తెలంగాణ

telangana

ETV Bharat / spiritual

ఇంటిని అఖండ ఐశ్వర్యాలతో నింపే కామాక్షి దీపం - ఏ సందర్భాల్లో వెలిగిస్తే మంచిదో తెలుసా? - KARTHIKA MASAM 2024

సిరులనిచ్చే కామాక్షి దీపం - వెలిగించినప్పుడు పాటించవలసిన నియమాలు మీకోసం

Kamakshi Deepam
Kamakshi Deepam (Getty Image)

By ETV Bharat Telugu Team

Published : Nov 19, 2024, 10:03 AM IST

Kamakshi Deepam : కార్తిక మాసంలో దీపారాధనకు ఉన్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. ఈ మాసంలో మామూలు దీపారాధనకు ఇంతటి ప్రాధాన్యత ఉంటే ఇక అత్యంత మహిమాన్వితమైన కామాక్షి దీపానికి ఎంతటి ప్రాధాన్యత ఉంటుందో ఈ కథనంలో తెలుసుకుందాం.

దీపారాధన మహత్యం
వ్యాస మహర్షి రచించిన స్కంద పురాణంలో భాగమైన కార్తిక పురాణంలో వివరించిన ప్రకారం కార్తిక మాసంలో చివరకు ఆరిపోయిన దీపాన్ని వెలిగించినా సరే మోక్షం లభిస్తుందని విశ్వాసం. ఇక ఈ మాసంలో కామాక్షి దీపాన్ని వెలిగిస్తే సిరి సంపదలు, ఐశ్వర్యం సిద్ధిస్తుందని శాస్త్ర వచనం.

కామాక్షి దీపం అంటే!
కామాక్షి దీపం అంటే దీపపు ప్రమిదకు గజలక్ష్మీ చిత్రం ఉంటుంది. ఈ దీపానికి గజలక్ష్మీ దీపం అనికూడా పేరు. ఆ దీపపు వెలుగులో కామాక్షి దేవి నిలిచి ఉంటుంది. కనుక కామాక్షి దీపం అంటారు. సాధారణంగా ఈ కామాక్షి దీపాలు వెండితో తయారు చేసి ఉండడం మనకు తెలుసు.

సర్వ శక్తిమయం కామాక్షి స్వరూపం
కామాక్షి దేవి సర్వదేవతలకు శక్తినిస్తుందని ప్రతీతి. అందుకే కామాక్షి కోవెల తెల్లవారుజామున అన్ని దేవాలయాల కన్నా ముందే తెరుస్తారు. అలానే రాత్రి పూట దేవాలయాలన్ని మూసిన తరువాత మూసివేస్తారు. అమ్మవారి రూపమైన కామాక్షి దీపం వెలిగే ఇల్లు అఖండ ఐశ్వర్యాలతో తులతూగుతుంది.

విలువైన ఆభరణం
కామాక్షీ దీపాన్ని చాలామంది ఖరీదైన నగలతో సమానంగా చూసుకుంటారు. తరాల పాటు ఆ దీపాన్ని కాపాడుకోవడం హిందువుల ఇళ్ళలో ఉండే ఆచారం.

విశేష పర్వదినాల్లో వెలిగించే కామాక్షి దీపం
కామాక్షి దీపం ఇళ్ళలో వ్రతాలూ పూజలు చేసుకునేటప్పుడు, అఖండ దీపాన్ని పెట్టదలచుకున్నప్పుడూ గృహప్రవేశం చేస్తున్నప్పుడు తప్పనిసరిగా ఉపయోగిస్తారు. కామాక్షి దీపము కేవలం ప్రమిదను మాత్రమే కాకుండా అమ్మవారి రూపునూ కలిగి ఉంటుంది. విగ్రహ ప్రతిష్టలలో, గృహప్రవేశాలలో కామాక్షి దీపాన్ని దీపారాధనకు ఉపయోగించడం ఎంతో శ్రేష్టం.

ఈ నియమాలు తప్పనిసరి

  • దీపారాధన చేసినప్పుడు దీపానికి కుంకుమ పెట్టడం ఆచారం.
  • కామాక్షి దీపాన్ని ఉపయోగించినప్పుడు ప్రమిదకు కుంకుమ పెట్టిన చేతితోనే ఆ ప్రమిదకు ఉన్న అమ్మవారి రూపానికి కుంకుమ పెట్టి, పువ్వుతో అలంకరించి, అక్షింతలు వేసి నమస్కరించుకోవాలి.
  • ముఖ్యంగా మంగళ, శుక్రవారాల్లో కామాక్షి దీపం వెలిగించడం శుభకరమని జ్యోతిష్య శాస్త్ర పండితులు తెలియజేస్తున్నారు.
  • కామాక్షి దీపం వెలిగే సమయంలో మధ్యలో దీపం కొండెక్కకుండా చూసుకోవాలి.
  • వీలైనంత వరకు కామాక్షి దీపాన్ని ఆవునేతితోనే వెలిగించడం శ్రేయస్కరం.
  • కార్తిక మాసంలో విశేషించి కామాక్షి దీపపు కుందులను దీపదానం చేస్తే శుభకరమని పండితులు చెబుతున్నారు.

ఈ నియమాలు పాటిస్తూ మనం కూడా కామాక్షి దీపాన్ని వెలిగిద్దాం. సకల శుభాలను పొందుదాం. ఓం శ్రీ కామాక్షి దేవ్యై నమః

ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ABOUT THE AUTHOR

...view details