How Powerful Was Kartaviryarjuna : తెలుగు పంచాంగం ప్రకారం కార్తిక శుద్ధ అష్టమి అంటే నవంబర్ 9వ తేదీ కార్త్య వీర్యార్జునుని జయంతిగా జరుపుకోవాలని పంచాంగకర్తలు సూచిస్తున్నారు.
ఎవరీ కార్తవీర్యార్జునుడు
వేదవ్యాసుడు రచించిన మహాభారతంలో కార్త్య వీర్యార్జుని ప్రస్తావన మూడు సార్లు కనిపిస్తుంది. పాండవులు, ద్రౌపది తీర్థయాత్రలు చేసే సమయంలో మహేంద్రగిరికి చేరుకున్నప్పుడు అక్కడ పరశురాముని సన్నిహితుడు అకృతవ్రణుడి ద్వారా కార్తవీర్యార్జునుడు గురించి తెలుసుకుంటారు. కార్తవీర్యుడి పేరు అర్జునుడు. ఇతను మహిష్మతీ నగరానికి రాజు. దత్తాత్రేయునికి పరమ భక్తుడు ప్రీతి పాత్రుడు. ఆయన అనుగ్రహం ద్వారా బంగారు రథం పొందుతాడు. యుద్ధంలో వేయి చేతులతో ఆయుధాలు విసరగలడు. వర బలంతో అతడు అన్ని ప్రాణుల మీద అధికారం సంపాదించి ఇంద్రుడిని కూడా పీడించాడు. దేవతలు ఇతడిని చంపడానికి విష్ణుమూర్తిని ప్రార్థించారు. ఇదే పరశురాముని జననానికి కారణమయ్యింది.
జమదగ్ని ఆశ్రమ కామధేనువును అపహరించిన కార్త వీర్యార్జునుడు
పరశురాముని తండ్రి జమదగ్ని. అతని వద్ద చక్కటి హోమధేనువు ఉంది. ఒకసారి కార్తవీర్యార్జునుడు మంత్రి, సేనాపతులతో కలసి జమదగ్ని ఆశ్రమంలోని హోమధేనువు మహిమచేత ఎంతో ఆశ్చర్యకరమైన ఆతిథ్యాన్ని స్వీకరించాడు. అక్కడున్న వాళ్ళు అందరూ ఆ గోవు యొక్క మహిమకు ఆశ్చర్యపోయి, "ఇటువంటిది ఒకటి ఈ లోకంలో ఉందా?" అని ప్రశంసించారు. సాటిలేని ఐశ్వర్యంతో విరాజిల్లుతున్న కార్తవీర్యార్జునుడు ఆ ప్రశంసలు విని సహింపలేకపోయాడు. తన సంపదను మించిన సంపదకు సాధనమైన 'గోరత్నం' ఒక సామాన్య బ్రాహ్మణుని వద్ద ఉండటం, తన ప్రతిష్టకు భంగంగా భావించాడు. అలా అనుకోగానే అతను వెంటనే "ఆ గోవును దూడతో సహా రాజధానికి తీసుకొని రండి" అని భటులకు ఆజ్ఞాపించి వెళ్లిపోయాడు.
పరశురాముని ఆగ్రహం
ఆ సమయంలో పరశురాముడు ఆశ్రమంలో లేడు. రాజభటులు హోమ ధేనువును, దూడను బలవంతంగా తీసుకొని వెళ్లిన కొంతసేపటికి పరశురాముడు ఆశ్రమానికి తిరిగివచ్చాడు. అతనిని చూడగానే ఆశ్రమ వాసులందరూ ఎదురువెళ్లి కన్నీళ్లతో కార్తవీర్యుని దౌర్జన్యం గురించి చెప్పారు. ఆ మాటలు వినగానే పరశురాముడు చెప్పలేనంత కోపంతో వెంటనే కవచమును, అక్షయమైన అమ్ముల పొదిని ధరించి, విష్ణు ధనుస్సును, పరశువును తీసుకొని మహిష్మతీ నగరం వైపు పరుగెత్తాడు.
కార్తవీర్యార్జునిపై సమరం
పరశురాముడు పట్టలేని ఆగ్రహంతో తనను చుట్టుముట్టిన సైన్యాన్ని ఒక్క పిడికిలిలో వందల బాణములను సంధించి ప్రయోగిస్తూ, దగ్గరకు వచ్చిన వారిని పరశువుతో వదిస్తూ నిర్మూలించాడు.
