తెలంగాణ

telangana

ETV Bharat / spiritual

గర్భాన సంక్రాంతి పర్వదినాన లక్ష్మీదేవిని పూజిస్తే - సిరుల తల్లి అనుగ్రహం ఖాయం!

తులా రాశి సంక్రమణంతో వచ్చే ఈ రైతుల పండుగ - విశిష్టత మీకు తెలుసా?

Tula Sankranti
Garbhana Sankranti (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Oct 16, 2024, 7:26 PM IST

Updated : Oct 17, 2024, 3:34 AM IST

Garbhana Sankranti : సూర్యుడు ప్రతి నెలా ఒక్కో రాశిలో ప్రవేశిస్తుంటాడు. అక్టోబర్ నెలలో సూర్యుడు కన్యారాశి నుంచి తులారాశిలోకి ప్రవేశించనున్నాడు. ఈ సందర్భంగా తులా సంక్రమణం రోజు ఏ దేవుని ఆరాధించాలి? ఎలాంటి దానాలు చేయాలి? అనే విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

తులా సంక్రమణం ఎప్పుడు
తెలుగు పంచాంగం ప్రకారం, అక్టోబర్ 17వ తేదీ ఉదయం 7:43 నిమిషాలకు సూర్యుడు కన్యారాశి నుంచి తులా రాశిలోకి ప్రవేశించనున్నాడు.

కావేరి నదీ స్నానం ఉత్తమం
తులా సంక్రమణం జరిగిన నెల రోజులు పరమ పవిత్రంగా, శుభకరంగా భావిస్తారు. ఈ మాసంలో పగటికాలం తగ్గుతూ, రాత్రి కాలం పెరుగుతూ వస్తుంది. తులా సంక్రమణం రోజు నదీ స్నానం చేయడం శ్రేష్ఠం. అందులోనూ కావేరీ నదిలో స్నానం చేస్తే ఇంకా మంచిదని జ్యోతిష్య శాస్త్ర పండితులు చెబుతున్నారు.

గర్భాన సంక్రాంతి
తులా సంక్రాంతిని గర్భాన సంక్రాంతి అని కూడా పిలుస్తారు. హిందూ సౌరమాన పంచాంగం ప్రకారం, ఈ రోజు కార్తీక మాసం తొలి రోజు అవుతుంది. ఈ వేడుకను భారతదేశం అంతటా వివిధ ఆచారాలతో జరుపుకుంటారు. ఒక మహిళ తన బిడ్డకు జన్మనిచ్చిన గర్వంతో సంతోషించినట్లు, రైతులు తమ వరి పొలాల్లో పండించిన పంటకు, సాధించిన విజయానికి గుర్తుగా ఈ పండుగను జరుపుకుంటారు. అందుకే తులా సంక్రాంతిని గర్భాన సంక్రాంతి అని కూడా పిలుస్తారు. ప్రత్యేకంగా ఒడిశా, కర్ణాటకలలో తులా సంక్రమణం విశేషంగా జరుపుకుంటారు.

లక్ష్మీ పూజ
తులా సంక్రమణం రోజున లక్ష్మీదేవిని విశేషంగా పూజిస్తే ఆ సిరుల తల్లి అనుగ్రహంతో ఏడాది పొడవునా పంటలు బాగా పండి ఆహారానికి కొరత ఉండదని రైతుల విశ్వాసం. ఈ పర్వదినాన రైతుల కుటుంబాలు లక్ష్మీదేవికి గోధుమ ధాన్యాలు, కూరగాయల మొక్కల కొమ్మలతో పాటు తాజా వరి ధాన్యాలు, తాటి కాయలు, పసుపు, కుంకుమ, గంధం, గాజులు లాంటి మంగళ ద్రవ్యాలను సమర్పించి పంటలు బాగా పండాలని కోరుకుంటారు.

ఈ ప్రాంతాలలో ఇలా!
తులా సంక్రమణం రోజు కర్ణాటక, ఒడిశా వంటి ప్రాంతాలలో పట్టు వస్త్రంలో కప్పిన కొబ్బరికాయను గౌరీ దేవిగా భావించి పూజిస్తారు. ఒడిశాలో ఈ రోజు ధాన్య రాశులను కొలవడం ద్వారా ధన, ధాన్యాలకు లోటుండదని భావిస్తారు. ఇతర పండుగ రోజుల మాదిరిగానే ఈ రోజు లక్ష్మీనారాయణుల, శివ పార్వతుల ఆలయాలను అందంగా అలంకరించి విశేష పూజలు నిర్వహిస్తారు. ముఖ్యంగా ఈ రోజు రైతుల శ్రేయస్సు కోసం పూజిస్తారు కాబట్టి ఇది రైతుల పండుగ.

ఈ దానాలు శ్రేష్ఠం!
తులా సంక్రమణం రోజున బ్రాహ్మణులకు ప్రత్యేకంగా కూరగాయలు, పెసరపప్పు, బెల్లం దానమిస్తే పుణ్య ఫలితాలు కలుగుతాయని పండితులు చెపుతున్నారు. రానున్న తులా సంక్రమణం రోజున పండితులు సూచించిన విధంగా దాన, ధర్మాలు, పూజలు చేద్దాం. ధన, ధాన్యాలు పొందుదాం.

సర్వే జనా సుఖినోభవంతు! లోకా సమస్తా సుఖినోభవంతు! శుభం భూయాత్!

ముఖ్యగమనిక :పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంత వరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

Last Updated : Oct 17, 2024, 3:34 AM IST

ABOUT THE AUTHOR

...view details