్యాకాలంలో పెట్టే దీపాలు శివయ్యకు చెందుతాయి. రానున్న కార్తీక మాసంలో శాస్త్రం సూచించిన నియమాలను పాటిస్తూ, శ్లోకాలను పఠిస్తూ దైవానుగ్రహాన్ని పొందుదాం. ఓం నమః శివాయ! ఓం శ్రీ కార్తీక దామోదరాయ నమః

ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ABOUT THE AUTHOR

...view details