Karna Death Story :కుంతీ పుత్రుడని పేరొందిన కర్ణుని కుంతీదేవి గర్భవాసం చేసి కనలేదు. కర్ణుడు కుంతీ దేవికి సూర్యుడు ప్రసాదించిన పుత్రుడు. దుర్వాస మహర్షి కుంతీదేవికి ఇచ్చిన సంతాన సాఫల్య మంత్రం ప్రకారం కుంతీదేవి ఏ దేవుణ్ణి ప్రార్ధిస్తే ఆ దేవుడు వచ్చి సంతానాన్ని మాత్రమే ఇచ్చి వెళ్లిపోతారు. అంతేకాని ఇక్కడ మానవులకు వలే పరస్పర సంబంధముతో బిడ్డలు పుట్టినట్టు కాదు. ఆ దేవుని అంశతో ఒక బిడ్డను సృష్టించి ఇచ్చి వెళ్లడం తప్ప మరే వరాలు అనుగ్రహించరు. ఆ మంత్ర ప్రభావం అలాంటిది. కర్ణుని జన్మ రహస్యంలో ఇది తప్పకుండా గుర్తుంచుకోవాల్సిన విషయం.
కర్ణుడి జన్మ వెనుక ఉన్న పురాణ గాథ
పూర్వం ఓ రాక్షసుడు బ్రహ్మదేవుని గురించి ఘోరమైన తపస్సు చేసి అభేద్యమైన వెయ్యి కవచాలు వరంగా పొందాడు. ఆనాటి నుంచి ఆ రాక్షసుడికి సహస్రకవచుడని పేరు వచ్చింది. బ్రహ్మ ఇచ్చిన వర గర్వంతో ఆ రాక్షసుడు సర్వలోకాలను, సకల ప్రాణికోటిని నానా హింసలకు గురిచేసి ఆనందిస్తూండేవాడు.
శ్రీ మహావిష్ణువు అభయం
దేవతలతో సహా సకల ప్రాణకోటికి ఆ రాక్షసుని ఆగడాలు భరించలేక శ్రీ మహావిష్ణువును ఆశ్రయిస్తారు. అప్పుడు శ్రీమన్నారాయణుడు తాను బదరికావనంలో నరనారాయణులు రూపంలో తపస్సు చేస్తున్నానని ఆ రాక్షసుడికి ఆయువు మూడినప్పుడు వాడే తన దగ్గరకు వస్తాడని, అప్పుడు తానే వాడిని సంహరిస్తానని వారికి అభయమిస్తాడు.
ఎవరీ నరనారాయణులు?ఠ
హిరణ్యకశ్యపుని సంహారం తర్వాత నరసింహ స్వామి రెండు రూపాలుగా విడిపోయి వారిరువురు నర రూపం నరునిగానూ, సింహ రూపం నారాయణునిగా మారి ధర్ముని కుమారులుగా జన్మించినట్లుగా బ్రహ్మాండ పురాణంలో వివరించడం జరిగింది. వారే నరనారాయణులు. నరనారాయణులు పుట్టుకతోనే పరాక్రమవంతులు, అలాగే విరాగులు కూడా! అందుకే వారు ఆయుధాలు ధరించి బదరికావనంలో ఏకాగ్రచిత్తులై తపోదీక్షలో మునిగి ఉంటారు.
ప్రహ్లాదునితో యుద్ధం
ఒకసారి ప్రహ్లాదుడు బదరికా వనంను దర్శించి తిరిగి వెళ్తూ ఆయుధాలు ధరించి తపో దీక్షలో ఉన్న నరనారాయణులు చూసి తపస్సు చేసుకునే వారి వద్ద ఆయుధాలు ఉన్నాయంటే వీరు కపట తపసులై ఉంటారని తలంచి వారి తపస్సు భగ్నం చేసి యుద్ధానికి కవ్విస్తాడు. నర నారాయణులకు, ప్రహ్లాదునికి మధ్య జరిగిన భీకర యుద్ధంలో ప్రహ్లాదుడు అలిసిపోయి శ్రీహరిని ప్రార్ధిస్తే శ్రీహరి నరనారాయణులు తన అంశతో జన్మించిన వారేనని, వారిని గెలవలేవని చెప్పగా ప్రహ్లాదుడు నరనారాయణులకు నమస్కరించి వెళ్లిపోతాడు.
