Gopashtami Puja 2024 : హిందూ సంప్రదాయంలో గోమాతకు విశిష్ట స్థానముంది. కార్తిక శుద్ధ పాడ్యమి రోజు శ్రీకృష్ణుడు ఇంద్రుడు కురిపించిన రాళ్ల వర్షం నుంచి గోకులాన్ని రక్షించడానికి గోవర్ధన పర్వతాన్ని తన చిటికెన వేలుపై ఎత్తి గొడుగులా పట్టి గోకులాన్ని రక్షిస్తాడు. మొత్తం ఏడు పగళ్లు ఏడు రాత్రులు భీకరంగా రాళ్ల వర్షాన్ని కురిపించిన ఇంద్రుడు చివరకు శ్రీకృష్ణ పరమాత్మ ముందు తన అహంకారాన్ని విడిచిపెట్టి శరణు వేడుతాడు. ఇంద్రుడు శరణు వేడిన కార్తిక శుద్ధ అష్టమి రోజునే గోపాష్టమిగా జరుపుకుంటాం.
గోపాష్టమి ఎప్పుడు?
నవంబర్ 9 వ తేదీ శనివారం కార్తిక శుద్ధ అష్టమి సందర్భంగా ఆ రోజునే గోపాష్టమిగా జరుపుకోవాలని పంచాంగ కర్తలు సూచిస్తున్నారు.
గోపాష్టమి పూజా విధానం
గోవు పరదేవతా స్వరూపము. గోవులకు అధిష్ఠాన దేవత సురభీదేవి. కామధేనువు పరాశక్తియైన లక్ష్మీస్వరూపం. ఆవులో 33 కోట్ల దేవతలు కొలువైవుంటారు. గోవుకే 'మాత' అనే హోదాను ఇచ్చారు. అలాంటి అమ్మలాంటి గోమాతను పూజించే వారికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పండితులు చెప్తున్నారు.
ఇలా పూజించాలి
గోపాష్టమి రోజున గోవులను శుభ్రమైన నీటితో కడిగి, పసుపు కుంకుమలతో అలంకరించాలి. గోవుల కొమ్ములకు రంగుల దారాలు కట్టాలి. గోమాతకు అరటి పండ్లను నైవేద్యంగా ఇవ్వాలి. కర్పూర హారతినిచ్చి గోవుకు మూడు సార్లు ప్రదక్షిణలు చేయాలి. గోవు తోక భాగాన్ని స్పృశించి నమస్కరించాలి. చివరగా గోవుకు వెనుక భాగం నుంచి కర్పూర హారతిని ఇవ్వాలి.
ఇవి తప్పకుండా సమర్పించాలి
గోపాష్టమి రోజు విశేషంగా గోవులకు పశుగ్రాసం, ఆకుపచ్చని బఠాణీలు, గోధుమలు పెడితే సర్వాభీష్టాలు నెరవేరుతాయని శాస్త్రవచనం.
ఏ మంత్రాన్ని జపించాలి
ఈ రోజు విశేషంగా "శ్రీ సురభ్యై నమః" అనే మంత్రాన్ని జపిస్తూ గోవుకు 11 ప్రదక్షిణలు చేస్తే ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు చేకూరుతాయని విశ్వాసం.
రానున్న గోపాష్టమి రోజు మనం కూడా గోపూజ చేద్దాం సకల మనోభీష్టాలు నెరవేర్చుకుందాం.
జైశ్రీకృష్ణ!
ముఖ్యగమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.