Panasapottu Pulao Recipe in Telugu : ప్రస్తుతం ఆధ్యాత్మిక పూజా కార్యక్రమాలకు ఎంతో ప్రశస్తి పొందిన కార్తికమాసం నడుస్తోంది. ఈ క్రమంలోనే చాలా మంది నాన్‌వెజ్‌కి వీలైనంత దూరంగా ఉంటారు. అలాంటివారికోసం ఒక అద్దిరిపోయే ప్యూర్ వెజ్ ఖీమా పులావ్ రెసిపీ పట్టుకొచ్చాం. అదే.. "పనసపొట్టు పులావ్". చాలా రుచికరంగా ఉండే ఈ రెసిపీ తిన్నాకొద్దీ తినాలనిపిస్తుంది! అలాగే వీకెండ్స్ లేదా ఎప్పుడైనా కాస్త డిఫరెంట్‌గా తినాలనుకున్నప్పుడు దీన్ని ట్రై చేయండి. మరి, ఈ సూపర్ టేస్టీ వెజ్ పులావ్ రెసిపీకి కావాల్సిన పదార్థాలేంటి? ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు :
- బాస్మతి రైస్ - 2 కప్పులు
- నూనె - తగినంత
- బిర్యానీ ఆకులు - 2
- లవంగాలు - 6
- యాలకులు - 8
- షాజీరా - అర టేబుల్‌స్పూన్
- దాల్చిన చెక్క - 3 అంగుళాలు
- అనాస పువ్వు - 1
- మరాటి మొగ్గ - 1
- ఉల్లిపాయ తరుగు - ఒకటిన్నర కప్పు
- అల్లంవెల్లుల్లి పేస్ట్ - ఒకటిన్నర టేబుల్‌స్పూన్
- పనస పొట్టు - 250 గ్రాములు
- గరంమసాలా - 1 టీస్పూన్
- కారం - అరటేబుల్‌స్పూన్
- పసుపు - అరటీస్పూన్
- వేయించిన జీలకర్ర పొడి - 1 టీస్పూన్
- ధనియాల పొడి - అరటేబుల్‌స్పూన్
- టమాటాలు - 2
- పచ్చిమిర్చి - 3
- పెరుగు - పావు కప్పు
- కొత్తిమీర తరుగు - కొద్దిగా
- పుదీనా ఆకులు - చిన్న పిడికెడు
- కసూరి మేతి - 1 టేబుల్‌స్పూన్
- నెయ్యి - 2 టేబుల్‌స్పూన్లు
- ఉప్పు - రుచికి సరిపడా
తయారీ విధానం :
- ఇందుకోసం ముందుగా బాస్మతి రైస్‌ని శుభ్రంగా కడిగి కనీసం అరగంటపాటు నానబెట్టుకోవాలి.
- ఇప్పుడు స్టౌపై ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. నూనె కాస్త వేడయ్యాక బిర్యానీ ఆకులు, లవంగాలు, యాలకులు, షాజీరా, దాల్చినచెక్క, ఆనాస పువ్వు, మరాటి మొగ్గ వేసుకొని 30 సెకన్లపాటు వేయించాలి.
- మసాలాలు వేగాక ఉల్లిపాయ తరుగు వేసి కాస్త రంగు మారేంత వరకు వేయించుకోవాలి. ఆపై అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి.
- అల్లంవెల్లుల్లి వేగిన తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకున్న పనస పొట్టును వేసుకొని అందులోని పసరు వాసన పోయేంత వరకు గరిటెతో కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్ మీద వేయించుకోవాలి. అందుకోసం 4 నుంచి 5 నిమిషాల సమయం పట్టొచ్చు.(పనస పొట్టు బయట సూపర్ మార్కెట్స్‌లో రెడిమేడ్‌గా దొరుకుతుంది)
- ఆవిధంగా మిశ్రమాన్ని వేయించుకున్నాక.. అందులో గరంమసాలా, కారం, పసుపు, వేయించిన జీలకర్ర పొడి, ధనియాల పొడి, తగినన్ని వాటర్ యాడ్ చేసుకొని కలిపి మసాలాలు మాడకుండా నూనె పైకి తేలేంత వరకు వేయించుకోవాలి.
- ఆపై టమాటా చీలికలు వేసుకొని సాఫ్ట్‌గా మారేంత వరకు వేయించాలి. ఆ తర్వాత పెరుగు, పచ్చిమిర్చి చీలికలు, కొత్తిమీర, పుదీనా తరుగు వేసుకొని బాగా వేయించుకోవాలి.
- ఆ తర్వాత కసూరి మేతిని చేతితో నలిచి వేసుకొని వేయించుకోవాలి. అయితే ఇలా వేయించుకునేటప్పుడు పనసపొట్టు అడుగుపట్టే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి అప్పుడు మరికొంత వాటర్ యాడ్ చేసుకొని వేయించుకోవాలనే విషయం గుర్తుంచుకోవాలి.
- పనసు పొట్టు మిశ్రమంలో ఆయిల్ పైకి తేలేంత వరకు వేయించుకున్నాక.. అందులో ముందుగా నానబెట్టుకున్న రైస్‌ని వడకట్టి వేసుకొని గింజ విరిగిపోకుండా నెమ్మదిగా కలుపుతూ మొత్తం కలిసేలా మిక్స్ చేసుకోవాలి.
- మసాలాలు అడుగు పట్టడం మొదలయినట్లు అనిపిస్తే అప్పుడు మూడు కప్పుల వేడి నీరు, నెయ్యి, ఉప్పు, కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకొని కలిపి మూతపెట్టి హై ఫ్లేమ్ మీద 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి.
- ఆ తర్వాత స్టౌ ఆఫ్ చేసి అరగంటపాటు అలా వదిలేసి అనంతరం మూత తీసి వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలు. అంతే.. ఘుమఘుమలాడే " ప్యూర్ వెజ్ ఖీమా పనసపొట్టు పులావ్" రెడీ!
ఇవీ చదవండి :
అయ్యప్ప స్వాములు మెచ్చే "సాత్విక భోజనం" - ఉల్లి, వెల్లుల్లి లేకుండా చక్కగా సిద్ధం చేసుకోండిలా!
అన్నం వండేంత టైమ్‌లోనే "దాల్ బిర్యానీ" రెడీ - పిల్లల లంచ్ బాక్స్‌కు సూపర్ ఆప్షన్!