బదరికా వనం చేరిన సహస్రకవచుడు
నరనారాయణుల తపస్సు అకుంఠిత దీక్షతో కొనసాగుతుంది. ఇంద్రుడు ఆ తపస్సును భగ్నం చేయడానికి ప్రయత్నించి విఫలమవుతాడు. ఇంతలో సహస్ర కవచుని ఆయువు మూడి నర నారాయణులతో యుద్ధానికి బదరీ వనం చేరుకుంటాడు. అప్పుడు నారాయణుడు అతడితో "రాక్షసేశ్వరా! మేమిద్దరం కలిసి నీ ఒక్కడితో యుద్ధం చేయడం ధర్మం కాదు. కాబట్టి మాలో ఒకడు నీతో యుద్ధం చేస్తుంటే మరొకడు తపస్సు చేసుకుంటాడు. అతడి తపస్సుకు ఎలాంటి అంతరాయం కలుగకూడదు. ఇందుకు నీకు సమ్మతమైతే యుద్ధం చేస్తాను" అన్నాడు.
వేల సంవత్సరాల భీకర యుద్ధం - అణిగిన సహస్ర కవచుని గర్వం
నారాయణుని ఒప్పందాన్ని అంగీకరించిన సహస్ర కవచుడు నరుడు తపస్సు చేస్తుండగా, నారాయణునితో భీకర యుద్ధం చేశాడు. అలా వేయి సంవత్సరాలు యుద్ధం చేసిన తర్వాత నారాయణుడు సహస్ర కవచుని శరీరం నుంచి ఒక కవచాన్ని భేదించగలిగాడు. అలసిన నారాయణుడు తపస్సుకు ఉపక్రమించగా, నరుడు సహస్రకవచునితో యుద్ధానికి దిగాడు. మరో వేయి సంవత్సరాలు తర్వాత నరుడు సహస్రకవచుని మరో కవచాన్ని భేదించాడు. ఇలా నరనారాయణులు ఇరువురూ కలిసి ఆ సహస్రకవచుని తొమ్మిది వందల తొంభై తొమ్మిది కవచాలు భేదించారు.
సూర్యుని ఆశ్రయించిన సహస్ర కవచుడు
నర నారాయణులతో చేసిన భీకర యుద్ధంలో 999 కవచాలు పోగొట్టుకున్న సహస్ర కవచుడికి మరణ భయం పట్టుకుంది. మిగిలిన ఒక్క కవచంతో సూర్యుని దగ్గరకు వెళ్లి అభయం కోరగా సూర్యుడు కలకాలం తాను కూడా అభయం ఇవ్వలేనని, నరనారాయణుల అవతార సమాప్తి అనంతరం సహస్ర కవచునికి విడుదల కలిగిస్తానని అంటాడు. సహస్రకవచుడు చేసేదేమి లేక సూర్యుని దగ్గర ఉండిపోయాడు.
సహస్ర కవచుడే కర్ణుడు
కుంతి మంత్ర బలానికి కట్టుబడి వచ్చిన సూర్యుడు ఆ సహస్రకవచునే పసిబిడ్డగా మార్చి, కుంతి చేతికి అందించాడు. అందుకే కర్ణుడు సహజ కవచ కుండలాలతో జన్మించాడు.
జన్మాంతర పాప పరిహారమే కర్ణుని చావుకు మూలం
ఆ సహస్ర కవచునికి మిగిలిన ఒక్క కవచాన్ని భేదించి కర్ణుని రూపంలో ఉన్న సహస్ర కవచుని సంహరించడానికే నర నరనారాయణులు ఇరువురూ కృష్ణార్జునులుగా జన్మించి, కురుక్షేత్ర రణభూమిలో కర్ణుని సంహరించారు. ఇదే కర్ణుని జనన మరణ వృత్తాంతం. చేసిన కర్మల ఫలితం ఎప్పుడో ఒకప్పుడు, ఏదో ఒక జన్మలో అనుభవించక తప్పదని ఈ కథ ద్వారా మనం గ్రహించాల్సిన సత్యం. అందుకే తెలిసి కాని తెలియక కానీ ఎవరికీ చెడు తలపెట్టకూడదు. సాధ్యమైనంత వరకు మంచి పనులు చేయాలి. ఓం నమో నారాయణాయ నమః
ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.