Tiruchanur Padmavati Brahmotsavam : తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో కార్తిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 27వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో అమ్మవారి ఆలయంలో ఈ నెల 27వ తేదీన జరగనున్న అంకురార్పణ, విశ్వక్సేన పూజ విశిష్టతను తెలుసుకుందాం.
అంకురార్పణ
తిరుమల శ్రీనివాసునికి వార్షిక బ్రహ్మోత్సవాలు జరిగినట్టుగానే, తిరుచానూరు శ్రీ పద్మావతీ అమ్మవారికి కూడా ప్రతి సంవత్సరం కార్తిక మాసంలో బ్రహ్మోత్సవాలు జరుగుతుంటాయి. బ్రహ్మోత్సవాలు ఎలాంటి అవరోధాలు, ఆటంకాలు లేకుండా నిర్విఘ్నంగా కొనసాగాలని బ్రహ్మోత్సవాల ప్రారంభానికి ఒక రోజు ముందు అంకురార్పణ నిర్వహించడం సంప్రదాయం. ఈ నెల 27వ తేదీ అంకురార్పణ కార్యక్రమం జరుగనున్న సందర్భంగా అసలు అంకురార్పణ అంటే ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
అంకురార్పణ అంటే!
అంకురార్పణ కార్యక్రమంలో భాగంగా అమ్మవారి ఉద్యానవనంలో సేకరించిన పుట్ట మన్నును సాయంత్రం శాస్త్రోక్తంగా ఆలయానికి తీసుకువస్తారు. నవ ధాన్యాలను పుట్ట మన్నులో వేసి అంకురార్ఫణకు శ్రీకారం చుడతారు. వైఖానస ఆగమంలో అంకురార్పణ ఘట్టానికి విశేష ప్రాధాన్యత ఉంది. విత్తనాలు మొలకెత్తడాన్ని అంకురార్పణ అంటారు.
సూర్యాస్తమయం తర్వాతే!
అంకురార్పణలో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే సూర్యుడు అస్తమించిన తరువాతే అంకురార్పణ నిర్వహిస్తారు. జ్యోతిష శాస్త్రం ప్రకారం చంద్రుడిని ‘సస్యకారక’ అంటారు. అంటే పంటలు పండించే వాడని అర్థం. ఈ కారణంగా పగటివేళ కాకుండా సాయంత్రం వేళ మంచి ముహూర్తంలో అంకురార్పణ కార్యక్రమం నిర్వహిస్తారు.
పాలికలలో పవిత్ర విత్తనాలు
అంకురార్పణంలో పలు పవిత్ర విత్తనాలు నాటుతారు. అంకురార్పణంలో నాటే విత్తనాలు బాగా మొలకెత్తుతాయి. విత్తనాలు బాగా మొలకెత్తడం వల్ల ఉత్సవాలు కూడా గొప్పగా జరుగుతాయని విశ్వాసం. విత్తనాలు నాటేందుకు పాలికలు అనే మట్టి కుండలను వినియోగిస్తారు. ఆలయ ప్రాంగణంలో ఉన్న యాగశాలలో ఈ మొత్తం కార్యక్రమం నిర్వహిస్తారు. అత్రి మహర్షి తన ‘సముర్తార్చన అధికరణ’ అనే గ్రంథంలో అంకురార్పణ క్రమాన్ని విపులంగా వివరించారు.