తెలంగాణ

telangana

ETV Bharat / spiritual

ఆ గుడిలో అంజన్నకు చిటికెన వేలు ఉండదు- అలా అని చెక్కితే రక్తమే రక్తం! - Hanuman Special Temple - HANUMAN SPECIAL TEMPLE

Gandi Anjaneya Swamy Temple History In Telugu : భారతదేశంలో ఊరూరా వాడవాడలా హనుమంతునికి ఆలయాలు ఉన్నాయి. హనుమంతుని ఆరాధిస్తే కార్యసిద్ధి, జయం, ఐశ్వర్యం కలుగుతాయని విశ్వాసం. అంతేకాదు హనుమను ఆరాధిస్తే శనిబాధలు కూడా తొలగిపోతాయని జ్యోతిష్య శాస్త్ర పండితులు చెబుతారు. దక్షిణ భారతంలో ఉన్న హనుమ ఆలయాలలో ఒక్కో ఆలయానికి ఒక్కో విశిష్టత ఉంది. హనుమంతునికి చిరంజీవి అన్న నామం కూడా ఉంది. అంటే ఈ భూమిపై హనుమ నేటికీ సజీవంగా ఉన్నాడని చెప్పడానికి సాక్ష్యాలు ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా ఈ ఆలయం హనుమ ఉనికికి నిదర్శనంగా నిలుస్తోంది. అసలేమిటీ ఆలయం ఎక్కడ ఉంది? ఆ విశేషాలేమిటో ఈ కథనంలో తెలుసుకుందాం.

Hanuman Special Temple
Hanuman Special Temple (Getty Images)

By ETV Bharat Telugu Team

Published : Aug 27, 2024, 4:21 AM IST

Gandi Anjaneya Swamy Temple History In Telugu :కడప జిల్లా గండిలోని వీరాంజనేయస్వామి దేవాలయంలో సజీవమైన హనుమాన్ మూర్తిని దర్శించుకోవచ్చు. ఇందుకు నిదర్శనం ఏమిటంటే ఈ ఆలయంలో ఆంజనేయస్వామి విగ్రహానికి చిటికెన వేలు ఉండదు. ఎవరైనా పొరపాటున స్వామి విగ్రహానికి చిటికెన వేలును చెక్కేందుకు ప్రయత్నిస్తే స్వామివారి విగ్రహం నుంచి రక్తం వస్తుంది! అందుకే ఇక్కడి మూర్తిని సజీవ ఆంజనేయ స్వామి మూర్తిగా పేర్కొంటారు. ఈ అద్భుతం వెనుక ఉన్న పౌరాణిక గాథను, ఈ ఆలయ విశేషాలను తెలుసుకుందాం.

సీతాన్వేషణలో గండి క్షేత్రం చేరుకున్న శ్రీరాముడు!
త్రేతాయుగంలో సీతమ్మను రావణాసురుడు అపహరించిన తర్వాత శ్రీరాముడు సీత కోసం లోకమంతటా గాలిస్తూ లక్ష్మణుడితో సహా గండి క్షేత్రానికి చేరుకొంటాడు. త్రేతాయుగం నుంచి వాయు క్షేత్రంగా ప్రసిద్ధి చెందిన గండి క్షేత్రంలో వాయుదేవుడు తపస్సు చేసుకుంటూ ఉంటాడు. శ్రీరాముని రాక తెలిసి రామునికి ఆతిధ్యం ఇవ్వాలని వాయుదేవుడు కోరుకుంటాడు. కానీ సీత జాడ తెలియక విచారంతో ఉన్న శ్రీరాముడు వాయుదేవుడి అభ్యర్థనను సున్నితంగా తిరస్కరిస్తాడు. సీతాన్వేషణలో ఉన్న తాను ఒక్క క్షణం కూడా వృథా చేయలేనని చెప్తాడు శ్రీరాముడు. సీత దొరికిన తర్వాత తప్పకుండా ఇక్కడికి వచ్చి వాయుదేవుని ఆతిథ్యాన్ని స్వీకరిస్తారని శ్రీరాముడు చెబుతాడు.

