Holi Festival Importance :మన జీవితంలో రంగులు నింపే హోలీ పండుగ రానే వచ్చింది. ప్రతి ఏడాది ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి నాడు మనం హోలీ పండుగను జరుపుకుంటాం. హోలీ పండుగను హోలికా పూర్ణిమ అని, కాముని పున్నమి అని కూడా అంటారు. మరో విశేషమేమిటంటే శ్రీ మహాలక్ష్మి ఈరోజునే క్షీరసాగరం నుంచి ఉద్భవించింది గనుక ఈరోజున శ్రీలక్ష్మి జయంతిని కూడా హిందువులు జరుపుకుంటారు. పెద్దలు కూడా పిల్లలుగా మారిపోయే ఈ హోలీ పండుగ జరుపుకోవడం వెనుక ఓ పురాణగాథ ఉంది.
హోలికా దహనం ఎందుకు చేస్తారు?
హిరణ్యకశిపుడు అనే రాక్షసుడు శ్రీమహావిష్ణు ద్వేషి. కానీ అతని కుమారుడైన ప్రహ్లాదుడు పరమ విష్ణు భక్తుడు. తన కుమారుడిని ఆయన(విష్ణు) వ్యామోహం లేదా భక్తి నుంచి మరల్చడానికి హిరణ్యకశిపుడు ప్రహ్లాదున్ని ఎన్నో హింసలకు గురి చేస్తాడు. హిరణ్యకశిపునికి హోలికా అనే సోదరి ఉండేది. ఆమెకు అగ్ని వలన ఎలాంటి ప్రమాదం సంభవించకుండా ఒక వరం ఉండేది. ఇదే అవకాశంగా భావించిన హిరణ్యకశిపుడు ప్రహ్లాదున్ని తన ఒళ్లో కూర్చోబెట్టుకొని అగ్ని ప్రవేశం చేయమని తన సోదరిని ఆజ్ఞాపిస్తాడు. తద్వారా ప్రహ్లాదుడు మరణిస్తాడని, తన సోదరికి ఏమి కాదని అనుకుంటాడు. కానీ ఆ శ్రీమహావిష్ణువు తన భక్తులను సదా కాపాడుకుంటూనే ఉంటాడు కదా! అందుకే ఆ అగ్నిలో హోలికా దహనమైపోతుంది. ప్రహ్లాదుడు సురక్షితంగా బయటకు వస్తాడు. ఇందుకు సంకేతంగా హోలీ ముందురోజు రాత్రి హోలికా దహనం చేస్తారు.
హోలీరోజు కామదహనం ఇందుకే చేస్తారు!
హోలీ పండుగ ముందు రోజు రాత్రి చేసే కామదహనం వెనుక ఉన్న కథనం ప్రకారం శివపార్వతుల కల్యాణానికి నడుం బిగించిన మన్మథుడు, ఫాల్గుణ పౌర్ణమి రోజు ధ్యాన నిమగ్నుడైన పరమశివున్ని కామ వికారానికి లోను చేస్తాడు. అందుకు ఆగ్రహించిన పరమశివుడు తన మూడవ కన్నుతో మన్మథుణ్ని దహనం చేస్తాడు. జరిగిన అనర్థం తెలుసుకున్న మన్మథుని భార్య రతీదేవి పరమశివునికి జరిగినదంతా వివరించి తన భర్తను సజీవుణ్ని చేయమని ప్రార్థిస్తుంది. శివుడు మన్మథుడు శరీరం లేకున్నా సజీవుడై ఉంటాడని, ఆమెకు మాత్రం కనిపిస్తాడని చెప్తాడు. ఆనాటి నుంచి ఫాల్గుణ పౌర్ణమి రోజున కామదహనం పేరిట మనం పండుగను జరుపుకుంటాం. కామదహనం అంటే క్షణికమైన కోరికలను దహించి ఆనందంగా జీవించాలని పరమార్థం.
హోలీరోజు రంగులు ఎందుకు చల్లుకుంటారో తెలుసా?
ఒకానొకప్పుడు పాలమీగడ వంటి రంగుగల రాధను చూసి నల్లని కన్నయ్య చిన్న బుచ్చుకుంటుంటే తల్లి యశోద రాధ ముఖానికి ఇదే రోజున ఇంత రంగు పులిమిందట! ఇక అప్పటినుంచి హోలీ రోజున ఒకరిపై ఒకరు రంగులు చల్లుకోవడం ఆనవాయితీగా వస్తోంది. అంతేకాకుండా వసంత రుతువు రాకను ఆహ్వానిస్తూ ఒకరిపై ఒకరు రంగులు చల్లుకొని ఆనందించడం కూడా ఆనవాయితీగా వస్తోంది.