Horoscope Today 17th October 2024 : 2024 అక్టోబర్ 17వ తేదీ (గురువారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?
మేషం (Aries) :మేషరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి ఈ రోజు వృత్తి, వ్యాపారాలలో ఏకాగ్రత లోపించి పనితీరు దెబ్బతినవచ్చు. పని పట్ల దృష్టి మరలి పోకుండా జాగ్రత్త వహించాలి. విజయానికి కృషి తప్ప వేరే అడ్డదారులు ఉండవని గ్రహించాలి. అతి తక్కువ సమయంలో ఎక్కువ ప్రయోజనం పొందాలని అత్యాశకు పోతే సమస్యల్లో చిక్కుకుంటారు. ఈ రోజు న్యాయ, చట్టపరమైన కార్యకలాపాల నుండి దూరంగా ఉండండి. ఆర్థిక లావాదేవీలు చేసేటప్పుడు జాగ్రత్త వహించండి. అనారోగ్య సమస్యలు వేధిస్తాయి. నవగ్రహ శ్లోకాలు పఠిస్తే మెరుగైన ఫలితాలు ఉంటాయి.
వృషభం (Taurus) :వృషభరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల శ్రేయస్సు గురించిన శుభవార్త మీకు ఉత్సాహాన్ని కలిగిస్తుంది. చిన్ననాటి స్నేహితులను కలుసుకుని సరదాగా గడుపుతారు. వ్యాపారులకు ఈరోజు ఆశాజనకంగా ఉంది. పెట్టుబడి పెట్టేటప్పుడు ఏది మంచో, ఏది చెడో ఖచ్చితంగా నిర్ధరణ చేసుకోండి. చట్టపరమైన, కోర్టుకి సంబంధించిన విషయాలతో వ్యవహరించేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. ఇష్ట దేవతారాధన శుభకరం.
మిథునం (Gemini) :మిథునరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. తీరికలేని ఇంటి పనులు, బాధ్యతలతో ఈ రోజంతా విశ్రాంతి లేకుండా గడుపుతారు. వృత్తిపరంగా అద్భుతమైన ప్రతిభను కనబరచి అందరికీ ఆదర్శంగా నిలుస్తారు. ఉద్యోగంలో హోదా పెరుగుతుంది. నూతన బాధ్యతలను స్వీకరిస్తారు. మీ చుట్టు పక్కల ఉండేవారిని ఎప్పుడు సంతోషంగా ఉంచే మీ స్వభావం వలన మీకు సమాజంలో మంచి గుర్తింపు వస్తుంది. ఆర్థికంగా పరపతి పెరుగుతుంది. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. శివారాధన శ్రేయస్కరం.
కర్కాటకం (Cancer) :కర్కాటకరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. పరోపకారం చేయాలనే మీ ప్రయత్నం ఫలించదు. వృత్తి వ్యాపారాలలో ఆశించిన ఫలితాలు సాధించేందుకు మరింత శ్రమించాలి. ఉద్యోగంలో పని ఒత్తిడి పెరుగుతుంది. సహచరుల సహకారంతో గట్టెక్కుతారు. కుటుంబంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సందర్భంలో మౌనాన్ని ఆశ్రయించడం మంచిది. అనారోగ్యానికి వైద్య ఖర్చుల నిమిత్తం అధిక ధనవ్యయం ఉండవచ్చు. నూతన ఆదాయ వనరుల కోసం ప్రయత్నిస్తారు. ఆదిత్య హృదయం పారాయణతో మెరుగైన ఫలితాలు ఉంటాయి.
సింహం (Leo) :సింహరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. బుద్ధిబలంతో పనిచేసి అనుకున్నది సాధిస్తారు. వృత్తిపరంగా అత్యున్నత స్థాయికి చేరుకుంటారు. ఆడుతూ, పాడుతూ సరదాగా లక్ష్యాలను సాధిస్తారు. అసూయపరుల విమర్శలు పట్టించుకోవద్దు. ఆర్థికంగా ఉన్నత స్థానానికి చేరుకుంటారు. ఈ రోజు ఓ వ్యక్తి కారణంగా మీ జీవితంలో కీలకమైన మలుపు చోటుచేసుకుంటుంది. నూతన అవకాశాలను అందుకుంటారు. ఆరోగ్యం సహకరిస్తుంది. ఇష్ట దేవతారాధన శుభప్రదం.
కన్య (Virgo) :కన్యారాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. స్నేహితులతో మంచి సమయాన్ని గడపడం మీకు సంతోషాన్ని కలిగిస్తుంది. వృత్తి ఉద్యోగాలలో ఎంత శ్రమిస్తే అంత గొప్ప ఫలితాలు ఉంటాయి. వ్యాపారంలో సానుకూలత ఉంటుంది. వ్యాపార భాగస్వాములతో మంచి సంబంధాలను కలిగివుంటారు. అయితే అనుకోని విధంగా ఆరోగ్యం ఆకస్మికంగా క్షీణించడం వల్ల పరిస్థితి సమస్యాత్మకంగా మారుతుంది. వైద్య ఖర్చుల కోసం చాలా డబ్బు ఖర్చు పెట్టాల్సివస్తుంది. దైవబలం మీద విశ్వాసం ఉంచితే అన్నీ సర్దుకుంటాయి. సూర్య ఆరాధన శ్రేయస్కరం.