శ్రీరామునికి వాయుదేవుని ఆతిథ్యం బంగారు తోరణంతో స్వాగతం
ఆంజనేయుని సహకారంతో రావణాసురుని సంహరించి సీతతో కలిసి శ్రీరాముడు అయోధ్యకు తిరిగి ప్రయాణమయినప్పుడు ఈ గండి క్షేత్రానికి వస్తాడు. సీతారాముల రాక గురించి తెల్సుకున్న వాయుదేవుడు శ్రీరామునికి స్వాగతం పలుకుతూ తన తపోబలంతో రెండు కొండలను వేరుచేసే పాపాగ్నీ నదిపై బంగారు తోరణాన్ని నిర్మిస్తాడు. సూర్యకాంతికి ఆ బంగారు తోరణం విభిన్న అందాలతో శ్రీరామ చంద్రుడికి స్వాగతం పలుకుతుంది.

గండి క్షేత్రంలో సేద తీరిన సీతారాములు
గండి క్షేత్రంలోని ప్రకృతి అందాలకు శ్రీరామ చంద్రుడు, సీత, లక్ష్మణుడు పరవశించి పోయి వాయుదేవుని ఆతిధ్యం స్వీకరించడానికి ఈ క్షేత్రంలో కొద్ది సేపు ఆగుతారు.

హనుమ విగ్రహం చెక్కిన శ్రీరాముడు!
ఆ సమయంలో తనకు యుద్ధంలో సహాయం చేసిన హనుమంతుడిని తలుచుకుంటూ శ్రీరామ చంద్రుడు హనుమంతుడి విగ్రహాన్ని అందంగా చెక్కుతాడు. ఇంతలో అయోధ్యకు చేరే సుముహుర్తం దగ్గర పడుతోందని తెలుసుకున్న శ్రీరాముడు ఆ ఆంజనేయుడి విగ్రహాన్ని పూర్తి చేయకుండానే అయోధ్యకు బయలుదేరుతాడు. ఇందుకు ప్రతీకగా ఇక్కడ ఆంజనేయుడి కాలికి చిటికిన వేలు ఉండదు. ఈ విగ్రహానికి చిటికిన వేలు చెక్కడానికి ఎవరు ప్రయత్నించినా విగ్రహం నుంచి రక్తం కారడం వల్ల వారు ఆ ప్రయత్నాన్ని నిలిపివేశారు. ఇదే ఇక్కడ హనుమ సజీవంగా ఉన్నాడని అనేందుకు సాక్ష్యం.

అదృశ్యంగా బంగారు తోరణం
ఇక ఇక్కడ మరో విశేషమేమిటంటే శ్రీరామునికి స్వాగతం పలకడానికి వాయుదేవుడు ఏర్పాటు చేసిన బంగారు తోరణం ఎవరికీ కనిపించదు. కేవలం మహనీయములకు మాత్రమే అది కూడా వారి చరమాంకంలో మాత్రమే కనిపిస్తుంది. ఇందుకు నిదర్శనం 18వ శతాబ్దంలో అప్పటి మద్రాసు రాష్ట్రంలో దత్తమండలాలకు కలెక్టర్​గా ఉన్న సర్ థామస్ మన్రోకు ఈ బంగారు తోరణం కనిపించిన విషయాన్ని ఇప్పటికి కడప గెజిట్​లో కూడా చూడవచ్చు.

శ్రావణ శనివారాలలో విశేష పూజలు
శ్రీరాముడు వాయుదేవుడు ఉన్న గండి క్షేత్రానికి వచ్చింది శ్రావణ మాసంలోనే. అందుకే ఇక్కడ శ్రావణ మాసంలో ప్రత్యేక పూజలు చేస్తారు. ప్రత్యేకించి శ్రావణమాసంలో వచ్చే శనివారాలలో ప్రత్యేక ఉత్సవాలు కన్నుల పండువగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు వేల సంఖ్యలో వస్తారు. చివరి శనివారం వీరాంజనేయుడిని ఒంటెవాహనం పై పురవీధుల్లో ఊరేగిస్తారు. ఇంతటి మహిమాన్వితమైన ఈ ఆలయాన్ని మనం కూడా దర్శిద్దాం. జైశ్రీరామ్!

ముఖ్య గమనిక :పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ఉత్తర రామాయణం ప్రామాణికమా? కల్పితమా? - Uttar Ramayan Explainer In Telugu

శ్రావణ శనివారం ఇలా చేస్తే శని దోషాల నుంచి విముక్తి పక్కా! - Shravana Shanivara Shani Puja

ABOUT THE AUTHOR

...view details