Ganpati Bappa Morya Meaning In Telugu :వినాయక చవితి వేడుకల్లో 'గణపతి బప్పా మోరియా' అంటూ అందరూ ఉత్సాహంగా నినాదాలు చేస్తుంటారు. అయితే ఈ మోరియా అనే మాటకు అర్థం ఎవరికీ తెలియదు. అసలు ఈ మోరియా అనే మాట నినాదంగా ఎలా మారింది? ఆ పదానికి గల అర్థం ఏమిటి ? దాని వెనుక ఉన్న అసలు కథ ఏమిటో తెలుసుకుందాం.
మోరియా అసలు కథ
15వ శతాబ్దంలో 'మోరియా గోసాని' అనే సాధువు ఉండేవాడు. అతను మహారాష్ట్రలోని పుణెకు 21 కి.మీ. దూరంలో చించ్ వాడి అనే గ్రామంలో నివసించేవాడు. ఆయన గణపతికి పరమ భక్తుడు. గణపతిని పూజించేందుకు చించ్ వాడి నుంచి మోరే గావ్ వరకు రోజూ కాలినడకన వెళ్లేవాడు.
మోరియాకు గణపతి స్వప్న సాక్షాత్కారం
ఓ రోజు మోరియా నిద్రపోతున్న సమయంలో గణేశుడు కలలో కనిపించి సమీపంలో ఉన్న నదిలో తన విగ్రహం ఉందనీ, ఆ విగ్రహాన్ని తీసుకు వచ్చి ప్రతిష్టించమని చెప్పాడట. కలలో గణపతి చెప్పిన మాట నిజమో కాదో వెంటనే తెలుసుకోవడానికి మోరియా అక్కడున్న నదికి వెళ్లాడు. కలలో గణపతి చెప్పినట్టుగానే నదిలో మోరియాకు వినాయకుడి విగ్రహం దొరికింది.
మోరియా దర్శనానికి బారులు తీరిన జనం
మోరియాకు గణపతి దొరికాడన్న విషయం తెలుసుకున్న స్థానికులు మోరియా గోసావి ఎంత గొప్పవాడు కాకపోతే సాక్షాత్తు వినాయకుడు కలలో కనిపిస్తాడు అంటూ మోరియాను చూసేందుకు తండోపతండాలుగా వచ్చారట. మోరియా గోసావి పాదాలను తాకి మోరియా అనడం మొదలుపెట్టారు. మోరియా గోసావి నిజంగా మంగళమూర్తియే అంటూ మొక్కారట. నది నుంచి తెచ్చిన గణపతి ప్రతిమను తెచ్చి గుడిని నిర్మించాడు.