పరశురామ పరాక్రమం చూసి కార్తవీర్యార్జునుడు ఆశ్చర్యం
కార్తవీర్యార్జునుడు, పరశురాముడిలో ఉన్న పరాక్రమాన్ని చూసి ఆశ్చర్యపోయి వెంటనే తనకున్న శక్తులను గుర్తు చేసుకుని విజృంభించి, అయిదు వందల చేతులతో అయిదు వందల ధనుస్సులను ధరించి, మిగిలిన అయిదు వందల చేతులతో బాణములను సంధిస్తూ తన రథమును పరశురామునివైపు నడిపించాడు.
కార్తవీర్యార్జుని సంహరించిన పరశురాముడు
పరశురాముడు ఉగ్రుడై ఒక్క వింటిలోనే అయిదు వందల బాణములను సంధించి కార్తవీర్యార్జునుడి ధనుస్సులను ఖండించి, కను రెప్పపాటులోనే రథముపైకి లంఘించి కార్తవీర్యుని వేయి బాహువులను, తలను ఖండించి సింహగర్జనం చేశాడు. అది చూసి కార్తవీర్యుని పదివేల మంది కొడుకులు భయభ్రాంతులై పారిపోయారు. పరశురాముడు దూడతో సహా హోమధేనువును తీసుకొని ఆశ్రమానికి తిరిగి వచ్చి తన తండ్రికి నమస్కరించాడు.
జమదగ్ని మహర్షి హితబోధ
పరశురాముడు తండ్రి వద్దకు వెళ్లి నమస్కరించి యుద్ధ వృత్తాంతమును వివరించాడు. అప్పుడు జమదగ్ని మహర్షి అంతా శాంతంగా విని "నాయనా! నీవు సర్వ దేవమయుడైన మానవేంద్రుని వధించి మహాపాపం చేసావు. మనం బ్రాహ్మణులం కదా! బ్రాహ్మణులు క్షమాగుణం చేతనే పూజలందుకుంటారు. రాజును చంపుట, బ్రహ్మహత్యకన్నా మించిన పాతకము. కాబట్టి విష్ణుదేవుని ధ్యానిస్తూ, తీర్ధములను సేవిస్తూ ఈ పాపమును పోగొట్టుకో" అని సలహా ఇచ్చాడు. తండ్రి ఆదేశంతో పరశురాముడు ఒక సంవత్సరం తీర్థయాత్రలు చేసి పాపరహితుడై తిరిగి వచ్చాడు .
అసలు వాస్తవం ఇదీ!
అసలు కార్తవీర్యార్జునునికి పరశురాముని యుద్ధం రావడానికి గల కారణమేమిటంటే శ్రీమహావిష్ణువు చేతిలోని సుదర్శన చక్రానికి ఒకసారి శ్రీ మహా విష్ణువుతో యుద్ధం చేయాలను అనిపించిందట! మరి అందరి మనోభీష్టాలు తీర్చే ఆ శ్రీమన్నారాయణుడు సుదర్శన చక్రంకు కూడా వరం ఇచ్చాడంట! ఆ చక్రమే తరువాతి కాలంలో కార్తవీర్యార్జునుడుగా జన్మించి సాక్షాత్తు శ్రీమన్నారాయణుని అవతారమైన పరశురామునితో యుద్ధం చేసి మోక్షాన్ని పొందాడు. వేయి బాహువులు ఉన్నాయన్న గర్వంతో విర్రవీగుతున్న కార్తవీర్యార్జుని సంహరించిన తర్వాత నారాయణుడు అతనికి ఒక వరం ఇచ్చాడు. కార్తవీర్యార్జుని స్తుతిస్తూ చేసే కార్తవీర్యస్తోత్రమ్ పఠిస్తే పోగొట్టుకున్నవి తిరిగి పొందుతారని అభయం ఇచ్చాడు.
అందుకే కార్తవీర్యార్జునుని జయంతి రోజు కార్తవీర్యస్తోత్రమ్ పఠిస్తే శత్రు బాధలు ఉండవు పోగొట్టుకున్నవి తిరిగి పొందుతారని విశ్వాసం.
రానున్న కార్తవీర్యార్జునుని జయంతి రోజు మనం కూడా కార్తవీర్య స్తోత్రాన్ని పఠిద్దాం పోగొట్టుకున్నవి తిరిగి పొందుదాం.
జై శ్రీమన్నారాయణ!
ముఖ్యగమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.