తుల (Libra) :తులారాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. తీవ్రమైన కృషితో కష్టించి పనిచేసి మీ రంగంలో రారాజుగా నిలుస్తారు. అందరి ప్రశంసలు అందుకుంటారు. పదిమందికి ఉపాధి కల్పించడానికి మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. మీడియా, పత్రిక రంగాల వారు నూతన అవకాశాలు అందుకుంటారు. సమాజంలో మంచి గుర్తింపు పొందుతారు. మీ నైపుణ్యాన్ని చూసి అంతా ప్రశంసిస్తారు. మీ లక్ష్య సాధనలో ఈ రోజు కొంత అదనపు ఖర్చు చేయాల్సి ఉంటుంది. జీవిత భాగస్వామితో అనుబంధం దృఢపడుతుంది. శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ మేలు చేస్తుంది.
వృశ్చికం (Scorpio) :వృశ్చికరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మీలోని నాయకత్వ లక్షణాలతో టీమ్ లీడర్‌గా ప్రమోషన్ పొందుతారు. వ్యాపారులు వ్యాపార సంబంధిత పనులపై ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. ఆర్థిక వ్యవహారాలలో అప్రమత్తంగా ఉండడం అవసరం. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉండవచ్చు. కార్యసిద్ధి హనుమాన్ ఆరాధనతో మెరుగైన ఫలితాలు ఉంటాయి.
ధనుస్సు (Sagittarius) :ధనుస్సురాశి వారికి ఈ రోజు ప్రతికూల ఫలితాలు ఉండవచ్చు. తీవ్రమైన కోపావేశాల కారణంగా కుటుంబంలో ఘర్షణ పూరిత వాతావరణం ఉంటుంది. కుటుంబంలో శాంతి కోసం మీరు చేసే ప్రయత్నాలు ఏమాత్రం ఫలించవు. వృత్తి వ్యాపారాలలో అనుకోని సవాళ్లు ఎదురవుతాయి. మీ తల్లి గారి అనారోగ్యం ఆందోళన కలిగిస్తుంది. ఆర్థికపరిస్థితి నిరాశాజనకంగా ఉంటుంది. ప్రతికూల ఆలోచనలు వీడితే మంచిది. అభయ ఆంజనేయ స్వామి ఆలయ సందర్శనతో ప్రతికూలతలు తొలగిపోతాయి.
మకరం (Capricorn) :మకరరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ఊహించని ఖర్చులు ఈ రోజు మిమ్మల్ని చుట్టుముడతాయి. ఆదాయం ఆశించిన మేరకు ఉండదు. రుణభారం పెరుగుతుంది. వ్యాపారంలో నష్టాలు చూడాల్సి వస్తుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. ప్రతికూల ఆలోచనలు వీడితే మంచిది. శనిస్తోత్ర పారాయణతో ప్రతికూలతలు తొలగిపోతాయి.
కుంభం (Aquarius) :కుంభరాశి వారికి ఈ రోజు అనుకూలంగా లేదు. గ్రహ సంచారం అనుకూలంగా లేనందున ఈ రోజు చిన్న విషయానికి కూడా అతిగా స్పందిస్తారు. భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడం అవసరం. కోపాన్ని నిగ్రహించుకోండి. ఇంద్రియాలపై అదుపు సాధించండి. లేకపోతే ఇంట్లోనూ, ఆఫీస్‌లోనూ కూడా వాతావరణం ఇబ్బందికరంగా మారుతుంది. సన్నిహితులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడండి. మీ స్వధర్మమే మిమ్మల్ని కాపాడుతుంది. దైవబలం మీద విశ్వాసం ఉంచి పనిచేస్తే పరిస్థితులు మీకు అనుకూలంగా మారుతాయి. హనుమాన్ చాలీసా పారాయణ మనశ్శాంతినిస్తుంది.
మీనం (Pisces) :మీనరాశి వారికి ఈ రోజు సానుకూల ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపారాలలో ఆశించిన ఫలితాలు ఉంటాయి. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. పాత, మధురమైన జ్ఞాపకాలతో ఈ రోజంతా ఆనందంగా గడుపుతారు. డబ్బు ఖర్చు పెట్టే విషయంలో ఆచి తూచి వ్యవహరిస్తే మంచిది. భవిష్యత్ అవసరాల కోసం పొదుపు చేసే దిశగా ఆలోచన చేస్తారు. విదేశాలలో ఉద్యోగం చేయాలని కలలు కనేవారు శుభవార్తలు వింటారు. కుటుంబ సభ్యులతో విహారయాత్రలకు వెళతారు. ఇష్ట దేవతారాధన మేలు చేస్తుంది.