How Powerful Was Kartaviryarjuna :తెలుగు పంచాంగం ప్రకారం కార్తిక శుద్ధ అష్టమి అంటే నవంబర్ 9వ తేదీ కార్త్య వీర్యార్జునుని జయంతిగా జరుపుకోవాలని పంచాంగకర్తలు సూచిస్తున్నారు.
ఎవరీ కార్తవీర్యార్జునుడు
వేదవ్యాసుడు రచించిన మహాభారతంలో కార్త్య వీర్యార్జుని ప్రస్తావన మూడు సార్లు కనిపిస్తుంది. పాండవులు, ద్రౌపది తీర్థయాత్రలు చేసే సమయంలో మహేంద్రగిరికి చేరుకున్నప్పుడు అక్కడ పరశురాముని సన్నిహితుడు అకృతవ్రణుడి ద్వారా కార్తవీర్యార్జునుడు గురించి తెలుసుకుంటారు. కార్తవీర్యుడి పేరు అర్జునుడు. ఇతను మహిష్మతీ నగరానికి రాజు. దత్తాత్రేయునికి పరమ భక్తుడు ప్రీతి పాత్రుడు. ఆయన అనుగ్రహం ద్వారా బంగారు రథం పొందుతాడు. యుద్ధంలో వేయి చేతులతో ఆయుధాలు విసరగలడు. వర బలంతో అతడు అన్ని ప్రాణుల మీద అధికారం సంపాదించి ఇంద్రుడిని కూడా పీడించాడు. దేవతలు ఇతడిని చంపడానికి విష్ణుమూర్తిని ప్రార్థించారు. ఇదే పరశురాముని జననానికి కారణమయ్యింది.
జమదగ్ని ఆశ్రమ కామధేనువును అపహరించిన కార్త వీర్యార్జునుడు
పరశురాముని తండ్రి జమదగ్ని. అతని వద్ద చక్కటి హోమధేనువు ఉంది. ఒకసారి కార్తవీర్యార్జునుడు మంత్రి, సేనాపతులతో కలసి జమదగ్ని ఆశ్రమంలోని హోమధేనువు మహిమచేత ఎంతో ఆశ్చర్యకరమైన ఆతిథ్యాన్ని స్వీకరించాడు. అక్కడున్న వాళ్ళు అందరూ ఆ గోవు యొక్క మహిమకు ఆశ్చర్యపోయి, "ఇటువంటిది ఒకటి ఈ లోకంలో ఉందా?" అని ప్రశంసించారు. సాటిలేని ఐశ్వర్యంతో విరాజిల్లుతున్న కార్తవీర్యార్జునుడు ఆ ప్రశంసలు విని సహింపలేకపోయాడు. తన సంపదను మించిన సంపదకు సాధనమైన 'గోరత్నం' ఒక సామాన్య బ్రాహ్మణుని వద్ద ఉండటం, తన ప్రతిష్టకు భంగంగా భావించాడు. అలా అనుకోగానే అతను వెంటనే "ఆ గోవును దూడతో సహా రాజధానికి తీసుకొని రండి" అని భటులకు ఆజ్ఞాపించి వెళ్లిపోయాడు.
పరశురాముని ఆగ్రహం
ఆ సమయంలో పరశురాముడు ఆశ్రమంలో లేడు. రాజభటులు హోమ ధేనువును, దూడను బలవంతంగా తీసుకొని వెళ్లిన కొంతసేపటికి పరశురాముడు ఆశ్రమానికి తిరిగివచ్చాడు. అతనిని చూడగానే ఆశ్రమ వాసులందరూ ఎదురువెళ్లి కన్నీళ్లతో కార్తవీర్యుని దౌర్జన్యం గురించి చెప్పారు. ఆ మాటలు వినగానే పరశురాముడు చెప్పలేనంత కోపంతో వెంటనే కవచమును, అక్షయమైన అమ్ముల పొదిని ధరించి, విష్ణు ధనుస్సును, పరశువును తీసుకొని మహిష్మతీ నగరం వైపు పరుగెత్తాడు.
కార్తవీర్యార్జునిపై సమరం
పరశురాముడు పట్టలేని ఆగ్రహంతో తనను చుట్టుముట్టిన సైన్యాన్ని ఒక్క పిడికిలిలో వందల బాణములను సంధించి ప్రయోగిస్తూ, దగ్గరకు వచ్చిన వారిని పరశువుతో వదిస్తూ నిర్మూలించాడు.
పరశురామ పరాక్రమం చూసి కార్తవీర్యార్జునుడు ఆశ్చర్యం
కార్తవీర్యార్జునుడు, పరశురాముడిలో ఉన్న పరాక్రమాన్ని చూసి ఆశ్చర్యపోయి వెంటనే తనకున్న శక్తులను గుర్తు చేసుకుని విజృంభించి, అయిదు వందల చేతులతో అయిదు వందల ధనుస్సులను ధరించి, మిగిలిన అయిదు వందల చేతులతో బాణములను సంధిస్తూ తన రథమును పరశురామునివైపు నడిపించాడు.