Hidimba Devi Temple History :మన దేశ సంస్కృతి ఎంత గొప్పదంటే- దేవతలతో పాటు, కొన్ని చోట్ల మానవ మాత్రులను కూడా దైవ స్వరూపంగా భావించి దేవాలయాలు నిర్మించి పూజించే ఆచారం ఒక్క మన దేశంలోనే ఉందని చెప్పవచ్చు. అలాగే రాక్షసులకు కూడా గుడి కట్టి పూజించడం ఒక్క భారతదేశంలోనే చూస్తాం. ఓ ఆలయంలో రాక్షసిని పూజిస్తే కోరుకున్న వారితో వివాహం జరుగుతుందని తెలుసా! ఈ ఆలయం వివరాల్లోకి వెళ్లిపోదాం.
కీకారణ్యంలో అతి ప్రాచీన ఆలయం
దట్టమైన అడవుల మధ్య హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం మనాలీలోని ఈ ప్రాచీన దేవాలయంలో పూజలందుకునే దైవం పేరు హిడింబ దేవి. సూర్యకిరణాలు సైతం పడని దట్టమైన అడవిలోఉన్న ఈ ఆలయంలో వెలసిన హిడింబ దేవిని వనదేవతగా, ప్రకృతి దేవతగా భావించి పూజిస్తారు. భక్త జన సందోహంతో ప్రతినిత్యం సందడిగా ఉండే ఈ ఆలయ స్థల పురాణం ఏంటంటే?
స్థలపురాణం
కవిత్రయంగా పేరొందిన నన్నయ్య, తిక్కన, ఎర్రాప్రగడ రచించిన మహాభారతం ప్రకారం పాండవులు అరణ్యవాసం చేస్తున్న సమయంలో ఈ ప్రాంతంలో కొద్ది రోజులు బస చేశారట. ఆ సమయంలో ఈ ప్రాంతంలో రాక్షస జాతికి చెందిన హిడింబాసురుడు, హిడింబ అనే అన్నాచెల్లెళ్లు ఉండేవారు. హిడింబాసురుడు పాండవుల వివరాలు కనుక్కోమని తన చెల్లి హిడింబను పంపుతాడు. ఈ హిడింబాసురుడు గొప్ప బలశాలి. అన్న అంటే పంచప్రాణాలు పెట్టే హిడింబ తన అన్నను యుద్ధంలో ఓడించిన వారినే వివాహం చేసుకోవాలని నిశ్చయించుకుంటుంది.
భీమునిపై మనసుపడ్డ హిడింబ
నిద్రిస్తున్న పాండవులకు కాపలాగా ఉన్న భీముని చూసి మనసు పడ్డ హిడింబ తన అన్న హిడింబాసురుని వల్ల పాండవులకు అపాయం పొంచి ఉందని భీమున్ని హెచ్చరిస్తుంది. అయితే తరువాత జరిగిన యుద్ధంలో భీముడు హిడింబాసురున్ని అంతమొందిస్తాడు. దీంతో హిడింబ తన ప్రేమను భీమునికి తెలిపి తనను వివాహం చేసుకోవాలని కోరుతుంది.
భీముని షరతు
హిడింబను వివాహం చేసుకునే ముందు భీముడు ఇక్కడ తాము కొంతకాలమే ఉంటామని, ఇక్కడ ఉన్నత కాలం మాత్రమే హిడింబతో ఉండగలనని షరతు విధిస్తాడు. అందుకు హిడింబ అంగీకరించి తన ప్రేమను సఫలం చేసుకుంటుంది.
ఘటోత్కచుని జననం
భీమునికి, హిడింబకు ఘటోత్కచుడు జన్మిస్తాడు. అనంతరం పాండవులు అక్కడ నుంచి వెళ్ళిపోయాక హిడింబ అక్కడే తపస్సు చేసుకుంటూ ఉండిపోతుంది. మహాభారత యుద్ధంలో తండ్రి భీముడి ఆదేశం మేరకు యుద్ధానికి దిగి వీరమరణం పొందుతాడు ఘటోత్కచుడు.